పాపఘ్ని
పాపఘ్ని పెన్నా నదికి ఉపనది. పాపఘ్ని నది కర్ణాటక రాష్ట్రం, చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని సిడ్లఘట్ట గ్రామం వద్ద పుట్టి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. పాలకొండ శ్రేణుల గుండా ప్రవహించి, ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా మైదానపు ప్రాంతంలోకి పారుతుంది. పాపఘ్ని వైఎస్ఆర్ జిల్లాలోని కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. పాపఘ్ని ఉపనదుల్లో మొగమేరు చెప్పుకోదగినది. మొత్తం 205 కిలోమీటర్ల పొడవున్న పాపఘ్ని నది యొక్క మొత్తం పారుదల ప్రాంతం 7,423 చ.కి.మీలు. ఇది మొత్తం పెన్నా నది పారుదల ప్రాంతంలో 14.14%. పాపఘ్ని నది యొక్క పారుదల ప్రాంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ జిల్లాలలో ఉన్నా, ప్రధాన భాగం చిత్తూరు జిల్లాలోని పశ్చిమభాగంలోని కొండప్రాంతంలో ఉంది. వైఎస్ఆర్ జిల్లాలో ప్రవహించే పాపఘ్ని పై గాలివీడు మండలం, వెలిగల్లు గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
పాపఘ్ని పేరు
[మార్చు]ఘ్ని అంటే నాశనం చేసేది లేక చంపేది అని అర్థం. నూరు మందిని ఒక్క దెబ్బతో చంపే ఆయుధాన్ని శతఘ్ని అన్నట్లే పాపనాశిని అయిన నది పేరు పాపఘ్ని అయింది. తులసి మొక్కను కూడా పాపఘ్ని అంటారు.
పాపఘ్ని మఠం
[మార్చు]పాపఘ్ని నదీ తీర ప్రాంతంలో చిక్‌బళ్లాపూర్ వద్ద అత్యంత పురాతనమైన పాపఘ్ని మఠం ఉంది.
గండి క్షేత్రం
[మార్చు]అన్నమయ్య జిల్లాలో ఈ నదీతీరంలోనే చక్రాయపేట మండలంలో రాయచోటి-వేంపల్లె మార్గమధ్యంలో పవిత్ర గండి క్షేత్రం వెలసింది. పాపఘ్నీ నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి "గండి" అని పేరు వచ్చింది.
పాపాఘ్ని కథలు
[మార్చు]కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ వేంపల్లి గంగాధర్ పాపఘ్ని నది నేపథ్యంతో కథా సంపుటి ''పాపాఘ్ని కథలు'' రాసారు.