యాంటి ఆక్సిడెంట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంటీఆక్సిడెంట్ (ఆంగ్లం: Antioxidant) అనగా ఇతర రసాయన పదార్థాల ఆక్సీకరణాన్ని నిరోధించే ప్రదార్థం.

గ్యాసోలిన్(పెట్రోలు) లో జిగురు ఏర్పడుటను నిరోధించుటకు ఉపయోగపడే సాధారణ ఆక్సీకరణులు అయిన ప్రత్యామ్నాయ ఫీనాళ్ళు మరియు వాటి ఉత్పన్నాలు
నిరోధక ఆక్సీకరణి ఆక్సార్బిక్ ఆమ్లము (విటమిన్ సి) యొక్క నిర్మాణం
లిపిడ్ పెట్రో ఆక్సీకరణం యొక్క స్వేచ్ఛా రాడికల్ విధానం
ప్రతిచర్య ఆక్సిజన్ జాతులు నిర్విషీకరణ(detoxification) కోసం ఎంజైమ్ మార్గం

మానవులకు వరప్రదాయినులు[మార్చు]

యాంటీ ఆక్సిడెంట్స్ మానవులకు వరప్రదా ప్రదాయినులు. ఇవి చాలాకాలం పాటు వయసు పైబడకుండా చేయడమే కాదు... ఆ వయసులో ఉండే వ్యాధినిరోధకతనూ సమకూరుస్తాయి. ఆ పని ఎలా చేస్తాయో తెలుసుకునే ముందుగా మనం మనలోని జీవకణాల గురించి తెలుసుకోవాలి. మన దేహమంతా జీవకణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి జీవకణంలోనూ ప్రతిక్షణం జీవక్రియలు జరుగుతూనే ఉంటాయి. మన దేహాన్ని ఒక వాహనంతో పోల్చుదాం. ఇంధనం మండి, శక్తి విడుదల అయితేనే కదా బండి నడిచేది. అలాగే మన జీవక్రియలన్నీ నడవాలంటే కూడా ప్రతి జీవకణంలో ఇంధనం మండి, శక్తి వెలువడాలి. కణాల్లోని జీవక్రియల్లో జరిగిదేదిదే.

ఈ జీవక్రియల్లో మనం తీసుకున్న పదార్థాలు పరమాణువుల రూపంలో ఉండే అయాన్లుగా మారతాయి. ఒక పదార్థం మూలకంగా ఉన్నప్పుడు మాత్రమే అస్థిత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ అది దాని పరమాణువులుగా మారి అయాన్ల రూపంలో ఉన్నప్పుడు అస్థిత్వం కలిగి ఉండక... తన అస్థిత్వం కోసం పక్కనున్న పదార్థాలతో రసాయనిక చర్య జరిపి మళ్లీ స్థిరమైన మూలకంగా ఏర్పడటం కోసం తపిస్తుంటుంది. ఈ క్రమంలో పక్కన ఏ పదార్థం ఉంటే దానితో రసాయనికచర్య జరుపుతుంది. ఇలా రసాయనిక చర్య జరపడం అంటే మామూలు పరిభాషలో దాన్ని తినేయడమే. ఉదాహరణకు బయటపడి ఉన్న ఒక ఇనుపముక్కతో గాలిలో ఉండే ఆక్సిజన్ రసాయనికచర్య జరిపిందనుకుందాం. ఒక కెమిస్ట్ పరిభాషలో చెప్పాలంటే అక్కడ ఆక్సీకరణం జరిగిందంటారు. కానీ మామూలు వ్యక్తుల భాషలో చెబితే ఆ ఇనుపముక్కకు తుప్పు పట్టిందంటారు.

ఇలాగే మన దేహంలోని కణాల్లోనూ శక్తిని ఉత్పన్నం చేయడం కోసం మనం పీల్చుకునే ఆక్సిజన్ కణాల్లో పోషకాలను మండిస్తుంది. ఆ ప్రక్రియలో జరిగే ఆక్సిడేషన్ ప్రక్రియలో అయాన్లు వెలువడతాయి. ఆ అయాన్లపై విద్యుదావేశం ఉంటుంది కాబట్టి వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. ఆ అయాన్లపై ఉండే విద్యుదావేశాలు రెండూ... పాజిటివ్, నెగెటివ్ చర్య జరిపి ఒక న్యూట్రల్ పదార్థాన్ని ఏర్పరిస్తేనే గాని మళ్లీ ఆ అయాన్ల ప్రభావం అంతరించదు.

ఈ ప్రక్రియలో ఆక్సిడేషన్ తర్వాత అయాన్లు వెలువడతాయి కాబట్టి వాటిని ఆక్సిడెంట్స్ అనుకోవచ్చు. ఇక మనం తీసుకునే తాజా పండ్లు, ఆకుకూరల్లోని పోషకాలు ఆ అయాన్లతో వెంటనే చర్య జరిపి, మన దేహంలోని మిగతా కణాలు వెంటనే దెబ్బతినకుండా కాపాడతాయి. అంటే ఆక్సిడెంట్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి కాబట్టి వాటిని ‘యాంటీ-ఆక్సిడెంట్స్’ అంటారన్నమాట.

కణకాలుష్యం నుంచి విముక్తి, దీర్ఘకాలపు యౌవనప్రాప్తి[మార్చు]

వాహనంలో ఇంధనం మండినప్పుడు శక్తి వెలువడి వాహనాన్ని నడిపిస్తుంది. ఈ క్రమంలో విడుదలైన కాలుష్యపు పొగ... వాహనానికి ఉన్న గొట్టం ద్వారా బయటకు వస్తుంది. మరి మన దేహంలోని కణాల్లోనూ ఇదే ప్రక్రియ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అప్పుడు కూడా మన దేహకణాల్లో మనం పీల్చుకున్న ఆక్సిజన్ వల్ల (శ్వాసక్రియ కారణంగా), ఒక పక్క కణనిర్మాణమూ, మరో పక్క కాలుష్యంతో కణ నాశనం... ఇలా జరిగే కణనాశన ప్రక్రియను అరికట్టేందుకు కణం మరమ్మత్తు చేయబడటం... ఇవన్నీ జరిగే జీవక్రియల్లో (అంటే జీవక్రియ కార్యకలాపాల్లో), శక్తివనరు అయిన గ్లూకోజ్ మండి శక్తి వెలువడే ప్రక్రియలో (అంటే ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియలో) కణాల్లోనూ కాలుష్యాలు ఏర్పడతాయి. ఇవి శరీరంలో లోపల ఏర్పడే కాలుష్యాలు.

కాగా మన వాతావరణంలోనూ దేహకణాలకు హానిచేసే కాలుష్యాలు ఉంటాయి. అవి... వాతావరణ కాలుష్యం, సూర్యకాంతి, ఎక్స్-రేలు, పొగ, ఆల్కహాల్ వంటివి. ఇవన్నీ మనలో అంతర్గతంగా ఏర్పడే కాలుష్యాలు, బయటి కాలుష్యాలు కలగలసి మన దేహ కణాలను నిత్యం దెబ్బతీస్తూ ఉంటాయి. ఒకవేళ ఇలా దెబ్బతీయడమే ఎక్కువగా జరుగుతుంటే మన కణాలకు త్వరగా వృద్ధాప్యం వస్తుంది. ఒకవేళ అప్పటికప్పుడు ఆ కాలుష్యాలను తొలగిస్తూ, అవి చూపే ప్రభావాలను తగ్గిస్తూ ఉండే పోషకాలను మనలోకి పంపిస్తున్నామనుకోండి. అప్పుడు కణం దీర్ఘకాలం ఆరోగ్యంగా, యౌవనంగా ఉంటుంది కదా. అలా ఉండటం వల్ల ఒకపట్టాన మనకు వృద్ధాప్యం దరిచేరదు.

వ్యాధుల నుంచి రక్ష[మార్చు]

యాంటీ ఆక్సిడెంట్స్ (నిరోధక ఆక్సీకరణులు) అనేక వ్యాధుల నుంచి మన దేహాన్ని రక్షిస్తాయి. ప్రధానంగా రెండు రకాలుగా ఇవి శరీరంలోని కణాలను కాపాడతాయి. ఒకటి పోషకాల రూపంలో తీసుకున్నప్పుడు అంటే విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్) గా స్వీకరించినప్పుడు. దాంతోపాటు ప్రోటీన్ల రూపంలోని కొన్ని పోషకాలు మన దేహంలోకి వెళ్లాక రసాయనికచర్యల తర్వాత ఎంజైములుగా మారి కూడా కణాల పాలిట శ్రీరామరక్షగా ఉంటాయి. ఇలా ఈ రెండు తరహాల్లో అవి మనల్ని ఏ క్యాన్సర్ ఏ గుండెజబ్బులు (రక్త ప్రసరణ వ్యవస్థ) , ఏ పక్షవాతం(స్ట్రోక్), ఏ అల్జైమర్స్ ఏ వ్యాధినిరోధకశక్తి లోపంతో వచ్చే జబ్బులు ఏ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏ క్యాటరాక్ట్... వంటి ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి.

యాంటీ ఆక్సిడెంట్స్ పనితీరుకు ఒక ఉదాహరణ[మార్చు]

యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోడానికి ఒక చిన్న ఉదాహరణ. మీరు ఒక ఆపిల్‌ను కోసి వాతావరణంలో ఉంచారనుకోండి. ఆపిల్‌లోని ఇనుముతో గాలిలోని ఆక్సిజన్ చర్య జరిపి కాసేపటి తర్వాత అది బ్రౌన్ రంగులోకి మారుతుంది. కానీ ఒక నిమ్మకాయను పిండి ఆ రసాన్ని ఆపిల్ ముక్కలపై పడేలా చేస్తే అది అలా మారదన్నమాట. అంటే నిమ్మరసంలోని విటమిన్ ‘సి’ అనే యాంటీ ఆక్సిడెంట్... ఆపిల్‌లోని ఇనుము కణాల (ఫ్రీరాడికల్స్)తో), గాలిలోని ఆక్సిజన్ కణాల (ఫ్రీ-రాడికల్స్) తో చర్యజరపకుండా కాపాడిందన్నమాట. ఈ క్రమంలో ఆక్సిజన్ కణాలతో నిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ చర్య జరిపి ఆపిల్ ను రక్షించాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఆపిల్ ముక్కలను తాజాగా ఉంచినట్లు, మన దేహంలోని కణాలనూ తాజాగా ఉంచుతాయి.

యాంటీ ఆక్సిడెంట్స్‌లో రకాలు[మార్చు]

గ్లుటాథయోన్ యొక్క స్పేస్ ఫిల్లింగ్ మోడల్ చిత్రం

.

  1. ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్స్ : గ్లూటాథయోన్, ఎస్‌ఓడీ వంటివి శరీరంలోనే ఉత్పత్తి అయి, అవి 24 గంటలూ శరీరంలోనే ఉంటూ కణాలను రక్షిస్తూ ఉంటాయి. వీటిని ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు.
  2. సెకండరీ యాంటీ ఆక్సిడెంట్స్ : వీటిని మనం బయటి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మన దేహ కణాలను రక్షిస్తుంటాయి.

ప్రకృతిసిద్దంగా దొరికే యాంటీ ఆక్సిడెంట్లు[మార్చు]

Vegetarian diet.jpg

ఆకుకూరలు, ఫలములు మరియు కాయగూరలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా దొరుకును. ఆకుకూరలుః గోంగూర, తోటాకు, పొనగంటాకు, కొయ్యగూర, అటికిమామిడాకు, గురుగాకు, చెంచుళ్ళాకు, పుదిన, మునగాకు, మెంతాకు మొదలైన ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి.

చిక్కుళ్లు :

చిక్కుళ్ల పైతోలులో ఉండే పాలీఫినాల్స్ అనే పోషకాలు చాలా విలువైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇక రాజ్మా, కిడ్నీ బీన్స్ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్లే.

టొమాటో :

వీటిల్లో లైకోపిన్ అనే పోషకం ఉంటుంది. ఇది యాంటీ-క్యాన్సరస్‌గా పనిచేసే యాంటీఆక్సిడెంట్. అయితే టొమాటోలు తినడం ద్వారా లభ్యమయ్యే లైకోపిన్ మన శరీరంలో ఇంకడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు కావాలి. అందుకే వాటిని నాణ్యమైన నూనెతో చేసిన వంటకంగా తీసుకుంటే ఎంతో ఆరోగ్యం.

నట్స్ :

బాదం, ఆక్రోట్, వేరుశనగ గింజలు వంటి వాటిల్లో విటమిన్ ‘ఇ’ పుష్కలంగా ఉంటుంది. ఇది కణాలను దెబ్బ తినకుండా రక్షించి, వయసు పైబడనివ్వకుండా చేస్తుంది. అంతేకాదు.. క్యాన్సర్, గుండెజబ్బులు, క్యాటరాక్ట్ వంటి జబ్బుల నుంచి కాపాడుతుంది. విటమిన్ ‘ఇ’ మరో విటమిన్ అయిన ‘సి’తో కలిసి కొన్ని దీర్ఘకాలిక జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

బెర్రీ పండ్లు :

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో యాంథోసయనిన్, హైడ్రాక్సిసిన్నమిక్ ఆసిడ్, హైడ్రాక్సీబెంజోయిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు, విటమిన్‌‘సి’ పుష్కలంగా ఉంటాయి. ఇది అన్ని యాంటీ ఆక్సిడెంట్స్‌లలోకెల్లా ప్రభావవంతమైనది. పై పోషకాలన్నీ కలిసి మన శరీరానికి ఎన్నో విధాల రక్షణను, ఆరోగ్యాన్నీ సమకూరుస్తాయి. ఎన్నో ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడతాయి. మన దేహంలోని కండరాలు, ఎముకలతో బలంగా పట్టి ఉంచేందుకు దోహదపడే కొలాజెన్ ఉత్పాదనకు తోడ్పడతాయి. మన రక్తనాళాలన్నీ చివరల వరకూ మూసుకుపోకుండా సంరక్షిస్తూ... ఏదైనా గాయం అయినప్పుడు వెంటనే మానేందుకు ఉపకరిస్తాయి. అంతేకాదు... పై పోషకాలు ఇనుము, ఫోలేట్ అనే పోషకాలు మన దేహంలోకి వేగంగా ఇమిడిపోయేలా చేస్తాయి.

ద్రాక్షపండ్లు :

ఈ పండ్లలో ‘రిస్వెరట్రాల్’ అనే పోషకం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సమర్థంగా ఉపయోగపడుతుంది. మనం చాలా ప్రభావవంతమైన విటమిన్ ‘సి’తో పోల్చినా ద్రాక్షలో ఉండే రిస్వెరట్రాల్ పోషకం హాని చేసే కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) పట్ల దాదాపు 10 నుంచి 20 రెట్లు అధిక ప్రభావపూర్వకంగా పని చేసి చాలా వేగంగా దాన్ని నిర్వీర్యం చేస్తుంది. అందుకే ద్రాక్షపండ్లు గుండెజబ్బులు రాకుండా రక్షణ కల్పిస్తుంది.

యివి చదవండి[మార్చు]

  • Nick Lane Oxygen: The Molecule That Made the World (Oxford University Press, 2003) ISBN 0-19-860783-0
  • Barry Halliwell and John M.C. Gutteridge Free Radicals in Biology and Medicine(Oxford University Press, 2007) ISBN 0-19-856869-X
  • Jan Pokorny, Nelly Yanishlieva and Michael H. Gordon Antioxidants in Food: Practical Applications (CRC Press Inc, 2001) ISBN 0-8493-1222-1

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]

Script error: No such module "Side box". Script error: No such module "Side box".