మరో మొహెంజొదారో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మరో మొహెంజొదారో (Maro Mohenjo-daro) తెలుగు నాటకాన్ని ప్రయోగ ధోరణి వైపు అడుగులేయించిన నాటకం. దీనిని 1963లో ఎన్.ఆర్. నంది రాసాడు.

తొలి ప్రదర్శన అనంతపురంలో 1964లో జరిగింది. ఇది ప్రయోగాత్మకంతో పాటు ‘ప్రయోజనాత్మక’ నాటకం. ‘మరో మొహెంజొదారో’ను ఆచార్య ఆత్రేయ కు అంకితమిచ్చారు నంది. మరో మొహెంజొదారో అంటే మరో మట్టి దిబ్బ. గొప్ప నాగరికత అవశేషం. ఆ సమాజం వరదలతోనో, మరో ఉత్పాతంతోనో ధ్వంసమైంది. ఇప్పటి సమాజం కూడా అనేక తప్పిదాలతో మరో మొహెంజొదారోను పునరావృతం చేయడానికి తొందరపడుతోందంటూ రచయిత చేసిన హెచ్చరికే ఈ నాటకం.

1963 ప్రాంతంలో రాసిన నాటకం అయినాకానీ ఇప్పుడు చదువుకున్నా ఆ అనుభూతి తాజాగానే ఉంటుంది. నంది తీసుకున్న ఇతివృత్తం సార్వకాలికమైనది. మనుషులలోనే కనిపించే దోపిడీ తత్వం, అలాంటి వ్యవస్థను నిర్మూలించడానికి మళ్లీ మనిషి పడే తపన ఇందులో చిత్రించారాయన. చారిత్రక దృష్టి, తాత్విక చింతనలతో గాఢంగా ముడిపడి ఉన్న అంశమిది. వీటి వల్ల సాధారణంగా నాటక ప్రక్రియకు ఏ మాత్రం సరిపడని ఉపన్యాస ధోరణి చొరబడుతుంది.

ప్రయోగశాలలోని కొన్ని పరిశోధక గ్రంథాలను శాస్త్రజ్ఞుడు మనకు పరిచయం చేయడం దగ్గర నాటకం ఆరంభమవుతుంది. నిజానికి ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క జీవితం. ఒక్కొక్క వర్గానికి ప్రాతినిధ్యం వహించే జీవితమది. పాత్రల పేర్లు కూడా ఆయా వర్గాలనే ప్రతిబింబిస్తుంటాయి. అవి- భిక్షాలు (పేద), పరంధామయ్య (మధ్య తరగతి), భూషణ్ (తిరుగుబాటు ధోరణి), కోటీశ్వరయ్య (ధనికుడు), లాయర్, డాక్టర్ (చదువుకున్న వర్గం), తులసి (బలి పశువు). పేదవాడు మరింత పేదవాడు అవుతుంటే, ధనికుడు మరింత ధనవంతుడవుతున్నాడని ప్రొఫెసర్ ప్రకటించి భిక్షాలును పలకరిస్తాడు. భిక్షాలు ఇప్పుడు కూలి. కానీ అతడి తండ్రి రైతు. ఈ పరిణామం ఏం మారింది? ఇలా ఒక్కొక్క పాత్రను మొదట పరిచయం చేసి నెమ్మదిగా ప్రొఫెసర్ వేదికను అసలు పాత్రలకు విడిచి పెడతాడు.

ఐతిహాసిక (ఎపిక్ థియేటర్) నాటక విధానంతో వ్రాసిన మొదటి తెలుగు నాటకం ఇది[1]. మెలోడ్రామాను నియంత్రిస్తూ రంగస్థల పరికరాలు అవసరం లేకుండా కేవలం నీలితెరలతోనే ప్రదర్శింపగల సౌలభ్యం ఈ నాటకానికి ఉంది. ఫ్రీజ్ టెక్నిక్ (బొమ్మల్లా నిలబడిపోవడం) అనే నూతన పద్ధతి ఈ నాటకంతోనే ప్రారంభమైంది.

ప్రయోగ దృష్టి నంది తరువాత వచ్చిన నాటకకర్తలలో కూడా కనిపిస్తుంది. ఆశ ఖరీదు అణా (గోరా శాస్త్రి), రాజీవం (కేవీఆర్, వేణు), మళ్లీ మధుమాసం (గణేశ్ పాత్రో), త్రిజాకీ యమదర్శనం (అబ్బూరి గోపాలకృష్ణ), కుక్క (యండమూరి), ఓ బూతు నాటకం (ఇసుకపల్లి మోహనరావు), కొక్కొరోకో, గార్దభాండం (తనికెళ్ల భరణి), పెద్ద బాలశిక్ష (ఆకెళ్ల), పడమటిగాలి (పాటిబండ్ల ఆనందరావు) వంటి వాటిలో ప్రశంసనీయమైన ప్రయోగధోరణులు కనిపిస్తాయి.

ప్రదర్శనలు[మార్చు]

ఈ నాటకాన్ని రావ్‌జీ ప్రొడక్షన్స్, విశాఖపట్నం వారు వివిధ పరిషత్తులలో ప్రదర్శించారు. దీనికి రావ్‌జీ దర్శకత్వం వహించి, కొన్ని ప్రధాన పాత్రల్ని కూడా పోషించారు.[2]

మూలాలు[మార్చు]

  1. దాసరి, నల్లన్న (2008). నాటక విజ్ఞాన సర్వస్వం (1 ed.). హైదరాబాదు: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 352.
  2. https://archive.org/details/in.ernet.dli.2015.372094

బయటి లింకులు[మార్చు]