Jump to content

వల్లభ్‌భాయ్ పటేల్ బాల్యం, విద్యాభ్యాసం

వికీపీడియా నుండి

వల్లభ్‌భాయ్ బాల్యం, విద్యాభ్యాసం అన్నది అతను పుట్టిన 1876 లేక 1975 నుంచి బారిస్టరుగా ఇంగ్లండులో తన విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న 1913 ఫిబ్రవరి 2 వరకూ గల 36-37 సంవత్సరాల జీవితకాలానికి వర్తిస్తుంది. వల్లభ్‌భాయ్

జననం

[మార్చు]

వల్లభ్‌భాయ్ పటేల్ ఈనాటి గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్ అన్న పట్టణంలో జన్మించాడు. వల్లభ్‌భాయ్ తల్లి లాడ్‌బా, తండ్రి ఝవేర్ భాయ్. లాడ్‌బా సోదరుడు డూంగర్ భాయ్ నడియాడ్ పట్టణంలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తూ ఉండడంతో ప్రసవానికి ఆమె తన పుట్టింటికి వెళ్ళడంతో నడియాడ్‌లో వల్లభ్‌భాయ్ పుట్టాడు. నడియాడ్‌కి 12 మైళ్ళ దూరంలో ఉన్న కరమ్‌సాడ్ గ్రామం వల్లభ్‌భాయ్ తండ్రి ఝవేర్ భాయ్ స్వగ్రామం.

వల్లభ్‌భాయ్ పటేల్ ఎప్పుడు జన్మించాడనేదానిపై నిర్ధారణ జరగలేదు. 1897లో ఇంటర్ పరీక్షలు రాసేప్పుడు తన వయసు చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పటికి తోచిన 1875 అక్టోబర్ 31 తేదీని తన పుట్టినతేదీ అని రాసుకున్నాడు. కానీ, తర్వాతికాలంలో అది సుమారుగా వయసు చెప్పడానికి తేదీయే తప్ప కచ్చితమైనది కాదని వల్లభ్‌భాయ్‌ స్వయంగా చెప్పుకున్నాడు. కుటుంబంలో రాసుకున్న లెక్కలు అతను 1876లో జన్మించి ఉండొచ్చని కూడా సూచిస్తున్నాయి. అయితే, పటేల్ వారసులు, భారత ప్రభుత్వం, భారతీయులు కూడా ప్రస్తుతం అక్టోబర్ 31 తేదీనే అతని జయంతిని జరుపుకుంటున్నారు.

వల్లభ్‌భాయ్ పటేల్ పాటీదార్లనే కులంలో జన్మించాడు. పాటీదార్లు అన్న పదానికి భూములపై పట్టాలు కలిగినవారు లేక భూస్వాములు అన్న అర్థం వస్తుంది. పాటీదార్లనే పటేళ్ళు అంటారు. పాటీదార్లు అనేక శతాబ్దాల క్రితం ఉత్తర దిశ నుంచి గుజరాత్‌లో అహ్మదాబాద్, బరోడా నగరాల మధ్యగల చరోతర్ అన్న ప్రాంతంలో స్థిరపడి, అక్కడి అడవులను కొట్టి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. వ్యవసాయంతో పాటుగా సామంతులు, రాజుల దళాల్లో సైనికులుగానూ పనిచేసేవారు. పటేల్ జీవితచరిత్రకారుడు రాజ్‌మోహన్ గాంధీ పాటీదార్ల గురించి రాస్తూ "హిందూ మతం పట్ల కట్టుబాటు, బయటి వారికి వ్యతిరేకంగా అందరూ ఒకటి కావటం, పురుషాధిక్యత, పెద్దల సమక్షంలో మౌనం పాటించటం, ఉమ్మడి కుటుంబంపట్ల విధేయత, బయటి వ్యవహారాలలో స్వతంత్ర వ్యవహరణ" వంటివి పాటీదార్ల లక్షణాలుగా వర్ణించాడు.

వల్లభ్‌భాయ్ తల్లిదండ్రులు ఇద్దరూ పాటీదార్ల కులంలో కూడా మరింత విశిష్టంగా ఛాగామ్ అన్న ఆరు గ్రామాలు, పట్టణాలకు చెందినవారు. ఈ ఛాగామ్ పాటీదార్లు ఇతర ఆరు గ్రామాలు, పట్టణాలకు చెందిన తోటి ఛాగామ్ పాటీదార్లతోనే వివాహ సంబంధాలు కలుపుకునేవారు.

బాల్యం

[మార్చు]

వల్లభ్‌భాయ్ బాల్యం కరమ్‌సాడ్ గ్రామంలో తండ్రి ఝవేర్‌భాయ్‌కున్న రెండస్తుల ఇంటిలో సాగింది. ఆ ఇంటి కింది అంతస్తులో ఒక వరండా, ఒక డ్రాయింగ్ రూమ్, ఒక పడకగది, వంటిల్లు ఉండేవి. భార్యాభర్తలు పడకగదిలో పడుకుంటే కింది అంతస్తులోని డ్రాయింగ్ రూమ్‌లోనూ, వరండాలోనూ ఇతరులు పడుకునేవారు. పై అంతస్తును పండిన ధాన్యాన్ని నిల్వచేయడానికి, కొందరు పడుకునేందుకు వీలుగా వాడుకునేవారు. ఈ విశాలమైన ఇంటిలో చాలామంది కుటుంబసభ్యులతో కలిసిమెలసి ఉంటూ వల్లభ్‌భాయ్ చిన్నతనాన్ని గడిపాడు.

మూలాలు

[మార్చు]

ఆధార గ్రంథాలు

[మార్చు]