లడ్డు బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లడ్డు బాబు
220px-Laddu babu.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వంరవిబాబు
కథరవిబాబు
నిర్మాతత్రిపురనేని రాజేంద్ర
తారాగణంఅల్లరి నరేష్
భూమిక చావ్లా
కోట శ్రీనివాసరావు
పూర్ణ
అతులిత్
సమీర్
ఛాయాగ్రహణంసుధాకర్ రెడ్డి
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
మహారధి ఫిలింస్
విడుదల తేదీ
2014 ఏప్రిల్ 18 (2014-04-18)
సినిమా నిడివి
143 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

లడ్డు బాబు 2014 లో అల్లరి నరేష్, భూమిక ప్రధాన పాత్రల్లో రవిబాబు రూపొందించిన ప్రయోగాత్మక చిత్రం.[1][2]

కథ[మార్చు]

లడ్డు బాబు (అల్లరి నరేష్) మామూలుగా సన్నగా ఉంటాడు. కానీ అతనికి ఓ విచిత్రమైన దోమ కుట్టడంతో వైరస్ సోకి కొన్ని నెలల్లో అకస్మాత్తుగా విపరీతంగా లావుగా అయిపోతాడు. దాంతో లడ్డు బాబుకు తొందరగా పెళ్ళి చేసేయాలనుకున్న అతని తండ్రి కిష్టయ్య (కోట శ్రీనివాసరావు)కు అది సమస్యగా పరిణమిస్తుంది. కొడుక్కు పెళ్ళి చేసే వేరు కాపురం పెట్టేస్తే తమ పూర్వీకుల ఇల్లు అమ్మేసి గోవాకు వెళ్ళిపోవాలనేది కిష్టయ్య ఆలోచన. కానీ అతని భారీ ఆకారం వలన పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అతని ఆకారమే కాకుండా అతని ప్రవర్తన వల్ల కూడా కొన్ని సంబంధాలు చెడిపోతుంటాయి. అతను తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలన్నది అతని ఆలోచన.

అదే ఊళ్ళో మూర్తి (మాస్టర్ అతులిత్) అనే పదేళ్ళ అబ్బాయి భర్త చనిపోయిన వాళ్ళ అమ్మ మాధురి (భూమిక చావ్లా) తో కలిసి నివసిస్తుంటాడు. లడ్డు బాబు మూర్తితో స్నేహం చేయడానికి ఒప్పుకోకపోవడంతో మూర్తి తన స్నేహితులతో కలిసి అతన్ని ఆటపట్టిస్తూ ఉంటాడు. ఇంతలో లడ్డు బాబు మాయ (పూర్ణ) అనే అమ్మాయిని చూసి వెంటనే ప్రేమలో పడతాడు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి అనేకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ ప్రయత్నాలన్నింటినీ మూర్తి గ్యాంగ్ అడ్డుకుంటూ ఉంటుంది. ఒకరోజు మూర్తి వాళ్ళు ఆటపట్టించడం వల్ల లడ్డు బాబు తన తండ్రి ఇద్దరు కవల పిల్లలతో ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల సమయానికి ఇంటికి వెళ్ళలేక పోతాడు. దాంతో అతని తండ్రి అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు.

లడ్డు బాబు ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు పక్కన కూర్చుంటే మూర్తి వచ్చి అతనితో మితృత్వం కలుపుకుని తన ఇంటికి తీసుకువెళతాడు. లడ్డు బాబును చూసి మాధురి మొదలో అయిష్టత వ్యక్తం చేసినా, మూర్తి మారాం చేయడంతో అతను వాళ్ళతో కలిసి ఉండటానికి అంగీకరిస్తుంది. అలా ఉండగా ఉన్నట్టుండి మాయ ఎక్కడ నుంచో ఊడిపడి అతన్ని ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. నిజానికి ఆమె బాయ్ ఫ్రెండ్ తో గొడవపడి తాను అందవికారంగా ఉన్న వాడితో ప్రేమలో పడతానని సవాల్ చేసి అక్కడికి వస్తుంది. అది తెలియని లడ్డు బాబు ఆమెను సంతోషంగా అంగీకరిస్తాడు. లడ్డు బాబు మాయ చెప్పినట్లుగా బరువు తగ్గడం కోసం మాధురి వాళ్ళ ఇంట్లో డబ్బు దొంగతనం చేసి దానికోసం శస్త్రచికిత్స చేయించుకుంటాడు. మాయ అప్పుడే తన నిజస్వరూపాన్ని బయటపెట్టి తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్ళి చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. పనిలో పనిగా లడ్డు బాబుని లావుగా ఉన్నప్పుడే బాగుండే వాడని చెప్పేసి మరీ వెళుతుంది. అనుకోకుండా జరిగిన పరిణామంతో లడ్డు బాబు మనసు వికలం అయిపోతుంది. దానికి తోడు అసలు మూర్తి తనతో స్నేహం చేసుకుని ఎందుకు తన ఇంటికి తీసుకువెళ్ళాడో తెలుస్తుంది. తన తల్లి మాధురిని లడ్డు బాబు పెళ్ళి చేసుకోవాలనేది మూర్తి కోరిక.

ఒక వైపు తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న మాధురి కుటుంబాన్ని మోసం చేయడం, మరో వైపు మాయ తనని నమ్మించి మోసం చేయడం వంటి సంకట పరిస్థితుల మధ్య నలిగిపోతూ చివరికి తన తండ్రి ఏర్పాటు చేసిన కవల పిల్లల్ని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైపోతాడు. వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బులతో మాధురికి తాను దొంగతనం చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలనేది అతని ఆలోచన. అయితే ఉన్నట్లుండి మూర్తికి అంతు చిక్కని వ్యాధి సోకుతుంది. త్వరలోనే అతను చనిపోతాడని తెలిసి అతని చివరి కోరిక మేరకు మాధురిని పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

విశేషాలు[మార్చు]

ఈ సినిమా దర్శకుడు రవిబాబు ఒక నటుడు చలపతి రావు కుమారుడు. అలాగే హీరో అల్లరి నరేష్ ప్రముఖ దర్శకుడు ఈ. వి. వి సత్యనారాయణ కుమారుడు. నిర్మాత త్రిపురనేని రాజేంద్ర, ప్రముఖ రచయిత త్రిపురనేని మహారధి కుమారుడు. అలా ప్రముఖ దర్శక, రచయిత, నటుల కుమారులతో ఈ చిత్రం తెరకెక్కింది.

మూలాలు[మార్చు]

  1. "Laddu Babu movie review". timesofindia.indiatimes.com. Times of India. Retrieved 11 November 2016.
  2. "రవిబాబు.కాం లో లడ్డు బాబు సినిమా పేజీ". ravibabu.com. రవిబాబు. Archived from the original on 6 అక్టోబరు 2016. Retrieved 11 November 2016.