మరియా ఒక్త్యాబ్రస్కయా
మరియా వాసిల్యేవ్నా ఒక్త్యాబ్రస్కయా | |
---|---|
జననం | క్రిమియా, రష్యన్ సామ్రాజ్యం | 1905 ఆగస్టు 16
మరణం | 1944 మార్చి 15 ఫస్తోవ్, సోవియట్ యూనియన్ | (వయసు 38)
రాజభక్తి | సోవియట్ యూనియన్ |
సేవలు/శాఖ | సోవియట్ సైన్యం |
సేవా కాలం | 1943–1944 |
ర్యాంకు | గార్డ్స్ సీనియర్ సార్జెంట్ |
యూనిట్ | 26వ గార్డ్స్ ట్యాంక్ బ్రిగేడ్ |
పోరాటాలు / యుద్ధాలు | రెండవ ప్రపంచ యుద్ధంలో తూర్పు ఐరోపా యుద్ధరంగంలో |
పురస్కారాలు | హీరో ఆఫ్ సోవియట్ యూనియన్,
ఆర్డర్ ఆఫ్ లెనిన్ మెడలియన్, ఆర్డర్ ఆఫ్ పేట్రియాటిక్ వార్ ఫస్ట్ క్లాస్ మెడలియన్ |
మరియా వాసిల్యేవ్నా ఒక్త్యాబ్రస్కయా (16 ఆగస్టు 1905 – 15 మార్చి 1944) రెండవ ప్రపంచ యుద్ధంలో తూర్పు ఐరోపా యుద్ధభూమిలో నాజీ జర్మనీకి వ్యతిరేకంగా పోరాడిన సోవియట్ ట్యాంక్ డ్రైవర్.
1941లో సోవియట్ తరఫున పోరాడుతున్న ఆమె భర్త మరణించాకా మరియా తన ఆస్తి సమస్తం అమ్మేసి ఓ ట్యాంకు కొంది. ఆ ట్యాంకును సోవియట్ సైన్యం యుద్ధ ప్రయత్నాలకు సహాయంగా దాన్ని విరాళమిచ్చి, దాన్ని తానే నడపడానికి అనుమతి సంపాదించింది. ఆమె కొని సైన్యానికి దానమిచ్చిన టీ-34 మీడియం ట్యాంకుకు "పోరాడుతున్న ప్రియురాలు" (ఆంగ్లం:"Fighting Girlfriend", రష్యన్:"Боевая подруга") అన్న పేరు పెట్టుకుంది.[1] మరియా సైన్యంలో తన సామర్థ్యాన్ని, ధైర్యాన్ని నిరూపించుకుని సార్జెంట్ స్థానానికి పదోన్నతి పొందింది. 1944 మార్చి 15న యుద్ధంలో మరణించింది. మరణానంతరం యుద్ధరంగంలోని సాహసానికి సోవియట్ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారమైన హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ ఆమెకు ప్రకటించారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి మహిళా ట్యాంక్ డ్రైవర్ మరియానే.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]మరియా వాసిల్యేవ్నా ఒక్త్యాబ్రస్కయా క్రిమియా ద్వీపకల్పంలో ఒక పేద ఉక్రేనియన్ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రుల పదిమంది సంతానంలో ఆమె ఒకరు. మొదట్లో ఆమె పాకేజ్డ్ ఆహార పరిశ్రమలోనూ, తర్వాత టెలిఫోన్ ఆపరేటర్‌గానూ పనిచేసింది.1925లో ఆమె ఒక సోవియట్ ఆర్మీ అధికారిని వివాహం చేసుకుంది. పెళ్ళయ్యాకా సైనిక వ్యవహారాల్లో ఆసక్తి పెంచుకుంది. సైనికుల భార్యల కౌన్సిల్‌లో పనిచేసింది. సైన్యంలో నర్సుగా పనిచేసేందుకు శిక్షణ తీసుకుంది. ఆయుధాలు ప్రయోగించడం, వాహనాలు నడపం కూడా నేర్చుకుంది. "సైనికుణ్ణి పెళ్ళి చేసుకుంటే మీరూ సైన్యంలో సేవలందించగలరు. ఒక [సైనిక] అధికారి భార్య గౌరవనీయమైన మహిళ మాత్రమే కాదు అదొక బాధ్యతాయుతమైన స్థానం" అని మరియా ఒక సందర్భంలో అన్నది.[2]
రెండవ ప్రపంచ యుద్ధంలో
[మార్చు]రెండవ ప్రపంచ యుద్ధం తూర్పు ఐరోపా యుద్ధరంగంలోకి విస్తరించినప్పుడు మరియాను సైబీరియా ప్రాంతంలోని తోమ్‌స్క్ నగరానికి తీసుకువెళ్ళారు. 1941 ఆగస్టులో నేటి ఉక్రెయిన్‌లోని కీవ్ నగరానికి సమీపంలో జరిగిన యుద్ధంలో నాజీ జర్మనీ దళాల చేతిలో ఆమె భర్త చనిపోయాడు. ఈ వార్త సైబీరియాలోని మరియాకు రెండు సంవత్సరాలకు చేరింది. వినీ వినగానే ఆమె పట్టరాని కోపంతో జర్మన్ల మీద కక్ష సాధించాలని నిర్ణయించుకుంది. తనకున్న సమస్తమైన ఆస్తినీ అమ్మేసి, ఆ సొమ్ముతో ఓ యుద్ధ ట్యాంకును కొంది. ఆ ట్యాంకును రెడ్ ఆర్మీకి విరాళంగా ఇస్తూ రెండు కోరికలు కోరింది: ఒకటి - దాని పేరు పోరాడుతున్న ప్రియురాలు (ఆంగ్లం: ఫైటింగ్ గర్ల్‌ఫ్రెండ్, రష్యన్: "Боевая подруга") అని పెట్టాలి, రెండు - ఆ ట్యాంకును నడిపి జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో పోరాడే అవకాశం తనకు ఇవ్వాలి. ఇందులో యుద్ధ ప్రచారానికి ఉన్న అవకాశాలను గమనించిన స్టేట్ డిఫెన్స్ కమిటీ మరియాకు ఆ అవకాశాన్ని ఇచ్చింది. మరియా విరాళమిచ్చిన ట్యాంకు టి-34 మీడియం ట్యాంకు.[3]
ఈ సమయానికి మరియా వయసు 38 సంవత్సరాలు. విరాళం ఇవ్వగానే ఆమెను సైన్యంలోకి తీసుకుని 5-నెలల శిక్షణ ఇచ్చారు. ట్యాంక్ దళాల వారిని నామమాత్రపు శిక్షణతో నేరుగా యుద్ధరంగంలోని ముందు వరసకు తీసుకుపోయే ఆనాటి స్థితిగతుల్లో ఐదు నెలల శిక్షణ అన్నది విచిత్రమే. శిక్షణ పూర్తిచేసుకున్న మరియాను 1943 సెప్టెంబరులో రెండవ గార్డ్స్ టాంక్ కార్ప్స్‌లోని 26వ గార్డ్స్ టాంక్ బ్రిగేడ్‌లో డ్రైవర్-మెకానిక్‌గా నియమితురాలైంది. ఆమె ట్యాంకు మీద పోరాడుతున్న ప్రియురాలు అన్న అర్థం వచ్చే రష్యన్ పదాలను రాసుకుని యుద్ధానికి వచ్చింది. చాలామంది తోటి ట్యాంకర్లు ఇదొక పరిహాసంగానూ, పబ్లిసిటీ స్టంట్‌గానూ చూసేవారు. కానీ స్మోలెన్‌స్క్‌లో ఆమె తన తొలి ట్యాంక్ పోరాటాల్లో సాహసంగా, సమర్థంగా పాల్గొనడం చూశాకా వారి అభిప్రాయం మారింది.[4]
1943 అక్టోబరు 21న ఆమె తొలి ట్యాంక్ పోరాటం ప్రారంభమైంది. తొలి పోరాటంలోనే మరియా తన ట్యాంకుతో తీవ్రమైన పోరు సాగుతున్న ప్రదేశాల్లోకి నడిచింది. తన తోటి ట్యాంకర్లతో కలిసి ఆమె శత్రుపక్షాలకు చెందిన మెషీన్ గన్ నెస్ట్‌లను, ఆర్టిలరీ గన్‌లను నాశనం చేసింది. తన ట్యాంకుకు తుపాకి దెబ్బ తగిలినప్పుడు, పెద్ద ఎత్తున సాగుతున్న కాల్పుల మధ్యలో, ఆర్డర్లను కూడా లక్ష్యం చేయకుండా ట్యాంకు బయటకు దూకి దాన్ని మరమ్మతు చేయడం తోటివారిని విస్మయపరిచింది. ఈ సంఘటన అనంతరం ఆమెకు పదోన్నతిలో సార్జెంట్ హోదా ఇచ్చారు.[5]
మరో నెల తర్వాత నవంబరు 17-18 తేదీల్లో సోవియట్ సైన్యం నోవోయ్ సెలో పట్టణాన్ని రాత్రి పూట జరిగిన పోరాటంలో గెలిచి జర్మన్ సైన్యం నుంచి తిరిగి ఆక్రమించుకున్నారు. ఈ దాడిలో మరియా నిపుణురాలైన ట్యాంక్ డ్రైవర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. 17న ఆమె నోవోయ్ సెలో పట్టణానికి దగ్గరలోని జర్మన్ స్థానాలపై దాడిలో పాలుపంచుకుంది. అయితే ఒక ఆర్టిలరీ షెల్ పేలడంతో ఆమె ట్యాంకు ట్రాక్ దెబ్బతింది. ఆమె, మరొక సైనికుడు ట్యాంకు బయటకు దిగి ధైర్యంగా దారిని మరమ్మతు చేయడం ప్రారంభించగా, మిగిలిన ట్యాంకులు రక్షణగా నిలబడ్డాయి. విజయవంతంగా ఆ ట్రాక్‌ని సరిజేశాకా, ట్యాంకులు మళ్ళీ కొన్నిరోజులకు ప్రధాన దళాన్ని చేరుకున్నాయి.[4]
లెనిన్‌గ్రాడ్-నోవ్‌గొరోడ్ దాడిలో భాగంగా రాత్రిపూట జరిగిన మరో దాడిలో ఆమె 1944 జనవరి 17న పాల్గొంది. వైట్‌బ్‌స్క్ సమీపంలోని ష్వెడీ గ్రామంలో జరిగిన ఓ దాడి ఆమెకు చివరి పోరాటంగా పరిణమించింది. ఈ పోరాటంలో తన టీ-34ను నడుపుతూ జర్మన్ రక్షణ ఏర్పాట్లలో భాగమైన ట్రెంచ్‌లు, మెషీన్-గన్ నెస్ట్‌లు నాశనం చేస్తూ ముందుకు సాగింది. ట్యాంకు దళం జర్మన్ సెల్ఫ్-ప్రొపెల్లెడ్ గన్‌లను కూడా నాశనం చేసింది. అయితే ట్యాంకు ఓ యాంటీ-ట్యాంకు షెల్‌ని తాకడంతో ట్యాంకు సాగేందుకు ఉపయోగపడే ట్రాక్ దెబ్బతింది. ట్యాంకు నుంచి వెనువెంటనే కిందికి దూకింది. తుపాలకుల కాల్పుల నడుమ మరమ్మతులు చేయడం ప్రారంభించింది. విజయవంతంగా ట్రాక్‌నైతే బాగుచేసింది కానీ తలకు గాయమై, స్పృహ కోల్పోయింది. పోరాటం ముగిశాకా ఆమెను కీవ్ సమీపంలోని ఫస్తోవ్‌లోని సోవియట్ సైన్యపు ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు నెలల పాటు కోమాలోనే ఉన్న మరియా చివరకు మార్చి 15న మరణించింది. 1944 ఆగస్టు నెలలో మరియాను వైట్‌బ్‌స్క్ చుట్టుపక్కల సాగిన యుద్ధాల్లో చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్ పురస్కారాన్ని సోవియట్ ప్రభుత్వం ఇచ్చింది.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ Sakaida, Henry (2012-04-20). Heroines of the Soviet Union 1941–45 (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. ISBN 9781780966922.
- ↑ Serov, Sergey. "Октябрьская Мария Васильевна". Warheroes.ru. Retrieved 11 July 2011.
- ↑ Forczyk, Robert (2007-10-23). Panther vs T-34: Ukraine 1943 (in ఇంగ్లీష్). Bloomsbury USA. ISBN 9781846031496.
- ↑ 4.0 4.1 Serov, Sergey. "Октябрьская Мария Васильевна". Warheroes.ru. Retrieved 11 July 2011.
- ↑ Sakaida, Henry (2012-04-20). Heroines of the Soviet Union 1941–45 (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. ISBN 9781780966922.
- ↑ Pennington, Reina; Higham, Robin (2003). Amazons to fighter pilots : a biographical dictionary of military women / Vol. 1, A-Q. Westport, CT: Greenwood Press. p. 319. OCLC 773504359.
- ↑ Streather, Adrian (2011-01-15). Red & Soviet Military and Paramilitary Services: Female Uniforms 1941-1991: (officer and Enlisted Personnel) (in ఇంగ్లీష్). Veloce Publishing Ltd. ISBN 9781845840679.[permanent dead link]