Jump to content

వజ్జలగ్గ

వికీపీడియా నుండి
వజ్జలగ్గ
కృతికర్త: జయవల్లభుడు
దేశం: భారతదేశం
భాష: ప్రాకృత భాష
విభాగం (కళా ప్రక్రియ): కథా సంకలనం
ప్రచురణ:
విడుదల:


వజ్జలగ్గ కూడా గాథా సప్తశతి వంటి ఒక సంకలిత కావ్యము. దీనియందలి భాషయు దానియందు వలెనే మహారాష్ట్రము. దీని సంకలనకర్త జయవల్లభుడు. ఇతడు శ్వేతాంబరశాఖకు చెందిన జైనుడు. కాలము తెలియదు. ఈ వజ్జలగ్గకే జయవల్లభ మనియు దానిమారుపేరు. ఈకావ్యమునందు 48 పద్ధతులున్నవి. దాదాపు 700 శ్లోకములున్నవి. కవియీ సంకలన మొనర్చునాటికి హాలుడు సప్తశతి ప్రసిద్ధముగా నుండినది. అందుచే ఈతడు గాథా సప్తశతి కూడా నొరవడిగా నుంచికొనియుండును. ఈగ్రంధమునకు వ్యాఖ్యానకర్త రత్నదేవుడు. ఇతడు విక్రమశకపువాడు.

వజ్జలగ్గలోని సంకలములలో గౌడవహములోని శ్లోకములు కొన్ని యున్నవి. సప్తశాతిలోని ప్రసిద్ధమైన అమియం పాఇయకవ్వం అను గాథయు దీనియందున్నది. ఈగ్రంధమునకు వజ్జలగ్గ యని పేరిడుటకు జయవల్లభుడు కారణమీరీతి చెప్పెను.

ఏకత్థే పత్థావే 
జత్థ పడిజ్జంతి పవురగాహావో 
తంఖలు వజ్జాలగ్గం
వజ్జేత్తియ పద్ధయీ భణియూ!

గోష్ఠియందొకానొక ప్రస్తావమునందు పలుకు చాటువు లకు వజ్జలగ్గ మని పేరట. వజ్జ అనగా పద్ధతి అని లగ్గ అనగా శబ్దభవ అని జయవల్లభుడు వ్యాఖ్యానించెను.

హాలుడు, జయవల్లభుడు - వీరిరువురు ఒనర్చిన కార్యమొకటే అయినను ద్రష్టులు విభిన్నములు. హాలుడు రాజు; శృంగారప్రియుడు; స్వయముగా కవి. స్థూల దృష్టితో చూచినప్పుడు సప్తశతిలోని సంకలనమున కొక నిర్దిష్టమగు నుద్దేశ్యము లేదని తోచినను- కొంత చిక్కగ ఆలోచించినచో శృంగారమే హాలుని పరదేవత అని తెలుయును. హాలునికేమి ప్రాకృతమునకే శృంగారము ఉపాస్యదేవత. జయవల్లభుడు జైన సన్యాసి. కనుక ఇతనికి ధర్మము ముఖ్యము. తరువాత అర్ధకామములు. త్రివర్గములను మాత్రమే చేర్చాడు. ఇందులో కామమును ఈతడు అనుషంగీకముగానే చేర్చినట్లున్నదంతే. ఇందులో ఆకాలపు వ్యవహార విషయములు చేర్చబడెను.

అద్ధఖ్ఖ్హర భణియాయిం
ణూణం సవిలాసముద్ధహసి యాయిం
అద్ధఛ్చిపెఛ్చియాయిం
గాహాహి విణా ణ ణజ్జంతి.

సుందరులయొక్క యర్ధాక్షరభణితములు, సవిలాసముగ్ధహసితములు, అర్ధాక్షి ప్రేక్షితములును గాధలు లేక తెలియవట. ప్రాకృత కవులు ప్రకృతిని ప్రేమించిన విధము అసాధారణమైనది. ఆకు నాకులో, పూవు పూవులో జీవితమును, ప్రేమను దర్సించిన పుణ్యులు వారు. ఆతరుణ లలితములగు నెమలిపురులు చెక్కుకొనిపోవు శబరకాంతలు, మానమాణిక్యమును విడువ వీలులేక కన్నీరు పెట్టు హరిణాంగన, ప్రియురాలిని తలచుకొని తొండముతో నెత్తికొన్న కిసలయకబళమును దినక నిశ్చలస్తిమితమైన వనగజము, సల్లక్కెలితా పరిముషిత శిఖరమైన వింధ్యపర్వతము ప్రాకృతకవులు మహాతపస్సు చేసి కవితాలోకమునకు దించుకొన్న వస్తువులు. వింధ్యపర్వతము వారి యింటిదేవత. ప్రాకృతవనములోని స్త్రీలకు శ్యామలవర్ణ మెక్కువ ప్రియమైనది.ఆమె శరీరము నల్లనిది. పయోధరములున్నతములు. విశకలితములై కాలవాహినిలో కలసిపోవుచున్న ప్రాకృత గాథలకు స్వరూపమిచ్చిన జయవల్లభుడు మహాధన్యుడు.

మిత్తం పయతోయ సమం
సారిచ్చం జం న హో ఇ కిం తేణ,
అహియాఏఇ మిలంతం
ఆవఇ ఆవట్టు ఏ పదమం.

ఇది భర్తృహరి నీతిశతకంలో మైత్రిని వర్ణించిన పద్యం వంటిది. మైత్రి-పాలు నీరు కలయిక వంటిది కాకపోతే మరెందుకు? పాలు-నీరు పరిణామం ఎక్కువవుతుంది. ఆపద వచ్చినప్పుడు వేడి కలిగినప్పుడు వట్టిపోతుంది-కలిసి కాగి తగ్గిపోతుంది.ఇక్కడ వట్టిపోవుట అనగ తగ్గిపోవుట అనే తెలుగు పదంతో పోలుస్తారు.

ఓ బిప్పఇ మండల మా
రు ఏణ గేహాంగణాఉ వాహీఏ
సోహగ్గ ధయపడాఇ
స్వ ధణురఓ రుంప రించోతీ.

కొత్తకాపురం. వీరవ్యాధ కుమారుడు.కొత్త మోజులో ఉన్నాడు. కనుక, నవవధువును విడనాడలేక పోతున్నాడు.దానివల్ల బక్కచిక్కిపోయాడు. అందుకే మునుపతి ధనువును పోయలేకపోయాడు.కనుక వధువు ఆ ధనువును చెక్కసాగింది.చెక్కిన ధూళి ఇంటి పైకి ఎగిసి, అమె సౌభాగ్య విజయధ్వజ పటంవలె కనిపిస్తున్నదట.

తే గిరి సిహరా తే పీలు
పిల్లవా తే కరీర కసరక్కా
లబ్బంతి కరహ మరువిల
సియాఇ కత్తో వణేత్థమ్మి.

ఓ లొట్టిపిట్టా! నీవు ఎడారిజంతువు. ఎడారిలోని గుట్టలు, గొలుగుచెట్టు చిగుళ్ళు, వెలుతురు మొగ్గలు ఎక్కడ వుంటాయి ఇక్కడ? ఎడారి విలాసాలు ఇక్కడ ఉండవు కదా! ఇందులో కసరక్కా పదం కసు గాయ లో కసు (వగరు) పదంతో పోల్చవచ్చును.

మడహల్లియాఇ కిం తుహ
ఇమాఇ కిం వా దలేహి తలినేహి
ఆమోఏ మహుయర మా
లేఈఇ జాణిహిసి మహత్సం

ఓ! మధుకరమా మాలతి చిన్నదిగా ఉందని అనుకోకు. ఆకులు, చిగుళ్ళు, ఎలాఉంటే ఏమి? గుబాళింపులో గదా గొప్పదనం తెలుస్తుంది. ఇందులో తలినేహి తెలుగులో తలిర్, తలిరు, తళిర్ అనే చిగురుటాకును తెలుపు పదంతో పోల్చవచ్చును.

జత్త న ఉజ్జగర ఓ
జత్త న ఈసా విసూరణం మాణం,
సబ్బావచాడు అం జత్థ
నత్థి నేహో తహం నత్థి.

ఎక్కడయితే మేల్కొని కాసుక్కూచోడాలు, అసూయ, రుసరుసలు, బింకాలు, మంచి మనస్సుతో ముచ్చట్లు ఉండవో అక్కడ స్నేహం ఉండదు. స్నేహమున్నప్పుడే మేల్కోవడాలు, మూతి విరుపులు, రుసరుసలు, మురిపాలు ముచ్చట్లు ఉంటాయి అంటాడు ఈ వజ్జలో కవి.

తే ధణ్ణా గురిణియం 
బబింబ భారాలసాహి తరుణీహం
పురియాహర దర గగ్గర గిరిహా
జే సంబరిజ్జంతి.

అందమైన స్త్రీలు పెదవులు కదలిస్తూ, కొద్దిగా గరగరలాడే గొంతులోనే స్మరిచే పురుషులు ధన్యులు. ఈ గరగర తెలుగు పదంగా ఊహించవచ్చును.

ఝురఝుల్లంతో రఛ్చా
మహేసు వరమహిలియాణ హత్థేసు 
ఖంధార హారిససఓ
త్వ పుత్తి దఇఓ న చుట్టి హి ఇ.

ఓసీ! వెర్రిదానా? నీ ప్రియుణ్ణి అదుపులో పెట్టుకో. అతడు వీధుల మొదట్లో తిరుగుతూ, స్కంధారంలో చిక్కుకొని వెలుపలికి రాలేని కుందేలులాగా ఏ అందగత్తెల చేతుల్లోనో పడిపోతాడు అని అమాయకురాలిని ఆమె చెలికత్తె హెచ్చరిస్తుంది. ఇందులో ఝురఝుర చురచుర అనే తెలుగు పదంతో పోల్చవచ్చును.

"https://te.wikipedia.org/w/index.php?title=వజ్జలగ్గ&oldid=3056389" నుండి వెలికితీశారు