పోలిశెట్టి సత్తిరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1939 లో తాపేశ్వరం కాజాను తయారుచేసి, దానికి ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఖ్యాతి సంపాదించి పెట్టిన ప్రముఖుడు పోలిశెట్టి సత్తిరాజు. ఆయన తూర్పు గోదావరి జిల్లా, కె. గంగవరం మండలంలోని బ్రహ్మపురి గ్రామానికి చెందినవారు. అక్కడనుంచి ఉపాధి నిమిత్తం తాపేశ్వరం వలస వచ్చి మండపేటలో మొదట మిఠాయి రామస్వామి అనే వ్యాపారి వద్ద పనిచేసేవాడు. ఇక్కడే పిండి వంటకాలు తయారు చేయడం నేర్చుకున్నాడు. కొంతకాలానికి రామస్వామి అనారోగ్యకారణంతో వ్యాపారం మానేయగా సత్తిరాజు తాపేశ్వరంలో చిన్న హోటల్‌ నెలకొల్పాడు.

దస్త్రం:Bhaktanjaneya sweets.tapeswaram.jpg
తాపేశ్వరం ప్రసిద్ధ కాజాల దుకాణం శ్రీ భక్తాంజనేయ స్వీట్స్

ఆ హోటల్లో తాను నేర్చుకున్న కొన్ని రకాల మిఠాయిలు తయారుచేసి అమ్మేవాడు. దాంతోపాటు వివాహది శుభకార్యాలకు పిండివంటలు తయారు చేసి అందించేవాడు. ఆయన వంటలు వండేటప్పుడు రకరకాల ప్రయోగాలు చేసేవారు. ఆయన మైదాపిండితో మడతలుపెట్టి కాజాలను కొత్తరూపంలో తయారుచేసి, పంచదారపాకం పట్టి అమ్మగా వాటి కమ్మదనం, రుచి కారణంగా అతి తక్కువకాలంలోనే ప్రాచుర్యములోకి వచ్చి తాపేశ్వరం కాజాగా ఖ్యాతి సంపాదించింది.ఇలా వ్యాపారం అభివృద్ధి చెందటంతో 1970 తరువాత హోటల్‌ను విరమించుకుని శ్రీభక్తాంజనేయ స్వీట్‌ స్టాల్‌ను స్థాపించి, మిఠాయి వ్యాపారంపై దృష్టిపెట్టాడు.

ఈ నాడు ఈ తాపేశ్వరం కాజా తయారీ అనేది ఒక కుటీర పరిశ్రమగా మారినది. రాష్ట్రవ్యాప్తంగా తాపేశ్వరం కాజా పేరుతో 300 వరకు స్వీట్ స్టాల్స్ వివిధ పట్టణాలలో గలవు. దీనిపై సుమారు 15000 మందికి పైగా ఉపాది పొందుతున్నారు.

ఇంతటి ప్రఖ్యాతి కెక్కిన తినుబండారమును ప్రజలకందించిన పోలిశెట్టి సత్తిరాజు 1990లో స్వర్గస్థులైనాడు. వీరి తరువాత వీరి భార్య భూషణం, ఆ తరువాత ప్రస్తుతం వీరి కుమారుడు పోలిశెట్టి మల్లిఖార్జునరావు (మల్లిబాబు) వ్యాపారం నిర్వహణ చేపట్టారు

మూలాలు, వనరులు

[మార్చు]