Jump to content

రజనీ భావతరంగాలు

వికీపీడియా నుండి
రజనీ భావతరంగాలు

రజనీ భావతరంగాలు బాలాంత్రపు రజనీకాంతరావు అనుభవాల సమాహారం.

ఇందులో మొత్తం 59 వ్యాసాలున్నాయి. వీనిలో తన వ్యక్తిగత అనుభవాలు మొదలుకుని అనేక ఇతర విషయాలపై రజనీ వ్రాసిన వ్యాసాల సంకలనం ఇది. ఇవన్నీ 2007-08 ప్రాంతాల్లో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక లలో వచ్చిన వ్యాసాల సంకలనం. “కాళిదాసు, అన్నమయ్య నుండి రవీంద్రుడి వరకు, ఆంధ్రి రాగం నుండి జ్యోతిషం వరకు” రకరకాల అంశాలపై రజనీకాంతరావు రచించిన వ్యాసాలివి.

పుస్తకం గురించి

[మార్చు]

“జంతునేస్తాలు”, అంటూ తమ చిన్నప్పుడు తాతగారి పెరడులోని ఆవు మొదలుకుని తమ ఇంట్లో ఉన్న “పాటలు పాడే” కుక్క సీజర్ దాకా ఆయన చెప్పిన కబుర్లు భలే ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా “వాళ్ళు నీ పాట వింటారు, పాడమ్మా మెల్లిగా” అనగానే రాగాలాపన చేసే ఈ సీజర్ గురించి చదివి తీరాల్సిందే. “పక్షి నేస్తాలూ” అన్న మరొక వ్యాసంలో ఒకచోట వీళ్ళు క్రౌంచ పక్షుల ధ్వనిని వాద్యగోష్ఠిపై పలికించాక వెంటనే అసలు పక్షుల కలకలరావాల్తో ప్రత్యుత్తరం ఇచ్చాయని చదువుతూ ఉంటే అబ్బురంగా అనిపించింది. “సమాన భావ సౌరభాలు” లో ఠాగూరు, అన్నమయ్యల గేయధోరణ్లుల్లో సామ్యాలు, వ్యత్యాసాలూ చెబుతూ ఇచ్చిన ఉదాహరణలు; “ముందు వెనుకలు” వ్యాసం లో ముందు, వెనుక పదాల వాడకంలో ఉన్న తమాషా అర్థమూ ఆసక్తికరంగా అనిపించాయి.

“అలనాటి మద్రాసు రేడియో డైరెక్టర్లు”, “పిఠాపురం సంగీత సంప్రదాయం”, “అలనాటి పిఠాపురం – మరికొందరు కవి పండితులు” – ఇలాంటివన్నీ చదువుతూ ఉంటే, రజనీకాంతరావు గతం వీథుల్లో నేనూ ఆయనతో కలిసి నడిచినట్లు అనిపించింది. బోలెడు సంగతులు తెలిసాయి.

రజనీ ఎందరో ప్రముఖులతో దగ్గరగా పనిచేశాడు. విశ్వనాథ సత్యనారాయణ, పింగళి లక్ష్మీకాంతం, అబ్బూరి రామకృష్ణారావు, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి – వంటి వారితో వృత్తి-ప్రవృత్తి పరంగా ఆయన అనుభవాలు ఆపకుండా చదివించాయి.

సినిమాల్లో ఆయన పనిచేసిన రోజుల అనుభవాలు, ఆల్ ఇండియా రేడియో ఉద్యోగిగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలు, రూపొందిస్తున్న అనుభవాలు – వీటి గురించి కొన్ని వ్యాసాలు ఉన్నాయి. నా మట్టుకు నాకు అలాంటి కబుర్లు మామూలుగా ఇష్టం కనుక, ఇవన్నీ చాలా ఉత్సాహంగా చదివాను. అలాగే, వేంకట-పార్వతీశ్వర కవులను దగ్గరగా చూశారు కనుక వారి ప్రస్తావనా, వారి గురించిన వ్యాసాలూ చాలానే ఉన్నాయి ఈ పుస్తకంలో. అన్నిసార్లు వాళ్ళ ప్రస్తావన వచ్చినందుకో ఏమో వాళ్ళ రచనలు, ముఖ్యంగా “మాతృమందిరం” చదవాలి అనిపించింది.

మా తాతయ్య, ఒక్కొక్కరోజు నేను వద్దన్నా వినకుండా రెండో ప్రపంచ యుద్ధం కాలంలో వాళ్ళ మద్రాసులో ఏవైందో చెబుతాడు. నేను వింటున్నానా? లేదా? అన్నది పట్టించుకోకుండా సాగిపోతూ ఉంటాడు. ఒకరోజు వినకపోయినా, పదిరోజులు నాకు అవన్నీ వినాలనే అనిపిస్తూ ఉంటూంది. ఈ పుస్తకం చదువుతూ ఉంటే, నాకదే అనుభూతి కలిగింది. పుస్తకం ఆద్యంతం తాతగారు పడక్కుర్చీలో కూర్చుని తన చిన్ననాటి ముచ్చట్ల మొదలుకుని, భూమ్మీద ఉన్న బోలెడు విషయాలపై తన అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నట్లు ఉంటుంది. ఈ తరహాలో సాగే ధోరణి అందరికోసమూ కాదు. బోలెడు జీవితాన్ని, ఎన్నో ఆసక్తికరమైన అనుభవాల్నీ మూటగట్టుకున్న వాళ్ళు ఒకదానికొకటి సంబంధం లేకుండా కోతికొమ్మచ్చులాడుకుంటూ మనం అందుకోలేనంత వేగంతో వెళ్ళిపోతూ ఉంటే – మధ్యమధ్యలో కలిగే విసుగూ, అయోమయం వీటన్నింటి కంటే “అరే, ఈయన భలే మాట్లాడుతున్నాడు; బోలెడు ఆసక్తికరమైన కబుర్లు కూడా చెప్తాడు.” అనుకుంటూ ఇంకా వినాలి… అనిపించే బాపతు మనుషులు మీరైతే, పుస్తకం తప్పకుండా నచ్చుతుంది మీకు.

ప్రచురణ వివరాలు

[మార్చు]
రజనీ భావతరంగాలు
బాలాంత్రపు రజనీకాంతరావు
నవోదయ పబ్లిషర్స్, 2011
వెల
100 రూపాయలు
పేజీలు
184