Jump to content

బకింగ్‌హాం కాలువ

వికీపీడియా నుండి
1753 కాలపు కోరమాండల్ తీరం ఫ్రెంచి మ్యాపు, ఇందులో బకింగ్ హామ్ కాలువ పాత రూపం చూపబడింది.

బకింగ్‌హాం కాలువ, దక్షిణ భారతదేశం లోని కోరమాండల్ తీరం వెంట ప్రయాణించే నావికా యోగ్యమైన ఉప్పునీటి కాలువ. 420 కిలోమీటర్లు పొడవున్న ఈ కాలువ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నుండి తమిళనాడు లోని విల్లుపురం జిల్లా వరకు విస్తరించి ఉంది. చెన్నై దగ్గర, ఈ కాలువ తో అనుసంధానమైన ఉన్న సహజ సిద్ధమైన సముద్రపు కాలువ ద్వారా మద్రాసు నౌకాశ్రయముతో కలుపుతుంది. ఆంగ్లేయులు కట్టించిన ఈ కాలువ బ్రిటిషు పాలనా కాలములో ప్రధాన జలరవాణా మార్గముగా అభివృద్ధి చెందింది.

చరిత్ర

[మార్చు]
విజయవాడ దగ్గర బకింగ్‌హాం కాలువ

బకింగ్ హాం కాలువ బ్రిటిష్ వారి హయాంలో ఇది ఒక వెలుగు వెలిగి ఇప్పటి పాలకుల నిర్లక్ష్యంతో పెద్దగా ఉపయోగించబడకుండా ఉంది. 1806లో బకింగ్ హాం కెనాల్ నిర్మాణం ప్రారంభించబడింది. తమిళనాడు లోని మరక్కాణం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లోని పెద్దగంజాం దాక ఇది ఉంది. దక్షిణాన చెన్నై నుంచి మరక్కాణం (పాండిచెర్రికి ఉత్తరాన ఉంది) దాకా 163 కి.మీ ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ కాలువ 257 కి.మీ. పొడవుంది. 1876, 1878 లో కరువు కోరల్లో చిక్కుకున్న దక్షిణ భారతావనిని ఇది కాపాడింది. 1880 నుంచి 1940 దాక, తక్కువ ఖర్చులో ఇది ప్రజల, సరకుల రవాణా సౌకర్యానికై బాగా ఉపయోగపడింది. 1947 నుంచి దీన్ని ఉపయోగించటం తగ్గింది. 1965 తుఫానుతో కాలువ దెబ్బతినింది. 2004 సునామి సందర్భంలో ఈ కాలువ సముద్రపు నీటికి అడ్డుకట్టై నిలిచి ఎందరో బెస్తవారిని, చాలా గ్రామాలను రక్షించింది. సముద్రానికి సుమారు 1 కి.మీ. దూరంలో ఈ కాలువ కోస్తా తీరంలో ఉంది. భారత ప్రభుత్వం తలపెట్టిన జాతీయ జల మార్గాల ప్రాజెక్టు లోని జలమార్గం 4 లో ఈ కాలువ భాగం.

పేరు

[మార్చు]

ఈ కాలువకు అసలు పేరు కొక్రేన్ కాలువ. 1852లో పులికాట్ నుంచి దుగరాజపట్నం వరకు ఈ కాలువ పొడిగింపు కార్యక్రమం చేపట్టినప్పడు కాలువ పేరు ఈస్ట్ కోస్ట్ కాలువగా మార్చారు. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ 1880లో నెల్లూరు అధికారిక ప్రకటనలో భాగంగా కాలువను సందర్శించిన సందర్భంగా ఈ కాలువకు ఆయన పేరు పెట్టారు. ఈ కాలువ నిర్మాణంలో ఆయన పాత్ర లేకపోయినా అప్పటి అధికార రాజకీయాలే కారణమని భావించేవారు.[1]

నిర్మాణం

[మార్చు]

బకింగ్ హాం కాలువ నిర్మాణం దశవారీగా జరిగింది. 1801లో ఈ కాలువ నిర్మాణం మద్రాసు ప్రెసిడెన్సీ చేపట్టింది. నిర్మాణ పనులు ఒక ప్రైవేటి కంపెనీకి అప్పగించారు. హీసెక్, బాసెల్ నిర్మాణ బాధ్యతలు స్వీకరించి మద్రాసు నుంచి ఎన్నూరు వరకు 11 మైళ్ళు నిర్మాణం చేపట్టారు. 1802లో బాధ్యతలు స్వీకరించిన కొక్రేన్ 1806లో 11మైళ్ళ కాలువ నిర్మాణం పూర్తి చేశారు. ఆయన పేరన ఈ కాలువకు కొక్రేన్ కెనాల్ గా పేరు పెట్టారు. ఆ తర్వాత ఎన్నూరు నుంచి పులికాట్ వరకు 25మైళ్ళ నిర్మాణం చేపట్టి 1837లో కొక్రేన్ భారతదేశం వదిలి తన స్వంత దేశం వెళ్ళిపోయారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఈతకోట, సుబ్బారావు (సెప్టెంబరు 2010). "బకింగ్ హామ్ కాలువ ఆంగ్లేయిలకాలం నాటి చరిత్ర". అలనాటి నెల్లూరు (1 ed.). హైదరాబాద్: పాలపిట్ట బుక్స్. pp. 38–41.

బయటిలింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.