రెట్రోగ్రేడ్, ప్రోగ్రేడ్ చలనాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెట్రోగ్రేడ్ కక్ష్య: ఎరుపు ఉపగ్రహం దాని ప్రాథమిక వస్తువు (నీలం/నలుపు) భ్రమణానికి వ్యతిరేక దిశలో తిరుగుతోంది.

ఖగోళ శాస్త్రంలో ఒక ఖగోళ వస్తువు కక్ష్యా చలన దిశ గానీ, భ్రమణ దిశ గానీ దాని కేంద్ర వస్తువు భ్రమణ దిశకు వ్యతిరేక దిశలో ఉంటే ఆ వస్తువు చలనాన్ని రెట్రోగ్రేడ్ చలనం (తిరోగమన చలనం) అంటారు. ఇది వస్తువు భ్రమణాక్షపు ప్రిసెషన్‌ను లేదా న్యూటేషన్ వంటి ఇతర చలనాలను కూడా వివరించవచ్చు. కేంద్ర వస్తువు తిరిగే దిశలోనే దాని చుట్టూ తిరిగే వస్తువు చలిస్తే ఆ చలనాన్ని ప్రోగ్రేడ్ చలనం లేదా డైరెక్ట్ మోషన్ (పురోగమన చలనం) అంటారు. అయితే, "తిరోగమనం", "పురోగమనా" లను ప్రాథమిక వస్తువునే కాకుండా వేరే ఖగోళ వస్తువును రిఫరెన్సుగా తీసుకుని కూడా నిర్వచించవచ్చు. భ్రమణ దిశను, సుదూర స్థిర నక్షత్రాల వంటి ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ద్వారా నిర్ణయించవచ్చు.

సౌర వ్యవస్థలో సూర్యుని చుట్టూ తిరిగే అనేక తోకచుక్కలు మినహా గ్రహాలు, ఇతర వస్తువులవన్నీ ప్రోగ్రేడ్ కక్ష్యలే. సూర్యుడు తన అక్షం చుట్టూ తిరిగే దిశలోనే అవన్నీ సూర్యుని చుట్టూ కక్ష్యల్లో తిరుగుతాయి. సూర్యుని భ్రమణ దిశ దాని ఉత్తర ధ్రువం పై నుండి గమనించినప్పుడు అపసవ్య దిశలో ఉంటుంది. శుక్రుడు, యురేనస్ మినహా మిగతా గ్రహాల కక్ష్యలు వాటి భ్రమణ దిశలతో పోలిస్తే కూడా ప్రోగ్రేడ్ కక్ష్యలే. చాలా సహజ ఉపగ్రహాలు వాటి గ్రహాల చుట్టూ ప్రోగ్రేడ్ కక్ష్యల లోనే చలిస్తాయి. యురేనస్ ఉపగ్రహాలు దానిచుట్టూ ప్రోగ్రేడ్ కక్ష్యల్లో తిరుగుతాయి. యురేనస్ సూర్యుని చుట్టూ రెట్రోగ్రేడ్ దిశలో తిరుగుతుంది. దాదాపు సాధారణ ఉపగ్రహాలు అన్నీ టైడల్గా లాక్ అయి ఉంటాయి. అందువలన ఇవి ప్రోగ్రేడ్ రొటేషన్ కలిగి ఉంటాయి. రెట్రోగ్రేడ్ ఉపగ్రహాలు సాధారణంగా చిన్నవి గాను, వాటి గ్రహాల నుండి దూరంగానూ ఉంటాయి. నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రిటాన్ మాత్రం దీనికి మినహాయింపు; అది పెద్దది గాను, నెప్ట్యూన్‌కు దగ్గర గానూ ఉంటుంది. తిరోగమన ఉపగ్రహాలు వేరే చోట రూపుదిద్దుకుని ఆ తరువాత వాటి వాటి గ్రహాలకు బంధింపబడి ఉంటాయని భావిస్తున్నారు.

భూమి కృత్రిమ ఉపగ్రహాల్లో తక్కువ ఇన్‌క్లినేషను ఉండే ఉపగ్రహాలను చాలావరకు ప్రోగ్రేడ్ కక్ష్యలో ఉంచుతారు. ఎందుకంటే ఈ పరిస్థితిలో కక్ష్యకు చేరుకోవడానికి తక్కువ చోదక శక్తి అవసరమౌతుంది.

సౌర వ్యవస్థ లోని వస్తువులు[మార్చు]

గ్రహాలు[మార్చు]

సౌర వ్యవస్థలోని మొత్తం ఎనిమిది గ్రహాలు అన్నీ సూర్యుని భ్రమణ దిశలోనే సూర్యుని చుట్టూ తిరుగుతాయి. వీటిలో ఆరు గ్రహాల పరిభ్రమణ దిశ తమ అక్షం చుట్టూ తిరిగే దిశలోనే ఉంటుంది. శుక్రుడు, యురేనస్‌లు దీనికి మినహాయింపు. ఇవి తిరోగమన భ్రమణంతో ఉన్న గ్రహాలు. శుక్రుని భ్రమణాక్షపు వంపు 177°. అంటే అది దాని కక్ష్యకు దాదాపు సరిగ్గా వ్యతిరేక దిశలో తిరుగుతోంది. యురేనస్ అక్షపు వంపు 97.77°. కాబట్టి దాని భ్రమణాక్షం సౌర వ్యవస్థ తలానికి దాదాపు సమాంతరంగా ఉంటుంది. అంచేత ఇది దాని కక్ష్యలో దొర్లుకుంటూ వెళ్తున్నట్లు ఉంటుంది.

యురేనస్ అసాధారణ అక్ష వంపుకు కారణం ఖచ్చితంగా తెలియదు గానీ సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు భూమి పరిమాణంలో ఉన్న ఆదిమ గ్రహం ఒకటి యురేనస్‌తో ఢీకొని దాని వక్ర ధోరణికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.[1]

కృత్రిమ ఉపగ్రహాలు[మార్చు]

తక్కువ వంపు కక్ష్యలకు ఉద్దేశించిన కృత్రిమ ఉపగ్రహాలను సాధారణంగా ప్రోగ్రేడ్ దిశలో ప్రయోగిస్తారు. దీనివలన భూమి భ్రమణ ప్రయోజనాన్ని పొందడం ద్వారా కక్ష్యకు చేరుకోవడానికి అవసరమైన చోదక శక్తి అవసరం తక్కువగా ఉంటుంది (ఈ ప్రభావానికి భూమధ్యరేఖపౌ ఉండే ప్రయోగ ప్రదేశం సరైనది). అయితే ప్రయోగ శిధిలాలు జనాభా కలిగిన భూభాగాలపై పడకుండా చూసుకోవడానికి ఇజ్రాయెల్ తమ ఓఫెక్ ఉపగ్రహాలను మధ్యధరా సముద్రం మీదుగా పశ్చిమ దిశగా తిరోగమన దిశలో ప్రయోగిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. Bergstralh, Jay T.; Miner, Ellis; Matthews, Mildred (1991). Uranus. pp. 485–86. ISBN 978-0-8165-1208-9.