బంగారు పిచిక
బంగారు పిచిక (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , విజయనిర్మల |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ గణేశ్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
బంగారు పిచిక బాపు దర్శకత్వంలో చంద్రమోహన్, విజయనిర్మల, శాంతకుమారి ప్రధాన తారాగణంగా నిర్మించిన 1968 నాటి తెలుగు సినిమా.
సాంకేతికవర్గం
[మార్చు]- పాటలు: ఆరుద్ర
- సంగీతం: కె.వి.మహదేవన్
- కెమెరా: కన్నప్ప
- కూర్పు: సంజీవి
- స్టంట్స్: మాధవన్
- రచన: ముళ్ళపూడి వెంకటరమణ
- దర్శకుడు: బాపు
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్ - వరహాలరాజు
- శాంతకుమారి - రాణీ రాజేశ్వరీదేవి
- విన్నకోట రామన్నపంతులు - సన్యాసిరాజు
- సాక్షి రంగారావు - మేనేజర్ మల్లయ్య
- వడ్లమాని విశ్వనాథం-
- విజయనిర్మల - రాధ
- కాకరాల - పురోహితుడు
- రాజబాబు
- ప్రసన్నరాణి
- జగ్గారావు
కథ
[మార్చు]ఆస్తి అంతస్తు కలిగిన ధనవంతురాలు రాణీ రాజేశ్వరీదేవి (శాంతకుమారి). ఆమె భర్త సన్యాసిరాజు (రామన్న పంతులు). ఏకైక పుత్రరత్నం వరహాలరాజు (చంద్రమోహన్). మేనేజర్ మల్లయ్య (సాక్షి రంగారావు), ఇంటినిండా పనివాళ్లు, వంటవాడు, డ్రైవర్లు కలిగిన భారీ సంస్థానంవంటి కుటుంబం వీళ్లది. భర్తను, కుమారుడిని, అందరినీ అదుపులోవుంచే నేర్పరి రాజేశ్వరిదేవి. భర్త సన్యాసిరాజు పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేస్తుంది రాజేశ్వరీ దేవి. ఊరిలోని ధనవంతులు, వారి కుమార్తెలను ఆహ్వానించి వరహాలరాజుకు స్వయంవరం లాంటిది ఏర్పాటు చేస్తుంది. పార్టీకి వచ్చిన ధనవంతులు తనకంటే తల్లికి వత్తాసు పలకటం, తండ్రి నిస్సహాయంగా నిలబడటం రాజుకు కష్టంగాతోస్తుంది. పార్టీ అనంతరం రాత్రి స్వతంత్రంగా బ్రతికి, ఇష్టమైన పిల్లని పెళ్లాడమని తండ్రి ఇచ్చిన సలహాతో వరహాల రాజు ఇల్లొదిరి వెళ్తాడు. ఆ వూరిలో ఓ మధ్యతరగతి తండ్రి వడ్లమాని విశ్వనాథం, కూతురు రాధ (విజయనిర్మల). వాళ్ల ఇల్లు అప్పుల్లో ఉంటుంది. అప్పుల ఊబినుంచి బయటపడి ఇల్లు తిరిగి పొందాలంటే ధనవంతుడైన వరాహాల రాజును రాధ ప్రేమించి పెళ్లాడాలని పురోహితుడు కాకరాల, మరో మిత్రుడు సలహానిస్తారు. పథకం ప్రకారం వారిని ఒప్పించి, రాజును రాధ కలుసుకునే ఏర్పాటు చేస్తారు. అలా కలిసిన రాధ తాను జమీందారు బిడ్డనని రాజుకు చెబుతుంది. తాను పేదింటి కొడుకునని రాజు చెబుతాడు. అలా ఇద్దరూ కలిసి హైద్రాబాద్‌కు ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో ఒకరిపై ఒకరికి ప్రేమ పుడుతుంది. ఇదిలావుంటే, ఇంటినుంచి వెళ్లిపోయిన కొడుకును వెదకమని రాజేశ్వరి పంపిన నౌకర్లు జల్సాగా తిరగుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరీ దేవి, కొడుకును వెతికేందుకు స్వయంగా బయలు దేరుతుంది. జరిగినదంతా ఓ కుట్ర అని తెలుసుకుని, 50 వేలు చెల్లిస్తుంది. కుట్రకు కారకుడు తన మేనేజర్ మల్లయ్యేనని తెలుసుకుని, కొడుకును రాధనుండి దూరంగా తీసికెళ్లాలనుకుంటుంది. కాని రాధలోని నిజాయితీ తెలుసుకున్న వరహాలరాజు డబ్బు తీసుకున్న మల్లయ్య, బృందాన్ని చావతన్ని రాధను కలుసుకుంటాడు. ఆమెతో పెళ్లికి తల్లి అంగీకారం పొందటంతో చిత్రం ముగుస్తుంది[1].
విశేషాలు
[మార్చు]- ఈ సినిమాకు 1967లో విడుదలైన Three Bites of the Apple అనే అమెరికన్ కామెడీ సినిమా ప్రేరణ.
- ఈ సినిమా ఎక్కువ భాగం అవుట్ డోర్ షూటింగులో నడిచింది. వికారాబాదు పరిసరాలలో సినిమాను చిత్రీకరించారు.
- అప్పట్లో ఈ చిత్రానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చయింది.
- ఇదే సినిమాను 1994లో నరేష్, దివ్యవాణిలు ప్రధాన పాత్రధారులుగా రంగుల్లో పెళ్ళికొడుకు అనే పేరుతో పునర్మించారు. అయితే ఆ సినిమా విజయవంతం కాలేదు.
పాటలు
[మార్చు]- కృష్ణా ఆలకించు నా బాధ అంటున్నది రాధ - పి.సుశీల , రచన: ఆరుద్ర
- ఏంచేసుకునేది ఇంత వెన్నెల ఎచట దాచుకోవాలి కంటి మిలమిల - పి.సుశీల, రచన: ఆరుద్ర
- పో పో నిదురపో నిదుర వచ్చినా రాకున్నా నిదురపో - పి.సుశీల , రచన:ఆరుద్ర
- ఓహోహో బంగరు పిచుకా పలుకలేని పంచదార చిలుక - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , రచన: ఆరుద్ర
- మనసే గని తరగని గని తగ్గని గని పనిలో పని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత , రచన:ఆరుద్ర
మూలాలు
[మార్చు]- ↑ "బంగారు పిచిక - సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 20-10-2018". Archived from the original on 2018-11-05. Retrieved 2018-11-02.