Jump to content

లఖ్‌పత్

వికీపీడియా నుండి

లఖ్‌పత్ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో కోరి క్రీక్ ముఖద్వారం వద్ద ఉన్న చిన్న పట్టణం. ఈ పట్టణం చుట్టూ 7 కి.మీ పొడవైన 18వ శతాబ్దపు కోట గోడ ఉంది.

పదమూడవ శతాబ్దం మధ్యలో సింధ్‌ను పాలించిన రావు లఖా పేరు మీద ఈ పట్టణానికి ఈ పేరు వచ్చింది. [1]

చరిత్ర

[మార్చు]
నలుగురు సేవకులతో ఉత్సవ గుర్రంపై కచ్ యువరాజు లఖ్‌పత్‌జీ. కచ్ లేదా నాగౌర్, c.1750
కచ్ఛ్ ప్రాంతం

చారిత్రికంగా లఖ్‌పత్, గుజరాత్‌ను సింధ్‌ను కలిపే చాలా ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. సింధు నది జలాలు లఖ్‌పత్‌లోకి, అక్కడి నుండి దేశల్‌పర్ గుంత్లీకి ప్రవహించేవి. లఖ్‌పత్‌ చరిత్రలో అతి తక్కువ కాలం మాత్రమే వెలుగులో ఉంది. అక్కడ వరి సాగు చేసేవారు. వార్షిక ఆదాయంలో 800,000 కోరీలు ఈ పంట నుండి వచ్చేది. సముద్ర కార్యకలాపాల ద్వారా లఖపత్‌కు ప్రతిరోజూ 1,00,000 కోరీల ఆదాయం వచ్చేదని కూడా చెబుతారు. [2]పద్దెనిమిదవ శతాబ్దం (1801) ముగింపులో ఫతే ముహమ్మద్, దాని గోడను విస్తరించి, పునర్నిర్మించాడు. ఇది తన అధికారానికి ప్రధానమైన మద్దతుగా అతను భావించినప్పటికీ, 1804 లో అతను కచ్ రాజ్యపు రావును వ్యతిరేకించడంతో లఖ్‌పత్, ఫతే ముహమ్మద్‌కు ఎదురు తిరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత (1809), కోట లోని కమాండెంట్, మోహిమ్ మియాన్, హంసరాజ్ ప్రతినిధులను తరిమివేసి, పట్టణాన్ని స్వతంత్రంగా పరిపాలించాడు. 1818లో, లఖ్‌పత్‌లో 15,000 మంది జనాభా ఉండేది. వార్షిక ఆదాయం £6000 ( 60,000) ఉండేది. 1819 భూకంపంలో, సింధు నదికి అడ్డుగా అల్లాబండ్ అనే ఆనకట్ట సహజంగా ఏర్పడి, దాని ప్రవాహ మార్గం మారిపోయి, ఉత్తరం వైపు తిరిగి అరేబియా సముద్రంలోకి ప్రవహించడం ప్రారంభించింది. దీంతో ఓడరేవుగా లఖ్‌పత్‌ తన ప్రాముఖ్యత కోల్పోయింది. 1820 నాటికి, ఇక్కడి జనాభా 6000 మందికి తగ్గింది, ఇందులో ప్రధానంగా ఇతర దేశాలకు చెందిన వర్తకులు, సింధ్ ప్రావిన్స్ నుండి వలస వచ్చిన హిందువుల కుటుంబాలూ ఉండేవి. ప్రస్తుతం గోడలు బాగానే ఉన్నాయి, కానీ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. పట్టణ విస్తీర్ణంలో మూడింట ఒక వంతు కూడా జనావాసం లేదు. 1851 నాటికి, అన్ని వ్యాపారాలు పట్టణాన్ని వీడిపోయాయి. అప్పటి నుండి అది పేదరికంతో, సగం నిర్జనంగా మిగిలిపోయింది. 1880 నాటికి జనాభా 2500 కి తగ్గింది.

నేడు ఇది తక్కువ జనాభా కలిగిన ఒంటరి పట్టణం. పట్టణంలో శిథిల భవనాలు, వాటి చుట్టూ ఉన్న అద్భుతమైన కోట కనిపిస్తాయి. 2001లో 87 గృహాలలో 463 మంది జనాభా ఉండగా, [3] 2011 నాటికి 108 గృహాలు, 566 జనాభాకు పెరిగింది.

ఆసక్తికరమైన ప్రదేశాలు

[మార్చు]

పట్టణంలో బహుభుజి ఆకారంలో గుండ్రని టవర్లతో గట్టి గోధుమ రాయితో నిర్మించబడిన కోట ఉంది. 1801 లో ఫతే ముహమ్మద్ ఈ కోటను పునర్నిర్మించి, విస్తరించాడు. 7 కి.మీ పొడవున్న గోడలు ఎత్తుగానే ఉంటాయి గానీ, అంత మందంగా ఉండవు.

పీర్ గౌస్ మహమ్మద్ సమాధి

[మార్చు]

పిర్ గౌస్ ముహమ్మద్, ఒక సూఫీ సన్యాసి. అతను సగం-ముస్లిం, సగం హిందూ ఆచారాలను పాటించేవాడు. అతనికి అతీంద్రియ శక్తులు ఉండేవని నమ్ముతారు. 1855లో అతను మరణించాక, అతని సోదరుడు బావా మియా, గౌస్ ముహమ్మద్ అనుచరులు అందించిన విరాళాలతో అతని సమాధిని నిర్మించడం ప్రారంభించాడు. స్థానికంగా దీన్ని కుబో అని పిలిచే ఈ సమాధి నల్లరాతితో, యాభై నాలుగు అడుగుల చతురస్రం, ఏడు అడుగుల ఎత్తైన వేదికపై, శంఖాకార గోపురంతో 63 అడుగుల 3 అంగుళాల ఎత్తులో ఉంది. ఇది అష్టభుజి ఆకారంలో ఉంది. నాలుగు వైపులా తలుపులు చెక్కబడి ఉంటాయి. గోడలు పూల బొమ్మలతో అలంకరించబడ్డాయి. సమాధి తెల్లటి పాలరాతి పందిరితో కప్పబడి ఉంటుంది. గోడలపై ఖురాన్ భాగాలు రాసి ఉన్నాయి. సమాధి ఎదురుగా ఉన్న సరస్సు నీటికి చర్మ వ్యాధులను నయం చేసే లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు. [4]

BSF పోస్ట్

[మార్చు]

భారతదేశం, పాకిస్తాన్ల మధ్య నున్న అంతర్జాతీయ సరిహద్దు నుండి దగ్గరగా ఉన్నందున ఈ కోటకు సముద్రపు వైపున సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికుల కాపలా ఉంటుంది. కోట గోడలపై, సమీపంలోని బోర్డర్ అవుట్‌పోస్ట్‌పై BSF గార్డులు కాపలా ఉంటారు. [5] [6] [7] [8]

జనాదరణ పొందిన సంస్కృతిలో

[మార్చు]
  • JP దత్తా దర్శకత్వం వహించిన 2000 నాటి హిందీ సినిమా రెఫ్యూజీలో లఖ్‌పత్ కోటను, పొరుగున ఉన్న పాకిస్తాన్‌లోని ఒక కల్పిత పట్టణంగా చూపించారు.

చిత్ర మాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. 1880. pp. 232–233.
  2. "భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 7 కిలోమీటర్ల పొడవైన కోట గురించి మీకు తెలుసా?". BBC News తెలుగు. 2022-12-15. Archived from the original on 2022-12-21. Retrieved 2022-12-21.
  3. "View Population". Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 25 March 2012.
  4. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. 1880. pp. 232–233.
  5. Rann of Kutch terrain comes in way of fast border fencing; 7 December 2009; Times of India
  6. Concrete road in Sir Creek to help BSF in patrolling; by Roxy Gagdekar; 1 August 2009; DNA india
  7. Drawing a line in the sand; Janyala Sreenivas; 17 April 2005; Indian Express Newspaper
  8. Lakhpat heard there was a war, knows little else Archived 2012-10-03 at the Wayback Machine; by Dharmendrasinh Chavda; 28 August 1999; The Indian Express
"https://te.wikipedia.org/w/index.php?title=లఖ్‌పత్&oldid=3784615" నుండి వెలికితీశారు