Jump to content

బుర్రా శేషగిరిరావు

వికీపీడియా నుండి
బుర్రా శేషగిరిరావు
బుర్రా శేషగిరిరావు
జననంబుర్రా శేషగిరిరావు
1884
విజయనగరం జిల్లా, భీమునిపట్నం మండలం తాటితుర్రు గ్రామం
మరణం1941
వృత్తిఅధ్యాపకుడు, విజయనగరం మహారాజా కళాశాల
రీడర్, ద్రవిడ శాస్త్ర విభాగం
ఉద్యోగంమద్రాసు విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిపత్రికా సంపాదకుడు, రచయిత
Notable work(s)అభిషేకరూపకము,
బొబ్బిలి ముట్టడి,
ఉభయ మత సజాతీయత
మతంహిందూ
తండ్రిబుర్రా లచ్చన్న

బుర్రా శేషగిరిరావు, (1884-1941) విజయనగరం జిల్లాకు చెందిన పండితుడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

బుర్రా శేషగిరిరావు 1884లో విజయనగరం జిల్లా, భీమునిపట్నం మండలానికి చెందిన తాటితుర్రు గ్రామంలో జన్మించాడు.[1] ఇతని తండ్రి బుర్రా లచ్చన్న విజయనగరం రాజావారి సంస్థానంలో రెవెన్యూ ఉద్యోగిగా పనిచేశాడు. ఇతని పదవయేట తండ్రి మరణించడంతో ఇతని మేనమామ బుర్రా పార్వతీశం పంచన చేరాడు. బుర్రా పార్వతీశం పర్లాకిమిడి జమీందారీలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. శేషగిరిరావు గిడుగు రామమూర్తి శిష్యరికంలో పర్లాకిమిడిలో ఎఫ్.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. అనంతరం బి.ఎ. కొరకు ఇతడు విజయనగరం వెళ్లాడు. అక్కడ ఇతడు బి.ఎ.లో ప్రతిభను కనబరిచి మెక్‌డోనాల్డ్ పతకాన్ని సంపాదించాడు. ఆ తరువాత ఇతడు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఎ. చదివాడు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మార్ట్ హంటర్‌కు ఇతడు అత్యంత ప్రియశిష్యుడిగా ఉన్నాడు.

ఉద్యోగం

[మార్చు]

విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఇతడు విజయనగరం రాజావారి కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరి 30 సంవత్సరాలు పనిచేశాడు. ఇతడు ఆంగ్ల విభాగపు అధిపతిగా పదవీ విరమణ చేశాడు. ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయంలో ద్రావిడ శాస్త్ర విభాగంలో రీడర్‌గా కూడా పనిచేశాడు.

ఇతర విశేషాలు

[మార్చు]

ఇతడు విజయనగరం నుండి 1920లో వెలువడిన కళలు అనే సాహిత్యమాసపత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. అంతరిస్తున్న కళలను, భారతీయ జ్ఞానాన్ని పరిరక్షించడానికి విజయనగరం రాజా పూసపాటి అలక నారాయణ గజపతి రాజు సహకారంతో ఆంధ్ర భారతీతీర్థ అనే సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ సంస్థకు విజయనగరం రాజా తరువాత జయపుర సంస్థానాధిపతి రాజా విక్రమదేవ వర్మ ఉపకులపతిగా పనిచేశాడు. విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయానికి 1931-33 ప్రాంతాలలో అధ్యక్షునిగా పనిచేశాడు. ఇతడు గిడుగు రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు లతో కలిసి వ్యవహారిక భాషోద్యమంలో పాలుపంచుకున్నాడు.

రచనలు

[మార్చు]

ఇతనికి సాహిత్య పరిశోధన అత్యంత అభిమాన విషయం. ఇతడు ఆంధ్రుల చరిత, కళింగ చరిత్ర, ఆంధ్ర సాహిత్యం, ఆంధ్రలో జైనమతం మొదలైన అంశాలపై అనేక వ్యాసాలను వ్రాశాడు. జైన దర్శనము - ముక్తి తత్త్వము, సముద్రగుప్త శాసనము - కళింగచరిత్ర మొదలైన వ్యాసాలు ఇతని రచనలలో ముఖ్యమైనవి. ఇతని రచనలలో కొన్ని:

  • అభిషేకరూపకము
  • బొబ్బిలి ముట్టడి
  • ఉభయ మత సజాతీయత
  • శ్రీ గురజాడ అప్పారావుగారి డైరీలు (సంపాదకత్వం)
  • ఆంధ్ర ప్రబంధముల చరిత్రము - ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1910

మూలాలు

[మార్చు]
  1. వేపచేదు, శ్రీనివాసరావు (1 May 2008). "Seshagirirao Burra (1884-1941)". శ్రీ వేపచేదు విద్యాపీఠము (124). Retrieved 23 November 2016.