మరుమాముల దత్తాత్రేయ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరుమాముల దత్తాత్రేయ శర్మ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జరిగిన ఆజాది కా కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న దత్తాత్రేయ శర్మ
జననం
మరుమాముల దత్తాత్రేయ శర్మ

(1962-06-15) 1962 జూన్ 15 (వయసు 62)
కొండపాక,సిద్దిపేట జిల్లా (పాత మెదక్ జిల్లా) తెలంగాణ
వృత్తివిశ్రాంత ప్రధానాధ్యాపకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, అవధాని, సమన్వయ కర్త, ప్రయోక్త

మరుమాముల దత్తాత్రేయ శర్మ పూర్వపు మెదక్ జిల్లా, కొండపాక గ్రామంలో మరుమాముల రాజమౌళి శర్మ, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం కొండపాక, సిద్ధిపేటలలో గడిచింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఎ. (తెలుగు) చదివి ప్రథమస్థానంలో ఉత్తీర్ణుడైనాడు. యుజిసి ఫెలోషిప్‌ను పొంది "ముట్నూరు కృష్ణారావు సంపాదకీయాలు" అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా సంపాదించాడు. రాష్ట్రప్రభుత్వ గురుకుల విద్యా సంస్థలలో ఉపాధ్యాయుడిగా చేరి 33 సంవత్సరాలు సేవలనందించి జూన్ 30, 2020న తూప్రాన్ గురుకుల కళాశాల ప్రధానాచార్యుడిగా పదవీ విరమణ చేశాడు.

సాహిత్యసేవ

[మార్చు]

ఇతడు అనేక సాహితీ, సాంస్కృతిక సంస్థల నిర్వాహకునిగా సేవలను అందించాడు. అవధాన విద్యావ్యాప్తికి కృషి చేశాడు. వందలాది తెలుగు సంస్కృత అవధానాలను నిర్వహింపజేశాడు. 2020 నుండి స్వయంగా అష్టావధానాలు చేయసాగాడు. అవధాన విద్యా వికాస పరిషత్తును స్థాపించి ఔత్సాహికులకు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నాడు. భువన విజయం సాహిత్య రూపకంలో కృష్ణదేవరాయలుగా, తిమ్మరుసుగా, ఇంద్రసభలో మహేంద్రునిగా, కాకతీయ వైభవంలో ప్రతాపరుద్రునిగా, కృష్ణాపత్రిక దర్బారులో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగా ఎన్నో ప్రదర్శనలలో పాల్గొని దేశవిదేశాలలో ప్రశంసలు పొందాడు. అనేక కవిసమ్మేళనాలలో కవితాగానం చేశాడు. హైదరాబాదు, తిరుపతిలలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో ప్రధాన భూమికను నిర్వహించాడు. ఆకాశవాణి, దూరదర్శన్‌లతో సహా అనేక ప్రసార మాధ్యమాలలో, అనేక సాహిత్య సభలలో వ్యాఖ్యాతగా, ప్రయోక్తగా వ్యవహరించాడు. హైదరాబాదు నుండి వెలువడే దర్శనమ్‌ అనే ఆధ్యాత్మిక మాసపత్రికకు గౌరవ సంపాదకునిగా ఉన్నాడు.

ఆజాది కా కవి సమ్మేళన కార్యక్రమంలో సత్కారం అందుకుంటున్న ఎం. దత్తాత్రేయ శర్మ

రచనలు

[మార్చు]
  • ముట్నూరి కృష్ణారావుగారి సంపాదకీయాలు (సిద్ధాంత గ్రంథం)
  • పుస్తకాపాణీ శతకము
  • విభక్తి ప్రప్తత్తి (ఉదాహరణ కావ్యం)

పురస్కారాలు, బిరుదులు

[మార్చు]
  • ఎం.ఎ.(తెలుగు)లో ప్రప్రథమ స్థానం పొంది గురజాడ అప్పారావు స్మారక బంగారు పతకాన్ని అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా స్వీకరించాడు.
  • 2005లో మెదక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కారం.
  • 2019లో రాష్ట్రప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపకునిగా పురస్కారం.
  • సాహితీ జిగీష సంస్థ నుండి "సాహితీ ప్రభాస" బిరుదు.

మూలాలు

[మార్చు]