మల్లాది చంద్రశేఖరశాస్త్రి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి
నివాస ప్రాంతం గుంటూరు
మతం హిందూమతము


మల్లాది చంద్రశేఖరశాస్త్రి ప్రముఖ పురాణ ప్రవచకులు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ,భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టు కారణంగా పురాణప్రవచన ప్రముఖులలో ఆయన ప్రత్యేకతను సంతరించుకున్నారు. తన పదిహేనవ ఏట నుంచి ప్రారంభించిన ఈ ప్రవచన యజ్ఞం అసిధారావ్రతంగా ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం 87 ఏళ్లు పైబడినా ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో మల్లాది చంద్రశేఖరశాస్త్రి సుప్రసిద్ధులు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రమైన అమరావతి మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారి జన్మస్థలం. మల్లాది దక్షిణామూర్తి దంపతులకు 1925 ఆగస్టు 28వ తేదీన జన్మించిన చంద్రశేఖరశాస్త్రిగారు సనాతన సత్సంప్రదాయం గల కుటుంబంలో జన్మించారు. అమరావతి పరిసర గ్రామాల్లో వేదవిద్యలకు మల్లాది వారి కుటుంబం పేరుపొందింది. బాల్యంలో చంద్రశేఖరశాస్త్రిగారు వారి తాతగారైన మల్లాది రామకృష్ణ విద్వత్ చయనుల వద్ద సంస్కృతం, తెలుగు భాషాసాహిత్యాలు నేర్చారు. తాతగారి వద్దనే శాస్త్ర ప్రకరణం,చెప్పుకుని వేదాధ్యయనం చేశారు.

బిరుదులు[మార్చు]

మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారు వారి సుదీర్ఘ పురాణ ప్రవచన ప్రస్థానంలో ఎందరో ప్రముఖులు, ప్రముఖ సంస్థలతో లెక్కలేనన్ని సన్మానాలు, సత్కారాలు, బిరుదులు పొందారు. అందులో ప్రముఖంగా తిరుమల తిరుపతి దేవస్థానాలలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా స్వామివారి కల్యాణాన్ని భక్తుల కన్నుల ముందు సాక్షాత్కరింపచేసి అభినవ వ్యాస బిరుదును పొందారు. శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖరస్వామి ఆశీర్వదించి సవ్యసాచి బిరుదును, భీమునిపట్నంలో సద్గురు శివానందమూర్తి నెలకొల్పిన సనాతనధర్మట్రస్ట్ ద్వారా ఎమినెంట్ సిటిజన్ అవార్డును అందుకోవడమే కాక మాజీ ప్రధాని పి.వి నరసింహారావుతో సత్కారం అందుకున్నారు. 2005లో ప్రతిష్టాత్మక రాజా-లక్ష్మీ అవార్డు ద్వారా వచ్చిన లక్ష రూపాయల నగదును సనాతనధర్మట్రస్టుకు విరాళమిచ్చారు.