Jump to content

తుల్యభాగ

వికీపీడియా నుండి

భగీరధి (గంగా నది)లో స్నానము చేస్తే ఎంత పుణ్యము వస్తుందో ఆ పుణ్యానికి తుల్య మైన (సమానమైన) పుణ్యము ఇచ్చునది కాబట్టి తుల్యభాగ అని పిలుస్తారు. గోదావరి నది సముద్రంలో కలిసే ముందు పాయలుగా విడపోగా అందులో ఒక పాయ (distributory) ఇది. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి, నది నీటిని వ్యవసాయపు కాలువల్లోకి మళ్ళించగా, స్వతస్సిద్ధమయిన పాయలలో ప్రవాహం తగ్గిపోయింది. పైగా సేద్యం అయిన తరువాత మిగిలిన, దరిదాపు మురికిగా తయారయిన, నీరు మాత్రం ఇప్పుడు ఈ పాయలలో ప్రవహిస్తూ ఉండటం వల్ల ప్రస్తుతం ఈ తుల్యభాగ నది స్నానానికి కూడా అనుకూలంగా లేదు.

సప్తగోదావరిలో ఒక పాయ

[మార్చు]

ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని (conceal) లు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. సప్త గోదావరికి ఆ పేరు స్థిరపడిపోవడానికి కారణమైన ఏడు శాఖల గురించి చెప్పిన శ్లోకం.

తుల్యాత్రేయీ భరద్వాజ గౌతమీ వృద్ధగౌతమీ

కౌశికీచ వశిష్ఠాచ తథా సాగరం గతాః

తుల్యభాగ నదికి దారి

తుల్య భాగ గురించి కొన్ని చారిత్రక వాస్తవాలు

[మార్చు]

గోదావరీ లోయలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ పాయల మినహా పంట అవసరాలకు కాలవల తవ్వకమనే అంశం ఈ ప్రాంతపు ఆర్థిక, సాంస్కృతిక, ప్రగతిని వేగవంతం చేయడం చరిత్రలో నమోదయిన విషయం. మధ్య యుగాల నుండి నీటివనరులతో సాగులోకొచ్చిన భూమి చుట్టూ వ్యవస్థ రూపు దిద్దుకోవడం. తద్వారా భూస్వామ్యం పెరగడం వల్ల ఈ విషయం భీమేశ్వరపురాణంలోని భూదాన మహిమ ద్వారా (5-60 నుండి 80) విపులంగా విశదమౌతుంది. కోటిపల్లి గౌతమీశాఖ నుండి దక్షిణాన వశిష్ట అంతర్వేదిపాలెం వరకువున్న కోనవిషయ (సీమ) వరదలకూ, ఉరవడికీ అనువైన ఆవ. అందుకే అక్కడ కొబ్బరిపంట విశిష్టసాగు అయ్యింది.

కోటిపల్లి గౌతమికి తూర్పుగోదావరి జిల్లా ప్రోలునాడు (పిఠాపురం, గొల్లప్రోలు, ప్రత్తిపాడు మండలాలు సుమారుగా) కొంతభాగము, చాగల్నాడు, మెట్ట మినహా మధ్య సాగు (డెల్టా) భూమిగా వున్న ప్రాంతంలో నీటివనరుని అనువుగా మార్చుకోవడం వ్యవసాయ సమాజం ఏర్పడిన మలిదశలో (ఇక్కడి సందర్భంలో తొలిమధ్య యుగాలలో చోళ, చాళుక్యుల కాలంలో) మొదలైంది. అలా చోళ చాళుక్యుల పాలనలో కాలవ వ్యవస్థ పటిష్ఠమయ్యే క్రమంలో ధవళేశ్వరం దాటిన తర్వాత ఏర్పరిచిన కాలవే తుల్యభాగ. ఈ పేరు కూడా అదే విషయాన్ని సూచిస్తుంది. ఈ తుల్యభాగ మరిన్ని పిల్లకాలువలై మధ్య సాగు ప్రాంతాలకు నీరు పారుస్తుంది. గౌతమి నుండి తుల్యభాగ విడివడిన ప్రాంతం నుండి కొద్ది పైభాగం నుండి ఏలేరు పాయ విడివడి ప్రోలునాడుకి ప్రధాన నీటి వనరుగా మారింది. ఈ ఏలేటి పంట భూముల వైభవాన్ని వ్యాసుడు పిఠాపురం చేరిన సందర్భంలో శ్రీనాథుడు విపులంగా ప్రస్తావించాడు. ఈ నది (తుల్యభాగ) ఉత్పత్తి క్రమంలో జరిగిన వంతు పంపకాల గొడవను సద్దుమణిచే కథ తుల్యభాగుని పౌరాణీకరణ వృత్తాంత్తంగా ఏర్పడివుంటుంది. ఈ కథలో కూడా వాతాపి, ఇల్వలుల పేర అంతకు ముందున్న పేర్లు ఇప్పనపాడు (ఇల్వలపురం), (వా)తాపేశ్వరంగా (పూర్వనామం నిర్ధారణ కానప్పటికీ) గా మారి వుండవచ్చు.సప్తర్షులు గౌతమిని భీమనాథుని చెంతకు తేవడానికి వెళ్ళిన క్రమంలో జరిగిన కథలో రాక్షస ఋషులు, సప్తర్షులు శాప ప్రతిశాపాలు ఇచ్చుకున్నారు.

ప్రాచీన సాహిత్యంలో తుల్యభాగ ప్రస్తావనలు

[మార్చు]
  • వ్యాసుడు దక్షారామం చేరడానికి ముందు తుల్యభాగ తీరంలోని సాంపరాయగ్రామ సమీప ముక్తీశ్వరుని దర్శించి బిల్వదళాలూ, రేలపూలూ, పద్మాలతో పూజ చేశాడట. అయితే ముక్తీశ్వర స్వామి రూపం చెప్పడంలో శ్రీనాథుడు ఆనాటికున్న అరుదైన శివలింగాన్ని మన ముందుంచుతున్న సందర్భంలో తుల్యభాగ ప్రస్తావన ఇలా చేసాడు.

‘తుల్యభాగా తీరంబున సాంపరాయణగ్రామంబు చేరువ బిల్వాటవీ వాటిఁగపట భిల్లుండైన చలిగొండఱేని యల్లుని ముక్తీశ్వరు దర్శించి’ – (భీమేశ్వర పురాణం. 3-72.)

  • వ్యాసుని సాంపరాయగ్రామ ముక్తీశ్వర దర్శన సందర్భంలో శ్రీనాథుడు చెప్పిన ఆనవాళ్ళులేని నేటి శివలింగ రూపాన్ని చూపిస్తోంది. ఆ శ్లోకాలలో తుల్యభాగ ప్రస్తావన:

తుల్యభాగాతటే రమ్యే బిల్వకాననారాజితే

సాంపరాయ మహాగ్రామ సమీపే స్థితమవ్యయమ్‌

ముక్తీశ్వర మమాకాంతం దృష్ట్వాభక్తీవశం గతః

శిష్యసంఘేన సహిత స్సమ్యగ్బిల్వదళార్చనం

శీతాచలేంద్ర మాతుతురకరోత్తస్య సంయమీ

– చతుర్థాధ్యాయమ్‌ – 15,16,17 – భీ.ఖం.

"https://te.wikipedia.org/w/index.php?title=తుల్యభాగ&oldid=3327609" నుండి వెలికితీశారు