Jump to content

మేఘం

వికీపీడియా నుండి
(మేఘము నుండి దారిమార్పు చెందింది)

మబ్బులు లేదా మేఘాలు (Clouds) అనగా వాతావరణంలో తేలియాడే నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాల సమూహం. సూర్యరశ్మి కారణంగా భూమిపై ఉన్న సముద్రాలు, నదులు, ఇతర జలవనరుల నుండి నీరు ఆవిరై పైకి చేరి, వాతావరణంలో చల్లబడి మేఘాలుగా రూపాంతరం చెందుతుంది. ఇవి భూమిపై కురిసే వర్షాలకు మరియు వాతావరణ సమతుల్యతకు ప్రధాన మూలం.

మేఘాలు ఎలా ఏర్పడతాయి?

[మార్చు]

సూర్యుని వేడికి భూమి ఉపరితలం మీదున్న గాలి వేడెక్కి, నీటి ఆవిరిని మోసుకుంటూ వాతావరణంలో పైకి వెళ్తుంది. గాలి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడటం వల్ల, ఆ గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించి (Condensation) చిన్న చిన్న నీటి బిందువులుగా లేదా మంచు కణాలుగా మారుతుంది. వాతావరణంలో ఉండే ధూళి కణాల చుట్టూ ఈ నీటి బిందువులు చేరి మేఘాలుగా ఏర్పడతాయి.

మేఘాల్లో రకాలు

[మార్చు]
మేఘాలు
Cloud classification by altitude of occurrence

వాతావరణంలో అవి ఉండే ఎత్తును బట్టి మేఘాలను ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు:

  • ఎత్తైన మేఘాలు (High clouds): ఇవి 5 నుండి 13 కి.మీ. ఎత్తులో ఉంటాయి. ఉదాహరణ: సిరస్ (Cirrus), సిరోక్యుములస్ (Cirrocumulus), సిరోస్ట్రాటస్ (Cirrostratus).
  • మధ్యస్థ మేఘాలు (Middle clouds): ఇవి 2 నుండి 7 కి.మీ. ఎత్తులో ఉంటాయి. ఉదాహరణ: ఆల్టోక్యుములస్ (Altocumulus), ఆల్టోస్ట్రాటస్ (Altostratus).
  • తక్కువ ఎత్తులో ఉండే మేఘాలు (Low clouds): ఇవి భూమికి దగ్గరగా 2 కి.మీ. ఎత్తులోపు ఉంటాయి. ఉదాహరణ: స్ట్రాటస్ (Stratus), క్యుములస్ (Cumulus), స్ట్రాటోక్యుములస్ (Stratocumulus).
  • నిలువుగా ఎదిగే మేఘాలు (Vertical clouds): కింది స్థాయి నుండి పై స్థాయి దాకా నిలువుగా విస్తరించే మేఘాలు. ఉదాహరణ: నింబోస్ట్రాటస్ (Nimbostratus), క్యుములోనింబస్ (Cumulonimbus).

ఇతర రకాలు:

క్యుములోనింబస్ మేఘాలు

[మార్చు]

క్యుములోనింబస్‌ మేఘాలకు 'మేఘరాజు' అనే పేరు కూడా ఉంది. భూమి మీద ఏటా 44 వేల క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడతాయని అంచనా. భారీ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఎక్కువగా చేరడం, వాతావరణంలో అస్థిరత వంటి పరిస్థితుల్లో ఇవి ఏర్పడతాయి. బొగ్గు, గ్రానైట్‌, కొండలు వంటివి ఉన్న ప్రాంతాల్లో ఇవి చాలా ఎత్తుకి ఎదుగుతాయి. రుతుపవనాల సమయంలో ఏర్పడే సాధారణ మేఘాలు భూ ఉపరితలం నుంచి 3-4 కి.మీ. ఎత్తు వరకు మాత్రమే వెళతాయి. కానీ క్యుములోనింబస్‌ మేఘాలు మాత్రం 12-15 కి.మీ. ఎత్తు వరకు వెళ్తాయి. వీటి విస్తీర్ణం 10-25 చ.కి.మీ. వరకు ఉంటుంది. భూమిపై ఐదున్నర కిలోమీటర్లు దాటిన తర్వాత వాతావరణం మైనస్‌ డిగ్రీల్లోకి మారుతుంది. దాంతో క్యుములోనింబస్‌ మేఘాల్లోని నీటి బిందువులు మంచు స్ఫటికాలుగా ఘనీభవిస్తాయి. ఇవే వడగళ్లుగా కురుస్తాయి.

క్లౌడ్స్ (సి. 1920ఎస్), యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నిర్మించిన క్లౌడ్స్ గురించి నిశ్శబ్ద డాక్యుమెంటరీ ఫిల్మ్.

క్యుములోనింబస్‌ మేఘాలు రెండు మూడు గంటల వ్యవధిలో ఏర్పడి గంటా, గంటన్నరసేపు భీకర వర్షాన్ని కురిపించి వెళ్లిపోతాయి. ఈ కొద్ది వ్యవధిలోనే భారీ నష్టం జరుగుతుంది. సాధారణ మేఘాల్లో గాలుల తీవ్రత సెకనుకి సెంటీ మీటర్ల స్థాయిలో ఉంటే, వీటిలో మాత్రం సెకనుకి 15-20 మీటర్ల వేగంతో విజృంభిస్తాయి. అందుకే ఈ మేఘాలు ఏర్పడినప్పుడు గంటకు 50 కి.మీ.కు మించిన వేగంతో పెనుగాలులు వీచి చెట్లు కూలిపోవడం వంటివి జరుగుతాయి. క్యుములోనింబస్‌ మేఘాల్లో పుట్టే రుణ, ధనావేశాల కణాల సమూహాల వల్ల మెరుపులు, ఉరుములు ఏర్పడి పిడుగులూ పడతాయి. గంటన్నర వ్యవధిలో గరిష్ఠంగా 25-30 సెం.మీ. వర్షం కురుస్తుంది. వీటిని ఈశాన్య భారతంలో 'కాలబైశాఖి', 'నార్వెస్టర్స్‌' అంటారు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మేఘం&oldid=4938360" నుండి వెలికితీశారు