భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాచీన శిలాయుగం (Paleolithic Age) లో రెండవ దశను "మధ్య ప్రాచీన శిలాయుగం" (Middle Paleolithic Age) గా పేర్కొంటారు. భారతదేశంలో ఈ దశ సుమారు క్రీ.పూ. 1,50,000 సంవత్సరాల కాలం నుండి క్రీ.పూ. 35,000 సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది.[1] అయితే భారతదేశమంతటా ఈ కాల విభజన ఏకరీతిగా లేదు. ఒక్కో ప్రాంతంలో లభ్యమైన పురావస్తు ఆధారాలను (ప్రాచీన శిలా పనిముట్లు) బట్టి ఆయా ప్రాంతాలలో ఈ కాల విభజన కాస్త అటూ ఇటుగా వుంటుంది. మధ్య ప్రాచీన శిలాయుగం తరువాత ఉత్తర ప్రాచీన శిలా యుగ దశ (Upper Paleolithic Age) ప్రారంభమైంది. మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతి ప్రధానంగా పెచ్చుతో చేసిన పనిముట్ల సంస్కృతికి (flaked tool culture) చెందినది.

భారత దేశంలో ప్రాచీన శిలాయుగం - కాల నిర్ణయం

[మార్చు]

భారత దేశానికి సంబంధించి నంతవరకూ ప్రాచీన శిలాయుగ విభజన కాల వ్యవధులు క్రింది విధంగా ఉన్నాయి.

 1. పూర్వ ప్రాచీన శిలాయుగం (Lower Paleolithic Age): ఇది సుమారుగా క్రీ. పూ. 6 లక్షల సంవత్సరాల కాలం నుండి 1.5 లక్ష సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది.[1] (భారతదేశంలో పూర్వ ప్రాచీన శిలాయుగం యొక్క కాల వ్యవధి మధ్య ప్లీస్టోసిన్ (Middle Pleistocene) శకానికి సంబంధించినది మాత్రమే.
 2. మధ్య ప్రాచీన శిలాయుగం (Middle Paleolithic Age): ఇది సుమారుగా క్రీ.పూ. 1,50,000 నుండి క్రీ.పూ 35,000 వరకూ కొనసాగింది.[2]
 3. ఉత్తర ప్రాచీన శిలాయుగం (Upper Paleolithic Age): ఇది సుమారుగా క్రీ.పూ. 35,000 నుండి క్రీ.పూ. 10,000 వరకూ కొనసాగింది.[1]

అయితే దక్కన్ పీఠభూమిలో క్రీ.పూ. 35,000 నుండి క్రీ.పూ. 1500 వరకూ మధ్య, ఉత్తర ప్రాచీన శిలాయుగంనకు సంబంధించిన పనిముట్లు బయల్పడాయి.[2]

అయితే పై మూడు దశలలో ఏ ఒక్క దానికి కూడా ప్రత్యేక పరిధి అంటూ ఏదీ లేదు. పరిణామ క్రమలో పాత సంప్రదాయాలు కొనసాగుతూ వుంటుంటే వాటితో పాటు కొత్త సంప్రదాయాలు కూడా ఆవిర్భవించి పాతవాటితో పాటూ కొనసాగాయి. అంటే మధ్య శిలాయుగం (Mesolithic Age) అనేది ప్రాచీన శిలాయుగం (Paleolithic Age) ను పూర్తిగా కనుమరుగు చేయదు. మధ్య శిలాయుగాన్ని నవీన శిలాయుగం (Neolithic Age) పూర్తిగా నెట్టి వేయదు. ప్రాచీన శిలాయుగం చివరి దశ, మధ్య శిలాయుగం మొదటి దశ రెండూ కలసి కొనసాగాయి. మధ్య శిలాయుగం చివరి దశ, నవీన శిలాయుగం మొదటి దశ రెండూ కలసి కొనసాగాయి. ఉదాహరణకు బెలాన్ నదీ లోయ (ఉత్తర ప్రదేశ్), నాగార్జునకొండ (ఆంధ్ర ప్రదేశ్) లాంటి ప్రాంతాలలో అయితే ప్రాచీన శిలాయుగ సంస్కృతి అన్ని దశల నుండి నవీన శిలాయుగ సంస్కృతుల వరకు శిలాయుగ సంస్కృతి అవిచ్ఛన్నంగా కొనసాగింది.[3]

ప్రాథమికంగా మధ్య ప్రాచీన శిలాయుగం అనేది పెచ్చుతో చేసిన పనిముట్లు (Flaked Tools) ప్రాబల్యం వహించిన దశ కాబట్టి, దేశ కాల పరిస్థితుల కారణంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోను ఈ దశ ఒకే కాలంలో వ్యాపించ లేదు. అషూలియన్ సంస్కృతికి చెందిన చేతి గొడ్డళ్ళు క్రమేణా పాదాన్యం కోల్పోతూ ఆ స్థానాన్ని పెచ్చుతో చేసిన పనిముట్లు ఆక్రమించడం అనే పరివర్తన నిదానంగా జరిగడం వలన భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా కాలక్రమం కనిపిస్తుంది. ఉదాహరణకు హెచ్. డి. సంకాలియా (H. D. Sankaliya) దక్షిణ భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగం 25,000 సంవత్సరాలనాటిదని తెలిపారు.[4] క్లార్క్, విలియమ్స్ ప్రకారం ఉత్తర, మధ్య భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగం 40,000 నుండి 50,000 సంవత్సరాల క్రితం వరకు వుందని,[5] మిశ్రా మధ్య ప్రాచీన శిలాయుగాన్ని భారతదేశానికి అంతటకు అనువర్తిస్తే 1,25,000 to 40,000 ఏళ్ల నాటిదని తెలియ చేసారు.[5] చరిత్ర కారుడు ఆర్.యస్. శర్మ ప్రకారం భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగం కాలావధి క్రీ.పూ. 1,50,000 నుండి 35,000 వరకు అని తెలియచేసారు.[2]

భారత దేశంలో మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతి - ముఖ్య లక్షణాలు

[మార్చు]

పూర్వ ప్రాచీన శిలాయుగంలో వలె ఈ సంస్కృతికి చెందిన ప్రాఛీన మానవ జాతి సమూహాలు కూడా సంచార జీవితం (Nomadic) గడుపుతూ దేశ దిమ్మరులుగా తిరిగేవారు. వీరి ఆవాస స్థానాలు నదీ లోయలు, వాగులు వంటి జలాశయ తీర సమీపంలోనే ఉన్నాయి. ఆహార సేకరణే వీరి ప్రధాన వృత్తి. ఆహార సంపాదనకు రాతి పనిముట్లును వాడేవారు. వీరికి రాతి నుంచి తీసిన పెచ్చులను (Flakes) పనిముట్ల తయారీలో ఉపయోగించడం బాగా తెలిసింది. పెచ్చులతో చేసిన పనిముట్లను (Flaked Tools) అధికంగా ఉపయోగించారు. జంతువులను వేటాడి ఆహార సముపార్జన చేసేవారు. మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన ఆదిమ మానవుల పనిముట్లలో flaked tools ప్రబలంగా వుండి విశిష్టంగా కనిపిస్తాయి. ఈ దశలో వీరు తయారు చేసి ఉపయోగించిన పనిముట్లు మొరటుగానే ఉన్నప్పటికీ పరికరాల తయారీలో పరిణితి కనిపిస్తుంది. గుహలలో బొమ్మలు గీయడం ఇంకా నేర్వలేదు.

పెచ్చుతో చేసిన పనిముట్ల సంస్కృతి (Flaked Tool Culture)

[మార్చు]

మధ్య ప్రాచీన శిలాయుగం నాటికి ఆదిమ మానవులు రాతి పనిముట్లను తయారు చేయడంలో మరింత అభివృద్ధి కరమైన మార్పులు సాధించారు. ఈ కాలంలో వారి పనిముట్ల సంస్కృతి మూల రాతి పనిముట్ల నుండి పూర్తిగా 'పెచ్చు పనిముట్ల' (Flake-tools) తయారీకి పరివర్తన చెందింది. అందువలన మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతిని ప్రధానంగా 'పెచ్చుతో చేసిన పనిముట్ల సంస్కృతి' (flaked tool culture) గా పరిగణిస్తారు. ఈ దశలో ఉపయోగించిన పరికరాలలోను, వాటి తయారీలలోను వచ్చిన మార్పులు.

పరికరాల తయారీలో నూతన పద్దతులు ఉపయోగించడం

[మార్చు]

శిలా పరికరాల తయారీలో భగ్నమైన పెచ్చులను (Flakes) కూడా తిరిగి ఉపయోగపడేటట్లుగా తిరిగి చెక్కడం అనే ప్రక్రియ (Reflaking or Retouching technology) వీరికి తెలిసింది.

పరిణితి చెందిన పరికరాలు

[మార్చు]

వీరు రాతి నుండి తీసిన పెచ్చులను మాత్రమే పనిముట్ల తయారీలో వినియోగించారు. రాతితో చేసిన పనిముట్లు కన్నా, రాళ్ళ పై తీసిన పెచ్చులతో చేసిన పనిముట్లు మరికొంత పరిణితి చెందినవి. ఈ పరికరాలు పూర్వ ప్రాచీన శిలాయుగ పనిముట్లతో పోలిస్తే సైజులో మరింత చిన్నవిగాను, తక్కువ మందంతోను, తక్కువ బరువుతోనూ ఉన్నాయి.

పరికరాలలో వైవిధ్యత

[మార్చు]

ఈ దశలో ఉపయోగించిన పనిముట్ల రకాలలో కూడా వైవిధ్యం కనిపిస్తుంది. ఈ దశలో ఆదిమ మానవుడు ఉపయోగించిన పరికరాలలో ముఖ్యమైనవి గోకుడు రాళ్ళు (Scrapers), చెక్కుడు రాళ్ళు (burins - బ్యూరిన్), రంధ్రకాలు (Borers), మొనదేలిన రాతి ముక్కలు (Points), గుండ్రని రాళ్ళు (Discs), చిన్న తరహా చేతి గొడ్డళ్ళు. పూర్వ ప్రాచీన శిలాయుగ పనిముట్లుతో పోలిస్తే మధ్య ప్రాచీన శిలాయుగ పనిముట్లు ఆహార సముపార్జనకే కాకుండా ఇతరత్రా ఉపయోగపదేవిగా భావించవచ్చు. ఉదాహరణకు గోకుడురాళ్ళు (Scrapers) చెట్ల బెరళ్ళను, జంతువుల చర్మాలను శుభ్రపరచడానికి, చదును చేయడానికి ఉపయోగపడేవి. రంధ్రకాలు (borers) తోళ్ళకు రంధ్రాలు చేయడానికి మొనలను (points) వేటలో వినియోగించడం జరిగివుండవచ్చు.

మధ్య ప్రాచీన శిలాయుగంలో మూల రాతి పనిముట్ల సంస్కృతి (core-tool culture), పూర్తిగా పెచ్చు పనిముట్ల సంస్కృతి (Flake-tool culture) కు పరివర్తన చెందిన కారణంగా అషులియన్ (Acheulean culture) చేతి గొడ్డళ్ళు ఈ యుగంలో కనిపించవు. అయితే ఈ పరివర్తన నిదానంగా జరగడం వల్ల, పెచ్చు పనిముట్ల తయారీ పై ఆధారపడిన ఈ సంస్కృతిలో అషులియన్ కన్నా భిన్నమైన చిన్న తరహా చేతి గొడ్డళ్ళు వంటివి కనిపిస్తాయి.

పనిముట్ట్టు తయారీకి కావలిసిన రాయిని ఎంచుకోవడంలో మార్పు

[మార్చు]

ఈ కాలం నాటి పనిముట్లు సాధారణంగా చెర్ట్ (Chert), జాస్పర్ (Jasper), కాల్సేడనీ (Chalcedony), క్వార్ట్జ్ (Quartzite) వంటి కఠిన శిలల నుండి తయారు చేయబడ్డాయి. అంటే వీరు ఒకవైపు పూర్వ దశలో ఉపయోగించిన క్వార్జైట్ (Quartzite), క్వార్ట్జ్ (Quartz), బసాల్ట్ (Basalt) వంటి శిలలను కొనసాగిస్తూనే అదనంగా చెర్ట్, జాస్పర్, కాల్సేడనీ వంటి ఇసుకరాయిలను కూడా ఉపయోగించారు. అయితే వీరికి ఎముకతో గాని, దంతాలతో గాని పనిముట్లు చేయడం ఇంకా తెలీదనే చెప్పాల్సివుంటుంది.

భారత దేశంలో మధ్య ప్రాచీన శిలాయుగానికి చెందిన ప్రధాన ఆవాసాలు

[మార్చు]

నెవాసన్ సంస్కృతి (Nevasa Culture)

[మార్చు]

పూర్వ ప్రాచీన శిలాయుగ సంస్కృతి, ఉత్తర ప్రాచీన శిలాయుగ సంస్కృతి లవలె కాకుండా భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతి స్పష్టంగా గుర్తించబడలేదు. అయినప్పటికీ భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతిని నెవాస సంస్కృతి అని వ్యవహరిస్తారు. నెవాస ప్రాంతం గోదావరికి ఉపనది అయిన ప్రవర నది తీరంలో ఉంది. 1956 లో సంకాలియా చేసిన అన్వేషణలో మహారాష్ట్ర లోని నెవాసా (Nevasa) ప్రాంతంలో 'ప్రవర' నదీ లోయ ప్రాంతంలో మధ్య ప్రాచీన శిలాయుగానికి చెందిన 'పెచ్చుతో చేసిన పనిముట్లు' [గోకుడు రాళ్ళు (Scrapers), చెక్కుడు రాళ్ళు, బ్యూరిన్‌లు, రంధ్రకాలు (Borers) వంటివి] అధిక సంఖ్యలో దొరికాయి. నెవాసాలో ప్రాచీన శిలాయుగాలకు చెందిన రెండు దశల (పూర్వ, మధ్య దశలు) కు చెందిన పరికరాలు కూడా పుష్కలంగా లభించాయి.

భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన ముఖ్య ప్రదేశాలు

[మార్చు]

భారత దేశమంతటా మధ్య ప్రాచీన శిలాయుగ ఆవాసాలు వైవిధ్య పూరితమైన పర్యావరణ వ్యవస్థలలో బయల్పడాయి. పీఠభూములలోను (చోటా నాగపూర్, దక్కన్ పీఠభూములలో), మైదానాల్లోనూ, తీర వ్యవస్థలలోను వ్యాపించి ఉన్నాయి.

రాష్ట్రం మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన పనిముట్లు బయల్పడిన ప్రదేశాలు
ఉత్తరప్రదేశ్ బెలాన్ లోయ (Belan Valley)
రాజస్తాన్ లూని నదీ లోయ (luni valley),దిద్వానా (Didwana), జైసల్మీర్, వాడ గావ్ (Wadgaon), కదామలి (Kadamali) నదీ మైదాన ప్రాంతాలు, హోక్ర బేసిన్ (Hokra basin), బుద్ధ పుష్కర్ (Budha Pushkar)
గుజరాత్ ఒర్సాంగ్ లోయ (Orsang valley)కి చెందిన భాందర్ పూర్ (Bhandarpur)
మహారాష్ట్ర నెవాసా, చిక్రి (Chikri), చందోలి (Chandoli), కొరేగావ్ (Koregaon), సురేగావ్ (Suregaon), కాలేగావ్ (Kalegaon), శికాపూర్ (Shikarpur), నందూర్ మధ్మేశ్వర్ (Nandur Madhmeshwar), ఖండవిలి (Khandvili), బొరివిలి (Borivili)
మధ్యప్రదేశ్ భీమ్ బేత్క (Bhimbetka), సామ్నాపూర్ (Samnapur), దామో (Damoh),  నర్మదా నదీ పరీవాహక ప్రాంతం
ఒరిస్సా బుహార్ బలాంగ్ లోయ (Buharbalang valley)కి చెందిన మయూర్ భంజ్ ( Mayurbhang), హరిచందనపూర్ (Harichandanpur), చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతాలు
తెలంగాణ ఆదిలాబాద్ పీఠభూమి
ఆంధ్రప్రదేశ్ నాగార్జునకొండ, రేణిగుంట, గిద్దలూరు, సాతానికోట, 
కర్నాటక  మల్లప్రభ బేసిన్,  ఘటప్రభ బేసిన్, అనగావాడి (Anagawadi), బాగల్ కోట (Bagalkot), తమిన్ హాల్ (Taminhal), ఆల్మట్టి (Almatti), కోవల్లి (Kovalli), అనగ్వాడి (Anagwadi), సాల్వడిగి (Salvadigi), హునసగి-బైచ్బాల్ లోయ (Hunasagi-Baichbal Valley), గుల్బర్గా జిల్లా లోని పలు ప్రాంతాలు
తమిళనాడు  గుడియం గుహ, బూడిదమాను

ఆంధ్రప్రదేశ్‌లో మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన ముఖ్య ప్రదేశాలు

[మార్చు]

ఆంధ్రపదేశ్‌లో అనేక ప్రాంతాలలో ముఖ్యంగా కృష్ణానది, గోదావరి, పెన్నా, తుంగభద్ర, స్వర్ణముఖి మొదలగు నదీలోయలలోను, పాలేరు, గుండ్లేరు, గుంజాన, సగిలేరు, కుందేరు, రాళ్ళకాలువ, చెయ్యేరు మొదలగు సెలయేటి తీరాలలోను మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన అనేక పనుముట్లు లభించాయి.

జిల్లా మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన పనిముట్లు బయల్పడిన ప్రదేశాలు
కృష్ణ తిరుమల గిరి, తుమ్మలపాలెం, లింగగూడెం
గుంటూరు కారంపూడి (పల్నాడు), నాగార్జునసాగర్, నాగార్జున కొండ
ప్రకాశం గిద్దలూరు, సింగరాయకొండ, కాట్రేటిపురం (కందుకూరు), దోర్నాల, కనిగిరి
నెల్లూరు పగడాలపల్లి (గూడూరు), రాచర్లపాడు, సోమశిల, ఉదయగిరి, కావలి
కడప ముద్దనూరు,మైదకూరు, నందిపల్లి, నారాయణ నెల్లూరు, పాలకొండ, ఎగువ తంబళ్లపల్లె, తుమ్మచెట్లపల్లి, వేముల,
కర్నూలు సాతానికోట, కుడవెల్లి వీరాపురం (నందికొట్కూరు), మురవకొందాడ (నందికొట్కూరు), శ్రీశైలం, వెల్దుర్తి
చిత్తూరు రేణిగుంట, చంద్రగిరి

వీటిని కూడా చూడండి

[మార్చు]

మధ్య ప్రాచీన శిలాయుగం

రిఫరెన్స్‌లు

[మార్చు]
 • Ancient India by Ram Sharan Sharma
 • Palaeolithic Period: Lower, Middle and Upper Palaeolithic Period by Mamta Aggarwal [1]
 • Stone Age [2] Encyclopedia Britanica
 • Paleolithic Period [3] Enc
 • దక్షిణ భారత దేశ చరిత్ర, వి. సుందర రామశాస్త్రి, తెలుగు అకాడమి
 • ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి (ప్రాక్ పురాయుగం - క్రీ.పూ. 500 వరకు), MLK మూర్తి, AP History Congress
 • Indian Archaeology 1988-89 A Review [4],1993 Edited by M.C.Joshi, Published by Director general of Archaeolgical Survey of India, Government of India, New Delhi

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 R.S, Sharma. India's Ancient Past (2016 ed.). New Delhi: Oxford University Press. p. 56.
 2. 2.0 2.1 2.2 R.S, Sharma. India's Ancient Past (2016 ed.). New Delhi: Oxford University Press. p. 52.
 3. Kambhampati, Satyanarayana. ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర తొలి భాగం [A Study of the History and Culture of the Andhras] (1993 ed.). Hyderabad: Hyderabad Book Trust. p. 16.
 4. Kambhampati, Satyanarayana. ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర తొలి భాగం [A Study of the History and Culture of the Andhras] (1993 ed.). Hyderabad: Hyderabad Book Trust. p. 3.
 5. 5.0 5.1 M.L.K.Murthy, D.R.Raju. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి (ప్రాక్ పురాయుగం - క్రీ.పూ.500 వరకు) (2013 ed.). Hyderabad: ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ & ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం (A.P). p. 41.