బూరాడ గున్నేశ్వరశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బూరాడ గున్నేశ్వరశాస్త్రి ప్రఖ్యాత శతావధాని, ఆదర్శోపాధ్యాయుడు, గ్రంథ రచయిత, సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు 1914లో విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నంలో జన్మించాడు.[1] ఇతడు విజయనగరం మహారాజా సంస్కృతకళాశాలలో విద్యాభ్యాసం చేసి భాషాప్రవీణ పట్టా సంపాదించాడు. భీమునిపట్నంలోని పురపాలకోన్నత పాఠశాలలో ఇతడు తెలుగు పండితుడిగా కొంతకాలం పనిచేశాడు. తరువాత అక్కడి జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి పదవీవిరమణ గావించాడు. ఆయుర్వేద వైద్యాన్ని సాధన చేసి కొత్తకొత్త ఆవిష్కరణలను, వాటి ఫలితాలను ప్రకటించాడు.

సాహిత్య రంగం[మార్చు]

ఇతడు అవధానాలతో పాటు సాహితీరూపకాలైన భువనవిజయం, త్రైలోక్యవిజయం మొదలైనవాటిలో కవుల పాత్రలను పోషించి మెప్పించేవాడు. ఇతడు పలుచోట్ల అనేక సాహిత్యోపన్యాసాలు చేశాడు. ఎన్నో గ్రంథాలను రచించాడు.

రచనలు[మార్చు]

ముద్రిత గ్రంథాలు[మార్చు]

 1. ఆత్మబోధ
 2. ఎదగని పెళ్ళాం (నవల)
 3. పువ్వు
 4. గురుమూర్తి
 5. రాజమండ్రి శతావధానము
 6. మురళి
 7. వాణీ విహారం

అముద్రిత రచనలు[మార్చు]

 1. రాధావిలాసం (గీతగోవిందం పద్యానువాదం)
 2. లచ్చిమి (జానపద గేయకావ్యం)
 3. పునర్వివాహం
 4. తాగుబోతు (నాటిక)
 5. అఘాయిత్యం
 6. ఛందస్సు
 7. భళిర కర్ధ (బుఱ్ఱకథ)
 8. హరిజన విజయం (నాటకం)
 9. గొల్లసాధు మొదలైనవి.

అవధాన రంగం[మార్చు]

ఇతడు 1930 నుండి మూడు దశాబ్దాలపాటు కలకత్తా నుండి మద్రాసు వరకు అనేక ప్రాంతాలలో అవధానాలు చేశాడు. ఇతడు వందకు పైగా అష్టావధానాలు, శతావధానాలు నిర్వహించాడు. ఇతడు రాజమండ్రిలో చేసిన శతావధానము పుస్తకరూపంలో ముద్రింపబడింది.

అవధానాల నుండి కొన్ని పద్యాలు[మార్చు]

ఇతడు అవధానాలలో పూరించిన పద్యాలలో కొన్ని "రాజమండ్రి శతావధానం", "వాణీవిహారం" గ్రంథాలలో ప్రకటించబడ్డాయి. ఆ పద్యాలలో కొన్ని మచ్చుకు:

సమస్యాపూరణ[మార్చు]

 • సమస్య: నలుగురి యంగవైభవ మనాథుల కబ్బె ధరాతలంబునన్

పూరణ:

వెలయగ మేఘముల్ గగనవీధిని గప్పెను శీతవాయువుల్
సొలసొల వీయగా గురియుచుండెను దుక్కిపొలాల బెడ్డలన్
ఫలముదయింపజేయ నొకపట్టున భోరున గాలితోడ వా
నలు గురియంగ వైభవ మనాథుల కబ్బె ధరాతలంబునన్

 • సమస్య: ఒక్కటి తక్కువైన యెడ నొప్పుగ దొమ్మిదియే పదయ్యెడున్

పూరణ:

చక్కని గోడపై గలదు సారెకు టిక్కుటకంచు గొట్టుచున్
నిక్కువమైన కాలమును నేర్పుగ జూపుచు శ్రాంతిలేకయే
యక్కట సేవజేయు గడియారమునందలి రోమ నంకెలం
దొక్కటి తక్కువైనయెడ నొప్పుగ దొమ్మిదియే పదయ్యెడున్

దత్తపది[మార్చు]

 • విత్తి, హత్తి, మొత్తి, సత్తి అను పదాలతో భారతార్థములో తేటగీతి

విత్తి జూదాన గలహంపు విత్తనములు
హత్తి కృష్ణుని సాహాయ్యమంది తుదకు
మొత్తి కౌరవులను బాంధవులు జయింప
సత్తి ధర్మమునకు గల్గె జగతియందు

 • రామ-లక్ష్మణ-భరత-శతృఘ్న నాలుగు పదములతో సంధికి వచ్చిన శ్రీకృష్ణునితో దుర్యోధనుడు అన్న మాటలు.

భళిరా మత్సరి వౌదు వర్జునుని గెల్వన్ గర్ణుడున్నాడుగా
కొలయన్ లక్ష్మణ బాలవీరు డభిమన్యుం జీల్చి చెండాడు వా
రలకేదీ విజయంబు ఈ భరత సామ్రాజ్యంబు మాదే యగున్
యిల శతృఘ్నుల మౌదు మోయి హరి! నీకేలా దురాలాపముల్

వర్ణన[మార్చు]

 • సూర్యోదయ వర్ణన:

అది రోదరోంతర భావి కార్య కలనా ప్రారంభ సంశోభితా
భ్యుదయా భంగ విహంగ సంగతరవాభోగావకీర్ణ స్థలా
స్పద సంభావిత వృక్ష చక్షణ కళాభాగ్యస్థితారోగ్య కృ
ద్గతి తావాస విలాస లాలస ముషఃకాలమ్ము శోభిల్లెడిన్

మూలాలు[మార్చు]

 1. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యా సర్వస్వము (ప్రథమ ముద్రణ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 287–292.