Jump to content

మధ్య ప్రాచీన శిలాయుగం

వికీపీడియా నుండి

ప్రాచీన శిలాయుగం (Paleolithic Age) లో రెండవ దశను "మధ్య ప్రాచీన శిలాయుగం" (Middle Paleolithic Age) గా పేర్కొంటారు. ఈ దశ సుమారు 3 లక్షల సంవత్సరాల కాలం నుండి 30,000 సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. అయితే ప్రపంచ మంతటా ఈ కాల విభజన ఏకరీతిగా లేదు. ఒక్కో ప్రాంతంలో లభ్యమైన పురావస్తు ఆధారాలను (ప్రాచీన శిలా పనిముట్లు) బట్టి ఆయా ప్రాంతాలలో ఈ కాల విభజన కాస్త అటూ ఇటుగా వుంటుంది. 'మధ్య ప్రాచీన శిలాయుగం' తరువాత 'ఉత్తర ప్రాచీన శిలా యుగం' (Upper Paleolithic Age) ప్రారంభమైంది.

ప్రాచీన శిలాయుగం - దశలు కాల నిర్ణయం

[మార్చు]

ప్రాచీన శిలాయుగాన్ని పేలియోలిథిక్ యుగం (Paleolithic Age) లేదా పాత రాతి యుగం (Old Stone Age) లేదా తొలి రాతి యుగం (Early Stone Age) అని కూడా వ్యవహరిస్తారు. ఇది సుమారు 33 లక్షల సంవత్సరాల కాలం నుండి క్రీ.పూ. 10,000 సంవత్సరాల వరకూ కొనసాగింది. మానవజాతి చరిత్రలో అతి సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రాచీన శిలాయుగాన్ని తిరిగి మూడు విభాగాలుగా వర్గీకరించారు. అవి.

  1. పూర్వ ప్రాచీన శిలాయుగం (Lower Paleolithic Age): ఇది సుమారుగా 33 లక్షల సంవత్సరాల కాలం నుండి 3 లక్షల సంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది. పూర్వ ప్రాచీన శిలాయుగం మలి ప్లియోసీన్ (Late Pliocene) శకంలో ప్రారంభమై మధ్య ప్లీస్టోసిన్ (Middle Pleistocene) శకంలో ముగిసింది.
  2. మధ్య ప్రాచీన శిలాయుగం (Middle Paleolithic Age): ఇది సుమారుగా 3 లక్షల సంవత్సరాల కాలం నుండి క్రీ.పూ. 30,000 సంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది.
  3. ఉత్తర ప్రాచీన శిలాయుగం (Upper Paleolithic Age): ఇది సుమారుగా క్రీ.పూ. 30,000 నుండి క్రీ.పూ. 10,000 వరకూ కొనసాగింది.

అయితే పై దశలలో ఏ ఒక్క దానికి కూడా కాల విభజనలో ప్రత్యెక పరిధి అంటూ ఏదీ లేదు. పరిణామ క్రమంలో పాత సంప్రదాయాలు కొనసాగుతూ వుంటుంటే వాటితో పాటు కొత్త సంప్రదాయాలు కూడా ఆవిర్భవించి పాతవాటితో పాటూ కొనసాగాయి. అంటే మధ్య ప్రాచీన శిలాయుగం, పూర్వ ప్రాచీన శిలాయుగాన్ని పూర్తిగా కనుమరుగు చేయదు. మధ్య ప్రాచీన శిలాయుగాన్ని ఉత్తర ప్రాచీన శిలాయుగం పూర్తిగా నెట్టి వేయదు.

మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతి - లక్షణాలు

[మార్చు]

మధ్య ప్రాచీన శిలాయుగం నాటికి ఆదిమ మానవులు రాతి పనిముట్లను తయారు చేయడంలో కొన్ని అభివృద్ధి కరమైన మార్పులు సాధించారు. ఈ కాలంలో వారి పనిముట్ల సంస్కృతి పూర్తిగా పెచ్చు పనిముట్ల (Flake-tools) తయారీకి పరివర్తన చెందింది.

ఇదివరకు వారికి గులకరాళ్ళను ప్రత్యక్షంగా పనిముట్ల తయారీలో వాడటమే తెలుసు గాని దాని నుంచి తీసిన పెచ్చులను (Flakes) పనిముట్ల తయారీలో ఉపయోగించడం అంతగా తెలీదు. మధ్య ప్రాచీన శిలాయుగంలో వారు రాతి పెచ్చులను మాత్రమే పనిముట్ల తయారీలో వినియోగించారు. రాతితో చేసిన పనిముట్లు కన్నా, రాళ్ళ పై తీసిన పెచ్చులతో చేసిన పనిముట్లు మరికొంత పరిణితి చెందినవి. శిలా పరికరాల తయారీలో భగ్నమైన పెచ్చులను (Flakes) కూడా తిరిగి ఉపయోగపడేటట్లుగా తిరిగి చెక్కడం అనే ప్రక్రియ (Reflaking or Retouching technology) వీరికి కొంతవరకు తెలిసింది.

అనగా మధ్య ప్రాచీన శిలాయుగంలో మూల రాతి పనిముట్ల సంస్కృతి (core-tool culture) పూర్తిగా పెచ్చు పనిముట్ల సంస్కృతి (Flake-tool culture) కు పరివర్తన చెందింది. ఆ కారణంగా చెలియన్ (Chellian culture), అషులియన్ (Acheulean culture) చేతి గొడ్డళ్ళు ఈ యుగంలో కనిపించవు. పెచ్చు పనిముట్ల తయారీ పై మాత్రమే ఆధారపడిన మౌస్టేరియాన్ (Mousterian Culture), లెవలోషియన్ (Levalloisian culture) వంటి సంస్కృతులు ఈ యుగంలో యూరప్ లో అభివృద్ధి చెందాయి.

ఈ యుగంలో ఉపయోగించిన పరికరాలు గోకుడు రాళ్ళు (Scrapers), చెక్కుడు రాళ్ళు (burins - బ్యూరిన్), రంధ్రకాలు (Borers), మొనదేలిన రాతి ముక్కలు (Points), గుండ్రని రాళ్ళు (Discs). ఈ కాలం నాటి పనిముట్లు సాధారణంగా చెర్ట్ (Chert), జాస్పర్ (Jasper) ఇసుక శిలల నుండి తయారు చేయబడ్డాయి.

మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన ఆవాసాలు బయల్పడిన ప్రదేశాలు

[మార్చు]

మధ్య ప్రాచీన శిలాయుగపు మానవులు ఉపయోగించిన శిలా పరికరాలు, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల లోను, గుహలలోను విసృతంగా లభించాయి.

ప్రపంచవ్యాప్తంగా మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన ముఖ్య ప్రదేశాలు

[మార్చు]
ఖండం  దేశం మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన ఆవాసాలు బయల్పడిన ప్రదేశాలు
ఆసియా ఇజ్రాయెల్ అముద్ గుహ (Amud Cave)
ఇరాక్ సానిదర్ గుహ (Shanidar cave)
ఇరాన్ బిస్టున్ (Bitun), వార్వాసి (Warwasi), Mar Traik, కైరాం (Kiaram), ఖలె బోజి గుహలు (Qaleh Bozi caves)
సిరియా Dawara
టర్కీ కరైన్ గుహలు (Karain caves)
యూరప్ రుమేనియా బైలె హేర్క్యులానే (Băile Herculane) (మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతితో పాటు మధ్య శిలాయుగ సంస్కృతి)
యు.కె క్రెస్ వెల్ క్రాగ్స్  Creswell Crags (ఇంగ్లాండ్), Lynford Quarry  (ఇంగ్లాండ్)
జర్మనీ కొనిగ్ సా (Königsaue), నియాండర్తల్ (Neandertal)
క్రొయేషియా క్రాపినా నియాండర్తల్ ప్రాంతం (Krapina Neanderthal Site), విండిజా గుహ (Vindija Cave)
ఫ్రాన్స్ లీ మౌస్టియర్ (Le Moustier), మౌస్టేరియన్ (Mousterian)
స్పెయిన్ ఆతాపురేకా పర్వత ప్రాంతం (Atapuerca Mountains)
ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా కాంగో గుహలు (Cango Caves), క్లాసిస్ నదీ గుహలు (Klasies River Caves)
లిబియా హౌవ ఫిటేహ గుహ (Haua Fteah cave) 

వీటిని కూడా చూడండి

[మార్చు]

భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగం

రిఫరెన్స్‌లు

[మార్చు]
  • Ancient India by Ram Sharan Sharma
  • Palaeolithic Period: Lower, Middle and Upper Palaeolithic Period [1]
  • Stone Age [2] Encyclopedia Britanica
  • Paleolithic Period [3] Enc
  • దక్షిణ భారత దేశ చరిత్ర, వి. సుందర రామశాస్త్రి, తెలుగు అకాడమి
  • ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి (ప్రాక్ పురాయుగం - క్రీ.పూ. 500 వరకు), MLK మూర్తి, AP History Congress