ముక్త్యాల రాజా వాసిరెడ్డి

వికీపీడియా నుండి
(ముక్త్యాల రాజా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్రదేశములో పేరు ప్రతిష్ఠలు గల వాసిరెడ్డి వంశమునకు చెందినవారు[1]. ఈతనిని ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. ఆంధ్ర ప్రదేశ్ కు తలమానికమగు నాగార్జున సాగర్ డాం నిర్మాణానికి ప్రసాదు గారు అహర్నిశలూ శ్రమించారు.

తొలుత రాజా గారు కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణానికి కృషిచేసారు.[2] ఈ ప్రాజెక్టు ఇప్పటికీ తెలుగువారి కలగానే ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రము కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు సన్నాహాలు చేయుట మొదలుపెట్టింది. తొలుత కృష్ణా పెన్నా నదులను సంధించుటకు తలపెట్టింది. ఇది తెలిసి రాజా గారు ఆంధ్ర ప్రాంతములోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. మాచెర్ల నుండి దట్టమయిన అడవులగుండా నందికొండ వరకు వెళ్ళి డాం నకు అనువైన స్థలము చూశారు. సొంత డబ్బుతో రిటైరయిన ఇంజినీర్లను ఒక టీంగా తయారు చేసి వారిచే ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు చేయించారు[3]. మద్రాసు ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘము స్థాపించి కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వము ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు. దీని వెనుక ఎవరున్నారో రాజాగారికి అర్ధమయింది. వారు వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. ఖోస్లా కమిటీ నందికొండ డాం ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చారు.

ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు ఢిల్లీలో ప్రయత్నములు మొదలైనవి. రాజా గారు ఢిల్లే వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషను సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేసిరి.

అప్పటి ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు చందూలాల్ త్రివేదిప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారిని ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10వ తేదీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. నిర్మాణ సమయములో రాజా గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. 1966 ఆగస్టు మూడున డాం నుండి నీరు వదిలారు.

నాగార్జునసాగర్ డాం ముక్త్యాల రాజావారి కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యముగా సాగర్ ఆయకట్టు రైతులకు రాజాగారు బహుధా స్మరణీయులు. కాని రాజావారి సేవలను తర్వాతి తరము వారు ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు గుర్తించలేదు సరిగదా పూర్తిగా మరచారు. రాజావారికి ఇందిరా దేవి అను కుమార్తె గలరు. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త, పూర్వ ఐ.సి.యస్ ఉద్యోగి వెలగపూడి రామకృష్ణ గారి కుమారుడు దత్తు గారిని పెండ్లాడారు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. టి. గౌరీశంకర్, ముక్త్యాల దీపం: రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారి జీవిత చరిత్ర, రాణి భవానీదేవి మెమోరియల్ ట్రస్ట్, 1988
  2. Cusecs candidate By K. L. Rao పేజీ.31
  3. Nagarjuna Sagar: the epic of a great temple of humanity : world's largest masonry dam; M. Gopal Rao; Bharatiya Vidya Bhavan, 1979

వనరులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.