Jump to content

భామా కలాపం

వికీపీడియా నుండి
(భామాకలాపం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం కూచిపూడి నృత్యనాటకానికి సంబంధించినది. ఇదే పేరుగల ఇతర వ్యాసాలకు ఇక్కడ చూడండి.

భామా కలాపం కూచిపూడి నృత్యము లోని ఒక పేరుపొందిన నృత్యనాటకము.

భామా కలాపం అనే పేరులో "భామ" కృష్ణుడి అందమైన, అసూయాపరురాలైన సతీమణి సత్యభామను ఉద్దేశించగా, "కలాపం" "కలహము"ను సూచిస్తోంది. ఈ నృత్యరూపకము 17వ శతాబ్దంలో సిద్దేంద్ర యోగి చే కూచిపూడి కథకులకై రూపొందించబడింది. ఈ నృత్యరూపకము కథాకళి, యక్షగానము లలోని మగటిమి ఉట్టిపడే తాండవ కదలికలకు భిన్నంగా స్త్రీ త్వము ఉట్టిపడే లాస్యపు కదలికలు కలిగి ఉంటుంది.

సిద్ధేంద్రయోగి అంతకుముందే భాగవతులచేత అనేక వేషాలు వేయించియున్నాడు. శ్రీకాకుళంలోని ఆంధ్రవిష్ణువు దేవాలయంలో దేవదాసీలు భగవంతుని సేవగా చేసే నృత్యాన్ని పరిశీలించియున్నాడు. ఉడిపిలో సంగీత, సాహిత్య అభినయాలను కూలంకషంగా అభ్యసించాడు. సిద్ధేంద్రయోగి గురువైన నారాయణతీర్థులు సంస్కృతంలో రచించిన కృష్ణలీలా తరంగిణి, తెలుగులో రచించిన పారిజాతాపహరణమూ దక్షిణదేశంలో అప్పటికే ప్రచారంలో ఉన్నాయి. పారిజాతాపహరణం కథనే తెలుగులో "పారిజాతం" అనే పేరుతో నృత్యనాటికగా సిద్ధేంద్రయోగి రచించాడు. అదే "భామాకలాపం"గా ప్రసిద్ధి చెందింది. ఆ భామాకలాపాన్ని కూచిపూడిలోని బ్రాహ్మణుల పిల్లలకు బోధించాడు. కూచిపూడిలో పుట్టిన ప్రతిమగపిల్లవానికి సిద్ధేంద్రుని పేరుచెప్పి, ముక్కు కుట్టి, కాలిగజ్జె కట్టి, ఆ పిల్లవాడు పెద్దయ్యాక ఏ వృత్తిని అవలంబించినా గాని స్వామి సన్నిధిలో భామవేషం వేసి తీరాలని, స్త్రీలకు ఈ కళలో ప్రవేశం ఉండరాదని సిద్ధేంద్రుడు శాసించాడు. ఆ నియమం చాలాకాలంవరకూ కొనసాగింది.

వృత్తాంతము

[మార్చు]

భామాకలాపం రచనావిధానం యక్షగానరీతిలో ఉన్నాగాని, దాని ప్రదర్శన రీతి విశిష్టమైనది. భామాకలాపంలో నృత్యము, సంగీతము ప్రాధాన్యత వహిస్తాయి. ఇందులో నాయిక సత్యభామ. నాయకుడు కృష్ణుడు. చెలికత్తె మాధవి మరో ముఖ్యమైన పాత్ర. 'కలాపము' అంటే 'కలత' లేదా 'కలహము' అని అర్ధము.

భామాకలాపము విఘ్నేశ్వరస్తుతితో (శ్రీ విఘ్నేశ్వర పాదపద్మములనే సేవించి నా యాత్మలో అని) ఆరంభమవుతుంది. ఆ వెనుక సరస్వతీ ప్రార్థన ఉంటుంది. వెన్నెలపదం పాడుతూ సత్యభామ ప్రవేశించడంతో కథ ఆరంభమవుతుంది. నీవెవరవు అని చెలికత్తె అడుగుతుంది. అప్పుడు సత్యభామ

భామనే సత్యభామనే
భామరో శృంగార జగదభిరామనే
ముఖవిజిత హేమాధామనే
ద్వారకాపురాఢ్యురామనే
వయ్యారి సత్యాభామనే

అనే దరువును పాడుతుంది. ఆ వెనుక అత్తమామల ప్రశస్తి చెప్పి, సత్యభామ హరి ఎక్కడున్నాడని అడిగి, అనంతరం భూదేవిని ప్రశంస్తిస్తుంది. తరువాత దరువు, వెన్నెల పదము, మరికొన్ని దరువులు శ్రీకృష్ణునితో కలిసి పాడుతుంది. ఈ సందర్భం లోనే దశావతార వర్ణన సంవాదపూర్వకంగా సాగుతుంది. మంగళహారతితో భామాకలాపం ముగుస్తుంది.

మార్పులు

[మార్చు]

కాలక్రమేణ, భామాకలాపం కొన్నిమార్పులు పొందింది. సిద్ధేంద్రుని పారిజాతంలో తొలిఘట్టమే భామాకలాపం. అయితే అనంతర ప్రదర్శనలలో పారిజాతం కథను తీసివేసి, సత్యభామ అష్టవిధ కథానాయికలుగా అభినయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలా మార్పులు చేసినవారిలో ముఖ్యుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆకివీడు వాస్తవ్యుడు మంగు జగన్నాథ పండితుడు . సిద్ధేంద్రునికి రెండువందల సంవత్సరాల తరువాతివాడు.

మొదట్లో ఈ కలాపాలను కూచిపూడి భాగవతులు (మగవారు) మాత్రమే స్త్రీవేషాలు ధరించి ప్రదర్శించేవారు. తరువాత, క్రమంగా మహిళలు భామాకలాపం ప్రదర్శనలో అగ్రగాములైనారు. క్రమంగా కళావంతుల మహిళలు కూడా కూచిపూడి విద్వాంసులవద్ద శిక్షణ పొంది, ప్రదర్శనలు ఇవ్వసాగారు. అంతే గాకుండా కొందరు ఇతర రాష్ట్రాలవారూ, ఇతర దేశాలవారూ ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

సుమారు ఐదు వందల సంవత్సరాలక్రిందట ఆరంభమైన ఈ భామాకలాపం కళారీతి ప్రస్తుతం మూడు రీతులలో ప్రవర్ధిల్లుతున్నది. (1) కృష్ణ, గుంటూరు జిల్లాలలో ప్రచారంలో ఉన్న భామాకలాపం కూచిపూడి సాంప్రదాయంపై ఆధారపడి ఉంది. (2) పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో దేవదాసీలు ప్రచారం చేసిన శైలి లాస్యపద్ధతిపై ఆధారపడి ఉంది. (3) విశాఖ, గోదావరి జిల్లాలలో "ద్రుపద బాణీ" ప్రచారంలో ఉంది.

సిద్ధేంద్రుడు రచించిన భామాకలాపమే కాకుండా, ప్రస్తుతం ఇతర రచయితల భామాకలాపాలు సైతం వారి వారి బాణీలలో పాడడం జరుగుతూ ఉంది. మనదేశంలో ఇరవైవరకు భామాకలాపాలు ప్రచారంలో ఉన్నాయి.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలం: తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.

మూలాలు, వనరులు

[మార్చు]

మూలం: తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.