Jump to content

మహాభారత యజ్ఞం

వికీపీడియా నుండి

మహాభారత యజ్ఞం అన్నది చిత్తూరు జిల్లా తొండమనాడు గ్రామంలో నిర్వహించే పద్దెనిమిది రోజుల ఉత్సవం.

ఆలయం పౌరాణికత

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి దగ్గర తొండమనాడులో శ్రీవెంకటేశ్వర ఆలయాన్ని పాండవ సంతతికి చెందిన తొండమాన్ చక్రవర్తి నిర్మించాడన్నది ఒక గాథ. ఇక్కడ ప్రతి ఏటా చైత్ర, వైశాఖ మాసాలలో భారతంలోని పద్దెనిమిది పర్వాలను పద్దెనిమిది రోజులు పాటు ఉత్సవాలుగా భారత మహాయజ్ఞమే నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాలో అనేక గ్రామాలలో ద్రౌపది ధర్మరాజులస్వామివారి ఆలయాలు ఉన్నాయి.[1]

పండగ నిర్వహణ

[మార్చు]
అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. మొగరాల గ్రామంలో జరిగిన భారతంలో ఒక ఘట్టం

ధర్మరాజుస్వామి ఆలయ ప్రాంగణంలోనే పాండవుల కొయ్యబొమ్మలు పెట్టి యజ్ఞం చేస్తారు. ఈ సాంప్రదాయం ఇంకెక్కడ ఉండదు. ఈ మహాయజ్ఞం ధ్వజారోహణతో మొదలై దుర్యోధన వధతో ముగుస్తుంది. దీనిలో శ్రీకృష్ణలీలలు, పాండవజననం, బకాసురవధ, ద్రౌపది స్వయంవరం, సుభధ్రా కళ్యాణం, రాజసూయయాగం, విరాటపర్వం, ఉత్తర గోగ్రహణం, గయోపాఖ్యానం, శ్రీకృష్ణరాయబారం, కర్ణమోక్షం, దుర్యోధనవధ, ధర్మరాజు పట్టాభిషేకం వంటి ఘట్టాలు ప్రదర్శిస్తారు. ప్రతి ఘట్టం ఒక మహోత్సవమే. ద్రౌపదితో పాటు పాండవుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. బండికుంభం ఘట్టంలో భీమసేన పాత్రధారిని ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండిపై ఊరేగించి బూరి నైవేద్యాలు సమర్పిస్తారు. చివరిగా ఆలయం వద్ద భీమసేన, బకాసురుని యుద్ద దృశ్యాలు ప్రదర్శిస్తారు.

ఈ పండుగలో ఆర్జునుడి తపస్సుకు ఒక ప్రత్యేకత ఉంది.ఒక తాడి చెట్టుని ప్రతిష్ఠించి, అర్జునుడు ఆ చెట్టు ఎక్కేందుకు వీలుగా కొయ్య మెట్లు అమర్చి చెట్టును అందంగా అలంకరిస్తారు. అర్జునుడు పాత్రదారి పద్యాలు పాదుతూ చెట్టు ఎక్కుతాడు. పూలు, నిమ్మకాయలు విసురుతారు. ఆ నిమ్మకాయలు తింటే పిల్లలు పుడతారని, విసిరిన పువ్వులు సౌభాగ్యాన్నిస్తాయనీ వారి నమ్మిక.

యజ్ఞంలో చిట్ట చివరి ఘట్టం దుర్యోధన వధ. ఆలయ ఆవరణలో దుర్యోధన వధ చేస్తారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 (ఈనాడు విలేకరి), బాలచంద్ర (2014-05-25). "చిత్తూరు భారతం". ఈనాడు ఆదివారం: 5.
  • ఈనాడు ఆదివారం సంచిక

ఇతర లింకులు

[మార్చు]