మాయని మమత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాయని మమత
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
తారాగణం నందమూరి తారక రామారావు ,
చలపతిరావు,
బి.సరోజాదేవి
సంగీతం అశ్వత్థామ
నిర్మాణ సంస్థ భవాని ఫిల్మ్స్
భాష తెలుగు

మాయని మమత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1970, ఆగస్టు 13వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1] నందమూరి తారక రామారావు, బి సరోజా దేవి, శోభన్ బాబు , లక్ష్మి, నాగభూషణం ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం అశ్వద్ధామ అందించారు.

నటీనటులు

[మార్చు]
 • ఎన్.టి.రామారావు - మధు
 • బి.సరోజాదేవి - జ్యోతి
 • టి.చలపతిరావు
 • శోభన్ బాబు
 • లక్ష్మి
 • రాజబాబు
 • నాగభూషణం
 • విజయసారథి
 • త్యాగరాజు
 • ముక్కామల
 • సాక్షి రంగారావు
 • రమాప్రభ
 • హేమలత
 • ధూళిపాళ మొదలైన వారు.

సాంకేతిక వర్గం

[మార్చు]

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

మధు ధనవంతుడు. సాహితీ ప్రియుడు. మృదువైన కవిత చెప్పగల మధురకవి. పదునైన రచనలతో పాఠకులను ఉత్తేజపరచే పత్రికా రచయిత. అతడి రచనా వ్యాసంగానికి 'వజ్రాయుధం' పత్రిక ఆటపట్టు. ఆ పత్రిక సంపాదకుడు జానకిరామయ్య అంటే అతడికి గౌరవాభిమానాలు. ఆ పత్రిక రజతోత్సవ సభలో అతడు జానకిరామయ్యచేత సన్మానించబడతాడు. అప్పుడే అతడికి జానకిరామయ్య కుమార్తె జ్యోతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది.

స్వార్థపరుల అత్యాచారాలను నిశితంగా విమర్శించే మధు రచనలు వజ్రాయుధం పత్రిక మనుగడకే ముప్పుతెస్తాయి. ఆర్థికమైన చిక్కులలో ఉన్న ఆ పత్రికను స్వార్థపరుడు, నయవంచకుడు అయిన జగన్నాథం అప్పు క్రింద స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడతాడు. అభిమానధనుడైన జానకిరామయ్య పత్రికకోసం దానాలు, విరాళాలు స్వీకరించడని తెలుసుకున్న మధు ఎలాగో ఆర్థికంగా ఆదుకొని పత్రికను నిలబెడతాడు. అయినా జానకిరామయ్య మరణించడంతో ఆయన పేరుమీదనే పత్రికను కొనసాగిస్తూ ఉంటాడు.

జానకిరామయ్య మృతితో అతని కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. మధు వారికి మరింత సహాయపడటానికి ప్రయత్నిస్తాడు. కాని జ్యోతి అన్న రవి అందుకు అయిష్టత వ్యక్తం చేసి ఉద్యోగరీత్యా బొంబాయి వెళ్లినప్పుడు జ్యోతి బాధ్యతను స్వీకరిస్తాడు. జ్యోతిని పెళ్ళి చేసుకోవాలనే తన ఆకాంక్షను మధు తెలియజేస్తాడు. కాని హఠాత్తుగా రవి మరణించాడన్న పుకారు పుట్టడంతో జ్యోతి మరింత క్రుంగి పోతుంది. వివాహం వాయిదా పడుతుంది.

సేవాసదనం ధర్మకర్త జగన్నాథం సదనం నిధులను చందాలను దుర్వినియోగం చేయడాన్ని బయట పెడతాడు మధు. దానితో మధు అంటే జగన్నాథానికి ద్వేషం ఏర్పడి పత్రికను నాశనం చేయడానికి, మధును అంతమొందించడానికి జగన్నాథం శతవిధాల ప్రయత్నిస్తాడు. కాని ఫలితం లేకపోతుంది. ఆ పరిస్థితిలో మధు సాంస్కృతిక ప్రతినిధివర్గం నాయకుడిగా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. మధు విదేశాలనుండి తిరిగి వచ్చేసరికి జ్యోతి అపవాదులకు గురై ఇల్లు వదిలి వెళ్లిపోయి ఉంటుంది. మధు తల్లి కూడా జ్యోతిని శంకిస్తుంది. మధు ఎంతో విచారిస్తాడు. జ్యోతికోసం అన్నిచోట్లా వెదుకుతాడు.

మధు తల్లి మనోవ్యాధితో మంచం పడుతుంది. ఆమె తుది కోర్కె చెల్లించడానికి జగన్నాథం కుమార్తె నీలను పెళ్ళి చేసుకోవడానికి తల ఒగ్గుతాడు మధు. నీల రవిని పేమించిన సంగతి మధుకు తెలియదు. మధు నీలను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించినా జ్యోతిని మరచిపోలేక పోతాడు. రవి బ్రతికి ఉన్నాడని, నీల రవి ఒకరినొకరు ప్రేమించారని మధుకు తెలుస్తుంది. మారువేషంలో వచ్చిన రవికి నీలకు వివాహం చేసి జగన్నాథం మోసాలను, దురాగతాలను బట్టబయలు చేయడానికి ప్రయత్నిస్తాడు మధు. చివరకు ఆ స్వార్థపరుని కబంధ హస్తాలనుండి బయటపడి జ్యోతిని వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.[2][3]

పాటలు

[మార్చు]
 1. అనగనగా ఒక మహారాజు ఆతని పేరు ఉదయనుడు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా.సినారె
 2. ఈ బ్రతుకే ఒక ఆట తీయని వలపుల బాట - బి. వసంత, ఎస్.పి. బాలు - రచన: శ్రీ శ్రీ
 3. ఎవరో వచ్చే వేళాయె ఎదురై కాస్త చూస్తారా వాకిలి - పి.సుశీల, బి.వసంత బృందం - రచన: దేవులపల్లి
 4. ఏమైతివి ప్రియసఖీ ఎందుంటివి ఇందుముఖీ నీవులేని ( సాఖీ ) - ఘంటసాల - రచన: డా. సినారె
 5. ఓరోరి సిన్నవాడా మాయదారి బుల్లోడా - ఎల్.ఆర్. ఈశ్వరి, పిఠాపురం - రచన: శ్రీశ్రీ
 6. కనులు మాటలాడునని మనసు పాట పాడునని - పి.సుశీల, ఘంటసాల - రచన: డా.సినారె
 7. కళ్ళు తెరచి చూచుకోండయా ఓరయ్యల్లారా కల్ల నిజం తెలుసు - ఘంటసాల - రచన: కొసరాజు
 8. మగవారలపై మగువలు జగడాలకు దారితీయు (పద్యం) - ఎస్.పి.బాలు - రచన: శ్రీశ్రీ
 9. రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం రాలిన సుమాల - ఘంటసాల - రచన: దేవులపల్లి
 10. స్వప్న వాసవదత్త ( నాటకం) - ఘంటసాల, పి.సుశీల, రమణ - రచన: డా. సినారె
 11. సాధువుల బ్రోచి దుష్టుల సంహరించి ధర్మమును నిలుప (పద్యం) - పి.సుశీల - రచన: శ్రీశ్రీ

మూలాలు

[మార్చు]
 1. మాయని మమత చిత్ర సమీక్ష, ఆంధ్రపత్రిక, 15 ఆగష్టు, 1970, పుట. 12.
 2. "చిత్ర ప్రభ - మాయని మమత". ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక: 48. 4 March 1970. Retrieved 19 October 2016.[permanent dead link]
 3. ఎపి ప్రెస్ అకాడమీ (20 ఆగస్టు 1970). "మాయని మమత చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 11 August 2017.[permanent dead link]
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
"https://te.wikipedia.org/w/index.php?title=మాయని_మమత&oldid=4210107" నుండి వెలికితీశారు