మహ్మద్ ఇస్మాయిల్
ప్రముఖ సాహితీ విమర్శకుడు, కథా రచయిత స్మైల్ అసలు పేరు మహ్మద్ ఇస్మాయిల్ (జ: 1943 - మ: 2008). చెక్కుచెదరని చిరునవ్వు సొంతంగా చేసుకున్న ఆయన ఖాళీ సీసాలు కథా రచయితగా చిరపరిచితులు. సాహిత్యం సమస్యల్లో చిక్కుకుంటున్న తరుణంలో రాజమండ్రిలో 'రైటర్స్ కార్నర్' అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేసి కవులు, రచయితలకు ఒక వేదికను ఏర్పాటు చేశారు. ముస్లిం అయినా భాషకు, భావానికి ఎల్లలు లేవని చాటి చెప్పారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కృష్ణా జిల్లా తేలప్రోలులో జన్మించిన ఆయన పదో తరగతి వరకు అక్కడే చదివారు. ఇంటర్, డిగ్రీలను ఏలూరులో పూర్తి చేశారు. విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ పనిచేస్తున్న సమయంలోనే ఎపిపిఎస్సీపోటీ పరీక్షలలో నెగ్గి వాణిజ్య పన్నుల శాఖలో ఎసీటీవో అయ్యారు. డిప్యూటీ కమీషనర్ గా కాకినాడలో రిటైర్ అయ్యారు. విశాఖపట్నంలో పనిచేస్తున్న సమయంలో ఖాళీ సీసాలు అనే కథను రచించారు. విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రి (కె.జీ.హెచ్.) బయట ఖాళీ సీసాలు అమ్ముకునే ఇద్దరు మహిళల దుర్భర జీవనాన్ని తన కథా వస్తువుగా ఎంచుకుని ఖాళీసీసాలకే ప్రాణం పోశారు. ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అన్ని భారతీయ భాషలలోకి అనువదించింది. సినీరంగంలోను ఆయనకు సంబంధాలు ఉన్నాయి.
స్మైల్ డిసెంబర్ 5, 2008 తేదీన కన్నుమూశారు
రచనలు
[మార్చు]- ఖాళీ సీసాలు
- వల
- సముద్రం
- అ (నాటకం)