వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వరాలయం
వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వరాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నల్లగొండ జిల్లా |
ప్రదేశం: | వాడపల్లి, దామెరచర్ల మండలం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | కాకతీయ, ఇక్ష్వాకులు |
వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వరాలయం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, దామెరచర్ల మండలం, వాడపల్లి గ్రామంలోని దేవాలయం.[1][2] అతి పురాతన దేవాలయాల్లో ఒకటైన ఈ మీనాక్షి అగస్త్యేశ్వరాలయం కృష్ణా నది, ముచికుందా నదుల సంగమ ప్రదేశం వద్ద ఉంది. దేశసంచారంలో భాగంగా కృష్ణా, ముచికందా సంగమ ప్రదేశానికి వచ్చి, దీనిని గొప్ప దివ్యస్థలంగా గుర్తించిన అగస్త్య మహాముని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాడని చరిత్ర చెబుతోంది.[3] ఇక్కడికి సమీపంలోనే వాడపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది.
చరిత్ర
[మార్చు]ఒక రోజు ఒక బోయవాడు పక్షిని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుండగా, బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకొచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడుట. బోయవాడు మరి నాకు ఆకలిగా వుంది ఎలాగా అంటే, కావాలంటే నా తలనుంచి కొంత మాంసం తీసుకోమని శివుడు అన్నాడుట. అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీదనుంచి మాంసం తీసుకున్నాడుట. ఆ వేళ్ళ గుర్తులు శివలింగం పైన ఇప్పటికీ కనబడుతాయి. స్వామి శిరస్సున ఏర్పడ్డ గాయం కడగటానికి గంగమ్మ వచ్చిందిట. బోయ కండలు తీసిన చోట ఏర్పడిన గుంటలో ఎప్పుడూ నీళ్ళు వుంటాయి. ఆ నీరు ఎక్కడనించి వస్తోందో తెలియదుగాని ఎంత తీసినా ఆ నీరు అలాగే వుంటుందట. సా.శ. 1524 సం.లో శ్రీ శంకరాచార్యులవారు శిష్యసమేతంగా ఈ దేవాలయాన్ని దర్శించినపుడు, ఆ బిలం లోతు ఎంత వుందో కనుక్కుందామని ఒక ఉధ్ధరిణకి తాడు కట్టి ఆ బిలంలో వదిలారట. ఎంత సమయమైనా ఆ తాడు అలా లోపలకి వెళ్ళటము చూసి పైకి తీసారుట. ఆ ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నయిట గాని శివయ్య తల మీద గుంట లోతు తెలియలేదుట. శంకరాచార్యులవారు నిన్ను పరీక్షించటానికి నేనెంతవాడను, క్షమించమని వేడుకుని, పూజలు జరిపి వెళ్ళారుట. ఈ విషయంలో శంకరాచార్యుల రాయించిన శాసనం (పాళీ భాషలో) దేవాలయంలో ఇప్పటికీ ఉంది.[4]
విశిష్టత
[మార్చు]ఈ దేవాలయం తూర్పు దిక్కుగా, సంగమాభిముఖంగా వుంటుంది. గుళ్ళో శివుడి పానుపట్టం ఎత్తుగా వుంటుంది. దానిమీద లింగం ఇంకో రెండు అడుగుల ఎత్తు ఉంది. వెండి కళ్ళు, వెండి నాగుపాము పడగ, అలంకరణగా ఉన్నాయి. ఈ లింగము మీద ఒక చిన్న గుంటలో ఎల్లప్పుడూ నీరు వూరుతూవుంటుంది. నీటిమట్టానికి అంత ఎత్తునవున్న లింగం పైనుంచి ఎంతతోడినా నీరు ఎలా వస్తోందో, ఎంత లోతులోవున్నదో ఎవరికీ తెలియదు.[5]
పూజలు, ఉత్సవాలు
[మార్చు]- శివరాత్రి: మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "భక్తులతో కిటకిటలాడుతున్న అగస్త్యేశ్వర స్వామి ఆలయం". ETV Bharat News. 2020-02-21. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.
- ↑ ABN (2021-10-03). "రండి.. చూసొద్దాం". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.
- ↑ "కృష్ణా తీరాన పుణ్య క్షేత్రాలు - 7". TeluguOne Devotional. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.
- ↑ "బోయవాడి ఆకలి తీర్చిన శివుడి తల నుంచి రక్తమాంసాల వాసన అయినా..." telugu.nativeplanet.com. 2018-07-17. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.
- ↑ Velugu, V6 (2019-04-08). "వాడపల్లి పుణ్య క్షేత్రం..శివుడి తలపై బిలం". V6 Velugu. Archived from the original on 2019-04-12. Retrieved 2022-11-28.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)