మాకినీడి సూర్య భాస్కర్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మాకినీడి సూర్య భాస్కర్ పేరెన్నిక గల కవి, విమర్శకుదు, చిత్రకారుడు. ఈయన 1962, ఆగస్టు 17న కాకినాడలో మాకినీడి శ్రీరంగనాయకులు, సరస్వతి దంపతులకు జన్మించాడు. తొమ్మిదవ తరగతి చదువుతున్న కాలం లోనే 'సుమ కవితాంజలి ' అనే ఖండ కావ్యాన్ని వ్రాశాడు. తరువాతి కాలంలో దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పుస్తక రూపేణా అచ్చు వేయించారు. జీవిత భాగస్వామి మనసెరిగి మసలుకునే అనుకూలవతి సుభద్ర.
ఈయన వృత్తి అధ్యాపకత్వం. ఆంగ్ల ఉపాధ్యాయుడు. ప్రవృత్తి సాహిత్యం, చిత్రలేఖనం. అంటే కలం పట్టుకుని ఒక వైపు భావ చిత్రాలు రచిస్తూనే, మరో ప్రక్క కుంచెతో విన్యాసాలు చేసే సత్తా ఉన్న కళాకారునిగా మనకు కనిపిస్తాడు. ఈయన యాభై జలవర్ణ చిత్రాలు, ఇరవై మినీయేచర్లు గీయడమే కాకుండా కళా విమర్శక వ్యాసాల సంపుటి 'కళాతోరణం' (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ) కూడా వెలువరించారు.
శతాధిక గ్రంథకర్త మాకినీడి సూర్య భాస్కర్. "కవిగా, చిత్రకారుడిగా, సాహితీ విమర్శకుడిగా తెలుగు సాహితీ ప్రపంచం మెచ్చిన రచయిత. స్వతహాగా తక్కువ మాట్లాడే మాకినీడి- కవిత్వం, విమర్శ, చిత్రకళ అనే మూడు రంగాలలో అవిశ్రాంతమైన అనితర సాధ్యమైన కృషిని కొనసాగిస్తున్నారు. మాకినీడ సూర్య భాస్కర్ కి నిశ్శబ్దంగా ఆంధ్ర, ఆంగ్ల, హిందీ సాహిత్యాలని అధ్యయనం చేయడమే ఇష్టమైన వ్యాపకం. చిత్రకారుడిగా చిత్రకళా ప్రపంచంలోని మాకినీడి అభ్యసన అధ్యయనాలకి గుర్తుగా 'రామారావు నుంచి రామారావు దాకా' అనే గ్రంధాన్ని తీసుకువచ్చారు. అలాగే కవులుగా చిత్రకారులుగా చరిత్రలో మరచిపోలేని సువర్ణ అక్షర చిత్రమాలికలను మిగిల్చిన కవి చిత్రకారులపై సుదీర్ఘకాలంగా పరిశోధన కావించి మంచి వ్యాసాలను చిత్రకళా జగతికి అందిస్తున్నారు. ఆంగ్ల సాహిత్యంలో అరుదైన ప్రజ్ఞను, తెలుగు సాహిత్యంలో అలుపెరుగని గ్రంథ అధ్యయనాన్ని సొంతం చేసుకున్న మాకినీడి తెలుగు సాహిత్యానికి దొరికిన మంచి విమర్శకుడు," అని చినుకు సాహిత్య మాసపత్రిక సంపాదకులు నండూరి రాజగోపాల్ మాకినీడి గురించి అన్నారు.
"మాకినీడి సుకవి" అని అభివర్ణిస్తూ, గురు సహస్రావధాని డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారు-
"మాకినీడి వంశ మహనీయుడైనట్టి
సూర్య భాస్కరుండు సుకవి వరుడు!
వారి చిత్రకవన వైభవ మందున
వారి చిత్రకవన వైమర్షికమ్మున
స్నానమందు గాత జగతి యెల్లో!" అని కితాబిచ్చారు.
మాకినీడి...సాహితీ జీవనాడి!
కవిగా మాకినీడి ప్రకృతి గీసిన వికృత చిత్రం, పాపికొండల్లో పడవ పాట, ఆమె (దీర్ఘ కవిత), జీవితం (దీర్ఘ కవిత), తడి తడిగా ఆలోచించే, నాకు నేను దొరికిన క్షణాలు, మాకినీడి వరణ కవితలు, మినీ మెగా చురకలు, అనేకులుగా, చినుకు మనిషి-గోదారి సమాజం అనే వచన కవితా సంపుటాలను ప్రచురించారు. పాపికొండల్లో పడవ పాట తెలుగు ఆంగ్లం హిందీలలో కలిపి త్రిభాషా సంపుటిగా వెలువడింది.
మాకినీడి పద్య కవితా సంపుటాలు- సుమ కవితాంజలి, సామెతకో పద్యం, మాకినీడి-మద్ధూరి పద్య సంభాషణం, రాధికాకృష్ణం అనేవి.
హైకూకవిగా మాకినీడి - హైకూచిత్రాలు, రాలిన పుప్పడి ప్రకృతి (ఫోటో హైకు), ఋతురాగాలు, హైకూ- హైగా కరోనా హైకూ- హైగా అనే సంపుటాలను ప్రచురించారు.
సాహిత్య విమర్శకుడిగా లబ్ద ప్రతిష్టుడైన మాకినీడి సూర్య భాస్కర్ - కళా సాహితీ తోరణం, హైకూ కవిత్వం, అనుశీలన- ఒక అవగాహన, నానీలు - నాలుగు వ్యాసాలు, దృక్కోణం (సాహిత్య విమర్శ వ్యాసాలు), రెండు ఎలిజీల మధ్య (సాహిత్య సమీక్ష వ్యాసాలు), విమర్శ - పరామర్శ (సాహిత్య వ్యాసాలు), పద్యం-హృద్యం (పద్యకృతులపై విమర్శ వ్యాసాలు), కంచి చేరిన కథలు (కథలపై విమర్శ వ్యాసాలు), కవిత్వం చిరునామా, తాత్విక రెక్కలు -ప్రస్థానం, కొత్త పాళీ, తొలి గీటు (ముందు మాటలు), నేను నా రచనా వ్యాసంగం అనే విమర్శ గ్రంథాలు రచించారు. తెలుగులో లఘు కవితలపై చెప్పుకోదగ్గ కృషి చేసిన మాకినీడి- హైకు, నానీ, రెక్కలు ప్రక్రియలపై మొట్టమొదటి విమర్శ గ్రంథాలను రాశారు. తనకు ఇష్టమైన కవి విమర్శకులు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారిపై మూడు పుస్తకాలు రాశారు. షష్ట్యబ్ది కానుకగా 'అద్దేపల్లి కవిత్వం వ్యక్తిత్వం తత్వం' అనే పుస్తకాన్ని, సప్తతి కానుకగా 'అద్దేపల్లి కవిత్వం పరిణామం' అనే పుస్తకాన్ని, అశీతి కానుకగా 'ప్రజాకవి అద్దేపల్లి సాహితీ జీవన యానం' అనే పుస్తకాన్ని ప్రచురించారు.
"బాల సాహిత్య శిల్పి"గా మాకినీడ ప్రసిద్ధులు. జ్యోతిబాల స్వర్ణ భారతి, పెద్దలు చెప్పిన చిన్న కథలు, పేరులోన పెన్నిధి (శాస్త్రవేత్తల జీవన సంగ్రహాలు), బాల్యం ఒక పాట, వెన్నెల, గ్రహాలు - సంగ్రహాలు, సౌమ్య మోహనారామం, అనే బాలసాహిత్య గ్రంథాలను ప్రచురించారు. తూర్పుగోదావరి 'బాలసాహితి ప్రాజెక్టు'లో భాగంగా మాకినీడి రచనలను 1, 2 తరగతులకు కథా వాచకంగా ప్రచురించింది జిల్లా విద్యాశాఖ.
కథకుడిగా మాకినీడి అంత సౌందర్యం, పునాస అనే రెండు కథా సంపటాలను ప్రచురించారు. ఈ రెండు సంపుటాలను తరువాత 'మాకినీడి కథలు' అనే సమగ్ర కథాసంపుటిగా ప్రచురించారు.
కళా విమర్శకుడిగా మాకినీడికి తెలుగు సాహిత్యం లో మంచి పేరుంది. రామారావు నుంచి రామారావు దాకా, చిత్రకళ - మాకినీడి వంశం, రమ్య చిత్రశాల తెలుగు నేల, దామెర్ల కళ- వారసత్వం, జీవన సంజీవని, కవి చిత్రకారులు, కళ-సంవిధానాలు, కాగితంతో కళాకృతులు, రామారావు కవిత్వంలో చిత్రకారుడు ఎస్వీ యశస్వి అనే కళా విమర్శ గ్రంథాలను రాశారు.
తనకు ఇష్టమైన కవుల పైన చిత్రకారుల పైన ప్రత్యేకించి మోనోగ్రాఫ్లను ప్రచురించారు మాకినీడి. వాటిని "చిరు గ్రంథ కానుకలు మరుగంధ మాలికలు" అనే పేరుమీద ప్రచురించారు. అవి- కొండేపూడి తాతబ్బాయి కవితా సంపుటి పైన అమ్మ, గూడ శ్రీరాములు వ్యాసాలు నిగూఢ విమర్శ విన్యాసాలు, మినీ కథన శిల్పి కె.బి. కృష్ణ, కడలి బ్రతుకుల కల్లోల సరణి రామ్షా రచనలు- వైసిస్టియం, మధునా పంతుల కవిత్వం తత్వం, విహారి శ్రీపద చిత్ర రామాయణము- ఒక సమాలోచన, ఆత్మకూర్పు రామకృష్ణ, డాక్టర్ బి.ఆర రాజ్ చిత్రాలు, శిల్ప చిత్రకళ పరిజ్ఞాని చలసాని, వర్ణ సంగీత మాంత్రికుడు డాక్టర్ మాచిరాజు బహు కళా ప్రజ్ఞాశాలి అంట్యాకుల, ప్రజా చిత్రకారుడు మోహన్, చిత్రకళ కులపతి ఆస్వార్డ్ జెనీఫర్ కూల్ డ్రే, చిత్రకళా స్రవంతి ఆంజనేయులు మొదలైనవి.
భాష-పరిభాషపై 'తెలుగులో పారిభాషిక సమస్యలు', తెలుగు మనుగడకు వెలుగు మార్గాలు అనే పుస్తకాలు రాశారు. ఆంగ్లంలో ఫాల్కన్ ఇన్ ది రైన్, బుద్ధ లైఫ్ అండ్ హిస్టరీ, మెలోడీస్ సాంగ్స్ ఫర్ ఎమ్మెస్, యోగానందజి -మై ఫెర్వర్, ఓ బిలవెడ్ పోయేట్, అయాం సెక్సేజనేరియన్ నౌ- స్వీట్ 60 పోయెమ్స్, పోయే ట్రీ (పోయెమ్స్ ఆన్ ట్రీ), మాకినీడిస్ హైకూ అనే గ్రంథాలను ప్రచురించారు.
ఇక అకాడమిక్ గ్రంథాల విషయానికొస్తే -పాఠశాల పాలన, ఎయిడ్స్ చికిత్స చికిత్స, చదువుల పండుగ, సైంటిఫిక్ టెంపర్, కొలెస్ట్రాల్, ఇన్ఫాంట్ ఫీడింగ్, సత్యాన్వేషణలో విటమిన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ఏకలిపి, తరాల మార్పు కోసం, మాకినీడి గణిత వ్యాసాలు, కాప్రేకర్ సిద్ధాంతం అధ్యయనం పరిశీలన భాస్కర్ స్థిరాంకం అనే గ్రంథాలను ప్రచురించారు.
ఆ విధంగా శతాధిక గ్రంథకర్తగా మాకినీడి తెలుగు సాహిత్యానికి సంబంధించిన అనేక ప్రక్రియలలో గ్రంథాలను ప్రచురించారు.