Jump to content

రేమెళ్ళ అవధానులు

వికీపీడియా నుండి
రేమెళ్ళ అవధానులు
రేమెళ్ళ అవధానులు
జననంరేమెళ్ళ అవధానులు
సెప్టెంబర్ 25, 1948
తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లోని పొడగట్లపల్లి
వృత్తిరాజోలు డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకుడు
ప్రసిద్ధితెలుగు శాస్త్రవేత్త
మతంహిందూ మతము
తండ్రిసూర్యనారాయణ
తల్లిలక్ష్మీనరసమ్మ

డాక్టర్ రేమెళ్ళ అవధానులు 1948 సెప్టెంబరు 25 తేదీన తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లోని పొడగట్లపల్లిలో సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు.[1] 1969 లో పరమాణు భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసాడు. రాజోలు డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ తీరిక సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవాడు. కానీ 1971 లో హైదరాబాదులో ఇ.సి.ఐ.ఎల్ కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాదు వచ్చేశాడు. ఇ.సి.ఐ.ఎల్ భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే, ఎ ప్లస్ బి హోల్ స్కేర్ అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక, మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది అవధానులు కి. ఇ.సి.ఐ.ఎల్.లో ఎనిమిదేండ్లు పనిచేసి, తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించాడు. అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులకు ఆలోచన వచ్చింది. దాన్ని కార్య రూపంలోకి తీసికొనిరావడానికి ప్రయత్నించాడు.

కంప్యూటరు లోకి తెలుగు

[మార్చు]

1976 నాటికి ఏ భారతీయ భాషనూ కంప్యూటరీకరించలేదు. అందుచేత తెలుగును కంప్యూటరీకరించాలనే ఆలోచన వచ్చింది. అవధానులు తన మిత్రులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటరులో ప్రవేశ పెట్టాడు. ఆ విధంగా 1976 లో భారత దేశంలో కంప్యూటరు లోకి ఎక్కిన మొట్టమొదటి భారతీయ భాష తెలుగే. అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షుడు వావిలాల గోపాల కృష్ణయ్య అభినందనలతో కంప్యూటరు లో తెలుగు అనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్త పార్లమెంటు వరకూ వెళ్ళి, కంప్యూటరు లోకి తెలుగు వచ్చినపుడు, హిందీ ఎందుకు రాదు? అని ఎం.పీ లందరు తమ పై అధికారులకు లేఖలు వ్రాశారు. ఆ విధంగా హిందీని కూడా కంప్యూటరులో పెట్టే పనిని అవధాని చేపట్టవలసి వచ్చింది. దానితో పార్లమెంటరీ కమిటీ వీరి పని తీరుపై సంతృప్తి చెంది, ఇంకా అభివృద్ధి చేయాలని కోరింది.

నిమ్స్ కంప్యూటరీకరణ

[మార్చు]

అవధానులకు హైదరాబాదు లోని NIMS డైరెక్టరు కాకర్ల సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు NIMS ను కంప్యూటరీకరణ చేసి, అక్కడే సుమారు 18 సంవత్సరాలు పనిచేశాడు.

వేదాల కంప్యూటరీకరణ

[మార్చు]

NIMS లో పనిచేస్తున్నప్పుడే ఒక సందర్భంలో తి.తి.దే. వారు ప్రచురించిన పుస్తకాలను చదవడం తటస్థించింది అవధానులకు. దాని వలన తెలిసిన విషయమేమంటే.... వేదాల గురించి ఉన్న మొత్తం 1131 శాఖలకు గాను 7 శాఖలు మాత్రమే మిగిలాయని., అవి కూడా అంతరించి పోవడానికి ఎంతో కాలం పట్టదనీ అర్థమై పోయింది. వాటినన్నా కాపాడుకోవాలంటే.... కనీసం వాటిని రికార్డింగ్ చేస్తే తాత్కాలికంగా నైనా వాటిని కాపాడు కోవచ్చని పించింది. కానీ ఋగ్వేదం మరీ ప్రమాదంలో ఉన్నదని తెలిసింది. తనకు యజుర్వేదం మాత్రమే తెలుసు. ఋగ్వేదం తెలిసిన వారెవరున్నారా? యని అన్వేషించగా మహారాష్ట్రలో ఒకాయన ఉన్నాడని తెలిసి, అక్కడికి వెళ్ళి అతన్ని కుటుంబం సమేతంగా తీసుకొచ్చి, వారి పోషణా బాధ్యతలన్నీ తానే తీసుకొని 1992 లో వేదాల రికార్డింగ్ మొదలు పెట్టాడు.

అఖిలభారత వేద సమ్మేళనంలో

[మార్చు]

అదే సమయానికి తి.తి.దే. వారు తిరుపతిలో అఖిల భారత వేదశాస్త్ర సమ్మేళనం నిర్వహించారు. దానికి అప్పటి భారతదేశ అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ వస్తున్నారనీ ఆ సందర్భంగా తనను వేదాల గురించి ఒక ప్రదర్శన ఇవ్వవలసినదిగా తి.తి.దే. వారు కోరగా 'నమకం' లోని మూడు మంత్రాలనూ, వాటి అర్థాలనూ 'సీ లాంగ్వేజి ' సహాయంతో కంప్యూటర్ లో పెట్టి చూపగా శంకర్ దయాళ్ శర్మ చాలా సంతోషించి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయమని అవధానికి చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టును ప్రారంభించాలంటే తనకు ఒక మంచి కంప్యూటర్ కావాలి. దానిని కొనే స్తోమత అవధానులకు లేదు. మనసుంటే మార్గము దేవుడే చూపిస్తాడన్నట్టు.... తనకు తెలిసిన మిత్రుడు సోమయాజులు ఆ విషయాన్ని 'అశ్విని హెయిర్ ఆయిల్ ' అధినేత అయిన సుబ్బారావుకు తెలుపగా,... సుబ్బారావు ఉదారంగా ఒకలక్షా ఇరవై వేల రూపాయాలను ఇవ్వగా దాంతో ఒక అధునాతన కంప్యూటర్ కొన్నాడు అవధాని. కంప్యూటరు మీద పనిచేస్తున్న వారికి జీత భత్యాలను తన జీతంలో నుండి ఇస్తున్నందున ఎక్కువ మందిని పెట్టుకోలేక పోయాడు. దానికి ప్రత్యామ్నాయంగా విరాళాలు సేకరించడానికి వేదభారతి ట్రస్టు ను ప్రారంభించాడు. చేయవలసిన పని ఎక్కువగా ఉండటంతో అందరితో కలిసి తాను కూడా రాత్రుళ్ళు పనిచేసేవాడు.

యజుర్వేద అనుక్రమణికలు

[మార్చు]

ఆ సందర్భంలో వేదాలలో సైన్సు, లెక్కలు, వైద్యం, అంతరిక్ష శాస్త్రం మొదలగు శాస్త్రాలన్నీ కనబడ్డాయి అవధానికి. ఆ స్ఫూర్తితో పనిని మరింత వేగిరి పరచి, 1995 నాటికి యజుర్వేదానికి 7 అనుక్రమణికలు వ్రాసి కంప్యూటరీకించి దేశంలోనే మొట్టమొదటి సారిగా మల్టీమీడియాలో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు చూపించాడు. దానిని అప్పటి దేశ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆవిష్కరించాడు; ప్రశంసించాడు. ఆ విధంగా అవధాని చిరకాల కోరిక కొంత వరకైనా నెరవేరింది. వేదభారతి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ 700 గంటలు మాత్రమే రికార్డింగు పూర్తయింది. దానిని మల్టీమీడియా సీడీ ల రూపంలో ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. కానీ మిగిలిన వేదశబ్దాల్ని రికార్డింగ్ చేస్తే సుమారు 2500 గంటల నిడివి గల రికార్డు తయారు కాగలదు. అందుకు అవధాని ఒక్కనితో అది సాధ్యమయ్యే పని కాదు. విద్వాంసులు, వదాన్యులు చేయూత నిస్తే అదేమంత కష్టమైన పని కాదంటాడు అవదాని. ఆవిధంగా మన వేద విజ్ఞానాన్ని పరిరక్షించు కున్న వాళ్ళమౌతాము.

ఇతర రంగాలలో సేవలు

[మార్చు]

పరమాణు భౌతిక శాస్త్రంలో ఎం.ఎస్.సి. చేసిన అవధాని తనకు ఆసక్తి కరమైన వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నాడు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో 'మీమాంస ' శాస్త్రం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఎమ్మె సంస్కృతం, జ్యోతిషం చేశాడు. అదే విధంగా వేదాల్లో సైన్సు భూకంపాలు జ్యోతిషం అనే అంశాలమీద పీ.హెచ్.డీలు చేశాడు. తాను చేసిన బహుభాషా మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్ కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి, సంస్కృత మిత్ర బిరుదుతో సత్కరించింది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-07-20. Retrieved 2013-05-28.

ఇతర లింకులు

[మార్చు]