మాల జంగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాల జంగాలు

మాల జంగం అనేది భారతదేశంలో షెడ్యూల్ కులానికి చెందిన ఒక కులం. [1] ఈ కులానికి చెందిన వారు దక్షిణాసియాలోని భారతదేశంలో మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలలో ఉన్నారు. [2]

విశేషాలు

[మార్చు]

ఈ కులంవారు మాల కులస్థుల లోని శైవ విభాగానికి చెందిన పండుగలు, వేడుకలను నిర్వహిస్తున్న అర్చక తరగతికి చెందినవారు. వారు ఇతర షెడ్యూల్డ్ కులాల వేడుకలు, ఉత్సవాలను నిర్వహించరు. వైష్ణవ విభాగానికి పూజలు నిర్వహించే వారిని "మాల అయ్యోర్లు" గా పిలుస్తారు. మాల జంగాలు మాలలలో విభూధి దారులకు గురువులుగా ఉంటారు.[3] వీరిపై జరిగిన అధ్యయనం ప్రకారం వీరు మాలల కంటే అత్యున్నత వర్గానికి చెందుతారు. మాల జంగం కులం మూలం గురించి చాలా తక్కువ తెలుసు. వీరిని సాధారణంగా జంగం లేదా జంగాలుగా పిలుస్తారు. సాహిత్య పరంగా జంగం అనగా "చలనం". శివుని జీవిత చిహంగా భావించే ఈ కులస్తులను జంగాలు గా పిలుస్తారు. వీరిలో స్త్రీ పురుషులు లింగ ధారణ చేస్తారు. అనగా పురుషులు జంధ్యం తో పాటు లింగం ధరిస్తారు. అలాగే స్త్రీలు కూడా మెడలో లింగమును త్రాడుతో పాటు ధరిస్తారు. 1961లో జరిగిన సర్వే ప్రకారం తెలంగాణ లోని నిజామాబాదు జిల్లాలోని పాల్వంచలో నివస్తిస్తున్న మాల జంగం చెప్పిన వివరాల ప్రకారం ఈ కులస్థులకు మాలజంగం అనే పేరు వచ్చినట్లు తెలుస్తుంది. పూర్వం ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికి వివిధ పూజా కార్యక్రమాలను జంగం కులస్థులు నిర్వహిస్తుండేవారు. ఒకరోజు ఒక వైశ్యుడు తన ఇంటిలో జరిగే వేడుకకు జంగం ను పిలిచేందుకు ఆ గ్రామంలో వెదుకుతాడు. ఒక చోట మాల కులస్థుల ఇంట జంగం భోజనం చేయడాన్ని గమనిస్తాడు. వైశ్యుడు మాలల ఇంట భోజనం చేయకూడదని ఆ జంగానికి చెబుతాడు. దానికి జంగం తాను గ్రామంలో పూజా కార్యక్రమాలు చేసిన ప్రతీ ఇంట భోజనం చేస్తానని బదులిస్తాడు. వైశ్యుడు కోపంతో ఆ రోజు నుండి మాల కులస్థులకు మాత్రమే పూజాకార్యక్రమాలు నిర్వహించమని చెబుతాడు. అప్పటి నుండి జంగం మాల కులస్థులకు మాత్రమే పూజా కార్యక్రమాలు చేయడం వలన అతను మాల కులంలో "మాల జంగం" గా గుర్తింపు పొందాడు.[4] వారి కులానికి సంబంధించిన ఈ మూలం తప్ప మరేదీ లభ్యం కాలేదు. మాల జంగములు కథలు చెప్తారు. వీరు నలమహారాజు, పల్నాటి బాలచంద్రుడు మొదలగు ఇతిహాస కథలను బుర్రకథల ఫక్కీలో చెబుతారు.

1961 జనాభా లెక్కల ప్రకారం మాల జంగాలు మహబూబ్‌నగర్, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కనిపిస్తారు.

నివాసాలు

[మార్చు]

వీరు ప్రతీ గ్రామానికి దూరంగా ఆగ్నేయ దిశలో గుడిసెలు నిర్మించుకుని నివాసముంటుంటారు. గుడిసెకు ప్రధాన ద్వారం ఎప్పుడూ ఉత్తర వైపు ఉంటుంది.

జానపద కళ

[మార్చు]

ఈ కులానికి చెందిన వారు బుర్ర కథలనే ప్రత్యేక ఫక్కీలో చెపుతారు. వీరి తంబురా నెమలిఈకలతో అలంకరింప బడి వుంటుంది. వీరి చేతి వుంగరాలతో తంబురా బుర్రను తాళ ప్రకారం మీటుతూ కథ చెపుతూ వుంటారు. ముఖ్యంగా వీరి కథలు కరుణ రస ప్రధాన మైనవి. వీరి ప్రదర్శనాలు సాయంత్రం ప్రారంభమై తెల్లవార్లూ జరుగుతూ వుంటాయి. వీరు చెప్పే కథా సాహిత్యం ఎటువంటిదో మనకు తగిన ఆధారం గ్రంధారూపంగా లభించదు. వీరి వాయిద్యాలలో డోలు ప్రసిద్ధి చెందిన వాయిద్యం. ఇంకా వీరు ఉపయోగించే వాయిద్య విశేషాలలో ముఖ్య మైనది జమలిక . దీనినే జవనిక, జముకు అని పిలవడం కూడా కద్దు. వీరి మరొక వాయిద్యం తుడుం కొమ్ము. వీరిని కొన్ని ప్రాంతాలలో రూజ వారని కూడా పిలుస్తూ వుంటారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Scheduled Castes, Scheduled Tribes and Backward Classes - Issue of Community, Nativity and Date of Birth Certificates Rules, 1997". www.bareactslive.com. Archived from the original on 2021-04-16. Retrieved 2021-04-16.
  2. Project, Joshua. "Mala Jangam in India". joshuaproject.net (in ఇంగ్లీష్). Retrieved 2021-04-16.
  3. Hassan, Vol. I, p. 430
  4. "Ethnographic Notes, Part V-B (10), Vol-II" (PDF). lsi.gov.in/. 1961.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Wikisource link to మాల జంగాలు". Wikisource link to తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్. 1992. 

బాహ్య లంకెలు

[మార్చు]