బేతాళ జాన్‌కవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బేతాళ జాన్ కవి అసలు పేరు బేతాళ వెంకయ్య. తెలుగు క్రైస్తవ కీర్తనకారుడు. 1840 లో గుంటూరులో జన్మించారు. తల్లిదండ్రులు తాపీ పని చేసే వారు.చిన్నతనంలో వెంకయ్య మిషనరీ బంగళాలో పంకా పుల్లర్ గా పనిచేశారు. మిషనరీ పాఠశాలలో విద్యనేర్చుకొన్నారు.తన పేరును జాన్ గా మార్చుకొన్నాడు. బేతాళ జాన్ ఆంధ్ర లూథరన్ సంఘ గురువులలో మూడవవారు. మొదట 1875 లో ఉపదేశిగా పరిచర్యను ప్రారంభించి, రెండు సంవత్సరాల తరువాత గురువుగా నియమించబడ్డారు. పల్నాడు లోని దాచేపల్లి కేంద్రంగా చేసికొన్నారు. ఈయన ఆయుర్వేద వైద్యుడు కూడా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథంలో కనబడే తొలి కీర్తన, “అన్ని కాలంబుల-నున్న యెహోవా" ఈయన వ్రాసిందే. పూర్వం క్రైస్తవ వివాహాల్లో పాడడానికి పెళ్ళిపాటలు లేక వాళ్ళు కూడా హిందూ పాటల్నే పాడుకొనేవారు. ఈ అవసరతను గుర్తించిన జాన్‌ తన కుమార్తె వివాహ సందర్భంగా “జయమంగళం సదా శుభ మంగళం", మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు….” అని రెండు వివాహ కీర్తనల్ని వ్రాసి తానే పాడి అల్లుడికి కట్నంగా చదివించారట. నేటికీ ఈ కీర్తనల్ని తెలుగు క్రైస్తవ వివాహాల్లో పాడుతున్నారు. బేతాళ జాన్‌ కవి వ్రాసిన పాటలన్నీ యతి, ప్రాస, రాగ, తాళ, లయలతో ఉంటాయి. 1895లో పరమపదించారు.

మూలాలు[మార్చు]