రూపాబాయి ఫర్దూంజీ
రూపాబాయి ఫుర్దూంజీ | |
---|---|
జననం | |
మరణం | |
వృత్తి | మత్తు వైద్యురాలు |
రూపాబాయి ఫర్దూంజీ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా మత్తు వైద్యురాలు.[1] ప్రపంచంలోనే శిక్షణ పొందిన తొలి మహిళా అనస్థీసియాలజిస్టుగా గుర్తింపబడింది.[2] హైదరాబాదు నగరంలో వైద్యవిద్యను అభ్యసించిన రూపాబాయి, భారతదేశంలో క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించడంలో ప్రధాన పాత్ర పోషించింది.
జననం, విద్య
[మార్చు]రూపాబాయి తెలంగాణలోని హైదరాబాదు నగరంలో జన్మించింది. 1885లో తన చదువును ప్రారంభించిన రూపాబాయి, హైదరాబాద్ మెడికల్ కాలేజీలోని వైద్యకోర్సుల్లో చేరిన ఐదుగురు మహిళల్లో ఒకరు. 1889లో మెడికల్ డాక్టర్‌కి సమానమైన హకీమ్ డిగ్రీని పొందింది. ఆ తరువాత బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్ నుండి మెడికల్ డిగ్రీని అభ్యసించింది.[3][4]
1909లో అన్నీ బిసెంట్ ప్రోత్సాహంతో మత్తుమందులో మరింత అనుభవం సంపాధించేందుకు స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు వెళ్ళింది. 1910లో ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం చదువుకుంది. ఆనాడు అనస్థీషియా మీద ప్రత్యేకంగా కోర్సులు లేకపోవడంతో, అనస్థీషియా వైద్యులకు అవసరమైన శాస్త్రాలైన ఈ రంగాల్లో ఆమె విద్యాభ్యాసం చేసింది. హైదరాబాదులో ఎడ్వర్డ్ లారీ దగ్గర పాథాలజీలో శిక్షణ పొందింది. ఇంగ్లాండుకు అనిబీసెంట్ తో కలిసి ఒకే ఓడలో ప్రయాణం చేసింది. దీంతో ఆమెతో సాన్నిహిత్యం ఏర్పడింది. అంతేగాదు అనిబీసెంట్ ఇంగ్లండ్‌లోని మిత్రులకు ఆమెను సిఫారసు చేస్తూ యోగ్యతాపత్రాన్ని కూడా ఇచ్చింది.
వైద్యరంగం
[మార్చు]1888, 1891లో జరిగిన మొదటి, రెండవ హైదరాబాద్ క్లోరోఫామ్ కమీషన్లలో ఫుర్దూంజీ సభ్యురాలుగా పాల్గొన్నది. 1889-1917 వరకు బ్రిటిష్ రెసిడెన్సీ హాస్పిటల్ (ప్రస్తుతం సుల్తాన్ బజార్ హాస్పిటల్), అఫ్జల్‌గంజ్ హాస్పిటల్ (ప్రస్తుతం ఉస్మానియా జనరల్ హాస్పిటల్), హైదరాబాద్‌లోని విక్టోరియా జెనానా మెటర్నిటీ హాస్పిటల్‌లో అనస్థీషియాలను ఇచ్చింది. 1909లో ఇంగ్లాండు నుండి తిరిగి వస్తూ, ఓడ ఈడెన్ పోర్టులో ఆగినప్పుడు, అక్కడి బ్రిటీషు రెసిడెంట్, రూపాబాయి సేవలు అక్కడ అవసరమని, కొంతకాలం ఈడెన్‌లో వైద్యసేవలు అందించాలని కోరుతూ, హైదరాబాదులోని బ్రిటీషు రెసిడెంటుకు లేఖ పంపాడు. ఈ విధంగా బ్రిటిష్ రెసిడెంట్ కోరిక మేరకు అక్కడ కొంతకాలం వైద్య సేవలు అందించింది. 1920లో హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసింది.[5]
నిజాం కుటుంబంలో ఎంతోమందికి ఈవిడే పురుడుపోసింది. జీవితాంతం అవివాహితగా ఉన్న రూపాబాయి జననమరణాలు కచ్చితంగా తెలియడం లేదు. 1920లో పదవీ విరమణ పొందిన ఈమె, బహుశా 1860 ప్రాంతంలో జన్మించి ఉండవచ్చని అంచనా.
మూలాలు
[మార్చు]- ↑ Narayana A, Bharathi K, Subhaktha PK, Manohar G, Ramachari A (May 2010). "Dr. (Miss) Rupa Bai Furdoonji: World's first qualified female anesthesiologist". Indian Journal of Anaesthesia. 54 (3): 259–61. doi:10.4103/0019-5049.65371. PMC 2933491. PMID 20885878.
{{cite journal}}
: CS1 maint: unflagged free DOI (link) - ↑ Ala, Narayana; K, Bharathi (2010). "Dr. (Miss) Rupa Bai Furdoonji: World's first qualified lady anaesthetist". Indian Journal of Anaesthesia. 54 (3): 259–261. doi:10.4103/0019-5049.65371. PMID 2933491. Retrieved 22 November 2017.
{{cite journal}}
: CS1 maint: unflagged free DOI (link) - ↑ Ali M, Ramachari A. "History of Anesthesia and Hyderabad Chloroform Commission" (PDF). Bulletin of the Indian Institute of History of Medicine. 19: 47–61.
- ↑ Sir Asman Jah (1891). "Report of the Hyderabad Chloroform Commission".
- ↑ "This woman hakeem showed the way". Telangana Today.