రామేశ్వరి నెహ్రూ
రామేశ్వరి నెహ్రూ | |
---|---|
![]() రామేశ్వరి స్మారకార్థం విడుదలైన తపాలాబిళ్ళ | |
జననం | రామేశ్వరీ రైనా 1886 డిసెంబరు 10 లాహోర్ |
మరణం | 1966 నవంబరు 7 | (వయసు 79)
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘ సేవకురాలు, పత్రికా సంపాదకురాలు, హరిజనోద్ధారకురాలు |
భార్య / భర్త | బ్రిజ్‌లాల్ నెహ్రూ |
పిల్లలు | బ్రజ్‌కుమార్ నెహ్రూ |
తండ్రి | నరేంద్రనాథ్ |
పురస్కారములు | పద్మభూషణ్ 1951 లెనిన్ శాంతి బహుమతి 1961 |
రామేశ్వరి నెహ్రూ ప్రముఖ సంఘసేవకురాలు. ఈమె తన జీవితాంతం బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసింది. బాలల విద్య, వారి సంరక్షణ, వివక్షకు గురి అయ్యే వేశ్యలు మొదలైన రంగాలలో ఈమె సేవ చేసింది.
జీవిత విశేషాలు[మార్చు]
ఈమె లాహోరులో 1886, డిసెంబరు 10వ తేదీన జన్మించింది. ఈమె కాశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించినా ఈమె బాల్యం అంతా పంజాబు రాష్ట్రంలోనే గడిచింది. ఈమె తండ్రి దివాన్ బహద్దూర్ రాజా నరేంద్రనాథ్ పంజాబులో ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆ కాలంలో బాలికలను బయట స్కూలుకు పంపి చదివించే పరిస్థితి లేదు. కాబట్టి ఈమెకు ఇంటివద్దనే ట్యూటర్‌ను పెట్టి చదువు చెప్పించారు. ఈమె స్కూలు చదువులు చదవక పోయినా స్వయంకృషితో ఉన్నత స్థాయి చదువులకు సమానంగా పాండిత్యాన్ని సంపాదించింది. ఈమెకు తన పదహారవయేట 1909లో బ్రిజ్‌లాల్ నెహ్రూతో వివాహం జరిగింది. బిజ్ర్‌లాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ అన్న నందలాల్ నెహ్రూ కుమారుడు. నందలాల్ నెహ్రూ తన కుమారుడిని ఉన్నత చదువుల కోసం లండనుకు పంపుతాడు. అక్కడ అప్పటికే బ్రిజ్‌లాల్ సోదరుడు జవహర్ లాల్ నెహ్రూ చదువుకుంటున్నాడు. రామేశ్వరి కూడా తన భర్తతో పాటుగా లండన్ వెళ్ళింది. జవహర్ లాల్ నెహ్రూ తన చదువు ముగించిన తరువాత భారత దేశానికి తిరిగి వచ్చి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడంలో ఈమె ప్రభావం కొంత ఉంది. ఈమె కుమారుడు బ్రజ్‌కుమార్ నెహ్రూ భారతీయ సివిల్ సర్వీసులో పనిచేసి తరువాత అనేక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు.
సంఘసేవ[మార్చు]
ఈమె "స్త్రీ దర్పణ్" అనే మాసపత్రికను 1909లో స్థాపించి దానికి సంపాదకురాలిగా వ్యవహరించింది. ఈ పత్రిక 1924 వరకు నడిచింది. ఈ పత్రిక స్త్రీ చైతన్యం తీసుకురావడంలో ఒక బలమైన సాధనంగా పనిచేసింది. ఈమె మహిళా సమితిని స్థాపించింది. ఆ సమితి ద్వారా స్త్రీ కార్మికులకు శిక్షణను ఇప్పించింది. ఈ సమితి స్త్రీలు తమ హక్కులకోసం పోరాడటానికి స్ఫూర్తి నివ్వడమే కాక పురుషులతో సమాన స్థాయి కల్పించడంతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం రాజకీయ పోరాటంలో పురుషులతో కలిసి పనిచేయడానికి కృషి చేసింది. "అబాలిషనిస్ట్స్ ఫెడరేషన్" అనే అంతర్జాతీయ సంస్థకు అనుబంధంగా "అసోసియేషన్ ఫర్ మోరల్ అండ్ సోషియల్ హైజీన్" అనే సంస్థను స్థాపించి దానికి అధ్యక్షురాలిగా పనిచేసింది. ఈమె ఇంకా "ఢిల్లీ ఉమెన్స్ లీగ్"ను స్థాపించి దానికి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసింది. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఈమె చేసిన కృషికి గుర్తింపుగా ఈమెను భారత ప్రభుత్వం "ఏజ్ ఆఫ్ కన్సెంట్ కమిటీ"లొ సభ్యురాలిగా నియమించింది. ఆ కమిటీలో ఈమె ఒకరే మహిళా సభ్యురాలు. ఈమె ఈ కమిటీలో చేసిన సూచనలు తరువాత "బాల్యవివాహ నిరోధక చట్టం"లో పొందుపరచ బడ్డాయి. ఈమె నారీనికేతన్‌ను ప్రారంభించి దగాపడిన మహిళలకు పునరావాసం కల్పించింది. ఈమె భారతీయ స్త్రీలకు ప్రతినిధిగా ఇంగ్లాండు, ఐరోపా దేశాలలో విస్తృతంగా పర్యటించింది. జనీవాలో జరిగిన లీగ్ ఆఫ్ నేషన్స్ సమావేశానికి ప్రతినిధిగా హాజరయ్యింది. ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులలో ఈమె కూడా ఉంది. 1942లో ఈ కాన్ఫరెన్సుకు అధ్యక్షురాలిగా ఉండి కోపెన్‌హెగన్‌లో జరిగిన ప్రపంచ మహిళా కాంగ్రెస్ సమావేశాలకు, కైరోలో జరిగిన ఆఫ్రో ఏషియన్ మహిళా సభకు హాజరయ్యింది. ఈమె హరిజనోద్ధరణకు గాను "హరిజన్ సేవక్ సంఘ్" ఏర్పాటు చేసింది. ఈమె అస్పృశ్యతా నివారణకు, హరిజనులకు ఆలయ ప్రవేశానికై నిబద్ధతతో పనిచేసింది. ఈమె తమిళనాడు, ట్రావన్‌కోర్‌లలో విస్తృతంగా పర్యటించి హరిజన్ సేవక్ సంఘ్ తరఫున పోరాడి ట్రావన్‌కోర్ మహారాజా నుండి హరిజనుల దేవాలయ ప్రవేశానికై అనుమతిని సంపాదించడంలో విజయం సాధించింది.
రాజకీయాలు[మార్చు]
ఈమె రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొనింది. పంజాబులో క్విట్ ఇండియా ఉద్యమ నిర్వాహకురాలిగా పనిచేసింది. రహస్యంగా ముద్రించబడిన కరపత్రాలను పంచింది. ఈమెను అరెస్టు చేసి లాహోరులోని మహిళాజైలులో 9 నెలలు నిర్బంధించారు. ఈమెకు పలుమార్లు ప్రభుత్వంలో మంత్రి పదవులను ఇవ్వజూపారు. అయితే ఈమె ప్రతిసారి వాటిని సున్నితంగా తిరస్కరించి అణగారిన ప్రజల పక్షాన అంకితభావంతో పనిచేసింది. ఈమె ప్రపంచశాంతి, అణ్వాస్త్ర నిరోధం కొరకు ప్రచారానికై పలు దేశాలను సందర్శించింది.
పురస్కారాలు, గుర్తింపులు[మార్చు]
- ఈమె సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1951లో పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది.
- 1961లో సోవియట్ ప్రభుత్వము ఈమెకు లెనిన్ శాంతి బహుమతిని ప్రసాదించింది.
- 1987 డిసెంబరు 10న భారత తపాలాశాఖ వారు ఈమె జ్ఞాపకార్థం ఒక తపాళాబిళ్ళను విడుదల చేసింది.
మరణం[మార్చు]
ఈమె 1966, నవంబరు 7వ తేదీన మరణించింది.
మూలాలు[మార్చు]
- రామేశ్వరి నెహ్రూ జీవిత చరిత్ర
- Mohan, Kamlesh (2013). Rameshwari Nehru. Retrieved 2020-07-13.[permanent dead link]
- ఓం ప్రకాశ్ పలివాల్ రచించి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన Rameshwari Nehru, Patriot and Internationalist పుస్తకం
- All articles with dead external links
- Articles with dead external links from డిసెంబర్ 2020
- Articles with permanently dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1886 జననాలు
- స్వాతంత్ర్య సమర యోధులు
- సంఘ సేవకులు
- మహిళా రాజకీయ నాయకులు
- పద్మభూషణ పురస్కార గ్రహీతలు
- 1966 మరణాలు