Jump to content

సగిలేరు

వికీపీడియా నుండి

సగిలేరు పెన్నా నదికి ఉపనది. ఇది ప్రకాశం జిల్లా నల్లమల కొండలలో కంబం వద్ద పుట్టి, దక్షిణమున గిద్దలూరు, బద్వేలు తాలూకాల గుండా ప్రవహించి వైఎస్ఆర్ జిల్లాలో పెన్నానదిలో కలుస్తుంది. పూర్వము ఈ నదిని స్వర్ణబాహు నది అని పిలిచేవారు. సగిలేరు నదిపై వైఎస్ఆర్ జిల్లాలో రెండు మధ్యతరహా నీటి పారుదల పథకాలు ఉన్నాయి - ఎగువ సగిలేరు ప్రాజెక్టు, దిగువ సగిలేరు ప్రాజెక్టు.

దిగువ సగిలేరు ప్రాజెక్టు వైఎస్ఆర్ జిల్లాలో బి.కోడూరు మండలంలోని వడ్డెమాను గ్రామం వద్ద నిర్మించబడింది. దీని మొత్తం ఆయకట్టు 11804 ఎకరాలు. ఈ ప్రాజెక్టు 0.6 టి.ఎం.సిల లభ్యమయ్యే జలాల్ని వినియోగించుకుంటుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 0.169 టి.ఎం.సి.లు, నికర సామర్థ్యం 0.166 టి.ఎం.సి.లు. దీన్ని మొత్తం 51 లక్షల వ్యయంతో 1954లో నిర్మించారు. 1996లో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సంభవించిన వరదల వల్ల ఆనకట్ట, గేట్లు, కాలువలు, పంపీణీ వ్యవస్థ దెబ్బతినడంతో 6.95 కోట్ల ఖర్చుతో మరమత్తులు చేపట్టి 2003 మార్చిలో పూర్తిచేశారు.[1] 2009లో ఈ ప్రాజెక్టుకు మాజీ రాష్ట్రమంత్రి పేరుమీద వడ్డెమాను చిదానందం జలాశయం అని పేరు మార్చారు.[2] ఈ ప్రాజెక్టు బద్వేలు చెరువుతో పాటు కాలువ వెంట ఉన్న పదమూడు చెరువులకు నీరందిస్తున్నది.[3]

ఎగువ సగిలేరు ప్రాజెక్టు కలసపాడు మండలం దిగువ తంబళ్లపల్లె వద్ద సగిలేరు నదిపై నిర్మించబడింది. దీనిని వంకమర్రి డ్యామ్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం ఆయకట్టు 5448 ఎకరాలు. దీన్ని 1896లో 4.6 లక్షల వ్యయంతో నిర్మించారు. 1898-99లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో ఆనకట్టతో పాటు 10 మైళ్ల పొడవున్న కాలువ దారివెంట ఉన్న అనేక చెరువులకు నీరందిస్తున్నది.[4] 1996లో వరదల వల్ల దెబ్బతిన్న ఆనకట్ట, కాలువలు, పంపీణీ వ్యవస్థను 2.32 కోట్ల ఖర్చుతో మరమ్మత్తులు చేశారు. ఈ పని మార్చి 2001లో పూర్తయ్యింది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-08. Retrieved 2009-05-12.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-02. Retrieved 2009-05-12.
  3. CENSUS OF INDIA 1981-A P DISTRICT CENSUS BOOK CUDDAPAH DISTRICT By S.S.Jaya Rao [1]
  4. Imperial Gazetteer of India ... By William Wilson Hunter, James Sutherland Cotton, Richard Burn, William Stevenson Meyer, Great Britain. India Office, John George Bartholomew పేజీ.181 [2]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సగిలేరు&oldid=3647133" నుండి వెలికితీశారు