Jump to content

మేడవరం రామబ్రహ్మశాస్త్రి

వికీపీడియా నుండి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి తెలుగు కవి, పండితుడు. ఆయన ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం కోరిక మేరకు ఆయన లక్ష్మీకాంతం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేసిన సుందరకాండము కావ్యం పూర్తిచేశారు. ప్రసిద్ధ కవి, పండితుడు వేలూరి శివరామ శాస్త్రికి శిష్యుడైన మేడవరం రామబ్రహ్మశాస్త్రి సంస్కృతాంధ్రాల్లో మంచి పండితునిగా పేరొందారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి సుందరకాండముతో పాటుగా జగన్నాథ పండితరాయలు రచించిన భామినీ విలాసం అనే గ్రంథాన్ని సూక్తి సుధ పేరుతో అనువదించారు. పుత్రసంతానం లేని శాస్త్రి తన సుందరకాండనే పుత్రునిగా పేర్కొనేవారు. దురదృష్టవశాత్తూ ఆయన మరణించాకా కానీ ఆయన శిష్యుల చొరవతో సుందరకాండము ముద్రణ పొందలేదు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

మేడవరం రామబ్రహ్మశాస్త్రి 1885లో నెల్లూరు జిల్లాకు చెందిన కంకణంపాటి అగ్రహారంలో వేంకట సుబ్బమ్మ, సుబ్బశాస్త్రి దంపతులకు జన్మించారు. రామబ్రహ్మశాస్త్రి ప్రముఖ పండితుడు, రచయిత వేలూరి శివరామ శాస్త్రి వద్ద సంస్కృత వ్యాకరణం అభ్యసించారు.[1]

వృత్తి, వ్యక్తిగత జీవితం

[మార్చు]

మేడవరం రామబ్రహ్మశాస్త్రి ఉపాధ్యాయవృత్తి చేపట్టి కర్నూలు పట్టణంలో స్థిరపడ్డారు. ఆయన ప్రస్తుతపు కర్నూలు స్టేడియం ప్రాంతంలో నివాసం ఉండేవారు. కర్నూలు పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో సంస్కృతం, తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయనకు వయసు మీద పడేవరకూ సంతానం లేకపోయి, వార్ధక్యంలో ఓ కుమార్తె జన్మించింది. కుమారులు లేని రామబ్రహ్మశాస్త్రి తన సుందరకాండనే కొడుకుగా భావించేవారు. అటువంటి కావ్యం ఆయన మరణానంతరమే ముద్రణ పొందడం ఆయన జీవితంలోని ఒక విషాదం. మేడవరపు రామబ్రహ్మశాస్త్రి 1966-67 మధ్య కాలంలో మరణించారు.[1]

రచనా రంగం

[మార్చు]

తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధుడైన బలిజేపల్లి లక్ష్మీకాంతం వాల్మీకి రామాయణంలోని సుందరకాండాన్ని తెలుగులో కావ్యంగా రాయాలని ప్రయత్నించి కొంతవరకూ రాశారు. తెలియని కారణాల వల్ల అసంపూర్ణంగా వదిలేశారు. ఆ తర్వాత స్వయంగా కర్నూలులో రామబ్రహ్మశాస్త్రిని కలిసి తన సుందరాకాండను పూర్తిచేయమని కోరారు. దాంతో రామబ్రహ్మశాస్త్రి సుందరకాండ పూర్తిచేశారు. కొడుకులు లేని రామబ్రహ్మశాస్త్రి తన సుందరాకాండనే కుమారునిగా భావించేవారు. ఆయన మరణానంతరం ఆయన విద్యార్థులు చందాలు వేసుకుని సుందరాకాండ ప్రచురించారు. జగన్నాథ పండితరాయలు రాసిన భామినీ విలాసం అనే సుప్రసిద్ధ సంస్కృత కావ్యాన్ని రామబ్రహ్మశాస్త్రి సూక్తిసుధగా తెనిగించారు. అయితే గొప్ప పాండిత్యం, వ్యుత్పత్తి ఉండి కూడా రామబ్రహ్మశాస్త్రి రచన రంగంపై తగినంతగా దృష్టి పెట్టకపోవడంతో తగినన్ని రచనలు చేయలేదని కర్నూలు జిల్లా రచయితల చరిత్ర రాసిన కె.ఎన్.ఎస్.రాజు పేర్కొన్నారు.[1]

ప్రాచుర్యం

[మార్చు]

మేడవరం రామబ్రహ్మశాస్త్రి సాహిత్యరంగంలో చక్కగా తెనిగించగల కవిగా ప్రఖ్యాతులయ్యారు. ఆ క్రమంలోనే తన కావ్యాన్ని పూరించమని బలిజేపల్లి లక్ష్మీకాంత కవి కోరారు. భామినీ విలాసాన్ని ఆంధ్రీకరిస్తూ రాసిన సూక్తిసుధ ప్రముఖ కవులు, విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రముఖ పండితుడు దివాకర్ల వెంకటావధాని ఈ కావ్యాన్ని గురించి - "పండితరాయల శ్లోకము లందలి రసభావములను, ధ్వన్యన్యోక్తి విలాసములను, పదప్రయోగాచిత్యమును జక్కగా పరిశీలించి మూలమునకే విధమునను దీసిపోనట్లుగా వారీ యనువాదమును సాగించినారు. ప్రతి పద్యము సరసమైన లలిత సుందర పదప్రయోగ భాసురమై, ప్రౌఢమై హృదయము నానంద తుందిలము గావించినది" అని ప్రశంసించారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ "భామినీ విలాసమునకు మరికొన్ని యాంధ్రీకరణములు కలవు. వానిలో నిది విశిష్ట లక్షణము కలది" అని సూక్తిసుధ విశిష్టత వివరించారు.

ఆయన గద్వాల, వనపర్తి, దైవందిన్నె మొదలైన సంస్థానాలకు వెళ్ళి పాండిత్యాన్ని కనబరచి, సంస్థానాధీశుల సత్కారాలు, బహుమానాలు పొందేవారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 కె.ఎన్.ఎస్., రాజు (3 మే 1994). "మేడవరం రామబ్రహ్మశాస్త్రి". కర్నూలు జిల్లా రచయితల చరిత్ర (1 ed.). కర్నూలు: కర్నూలు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం. pp. 11–18.