బయ్యా నరసింహేశ్వరశర్మ
సర్ బయ్యా నరసింహేశ్వరశర్మ, స్వాతంత్ర్య సమరయోధుడు, వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు. మితవాది, దాత. విశాఖపట్నంకు చెందిన నరసింహశర్మ 1913లో బాపట్లలో ప్రారంభమైన ఆంధ్ర మహాసభ తొలి అధ్యక్షుడు. నరసింహేశ్వరశర్మ విశాఖపట్నం జిల్లా తుమ్మపాలలో 1867, జనవరి 6న జన్మించాడు. ఈయన తండ్రి మహాదేవ శాస్త్రి. శర్మ మెట్‌కాఫ్ స్కాలర్‌షిప్పుతో ఎఫ్.ఏ పూర్తిచేశాడు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల నుండి బి.ఏ ఉత్తీర్ణుడై, లా చదివి, 1898లో విశాఖపట్నం బార్ సంఘంలో చేరాడు.[1] కొన్నాళ్ళు కలకత్తాలో రైల్వే ధరల సిఫారుసు సంఘానికి అధ్యక్షునిగా పనిచేశాడు.
నరసింహేశ్వరశర్మ, స్వాతంత్ర్యోద్యమంలోని మితవాద నాయకుల్లో ఒకడు. మాంటెగూ చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలను తిరస్కరిస్తూ అమృత్‌సర్ కాంగ్రేసు సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ, శర్మ ఒక్కడే ప్రసగించాడు. ఈ ప్రసంగానికి మెచ్చి బ్రిటీషు ప్రభుత్వం ఈయన్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కాన్సిల్లో సభ్యత్వం ఇచ్చి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రెవెన్యూ సభ్యునిగా నియమించింది. రాజధానిని మార్చేందుకు స్థలం నిర్ణయించే సంఘంలో అనధికార సభ్యునిగా కూడా ఈయన్ను నియమించింది.[2]