Jump to content

వాడుకరి:Pavan santhosh.s/వ్యక్తిగత శిక్షణలు

వికీపీడియా నుండి

మాధురి

[మార్చు]

మౌలికాంశాలు

[మార్చు]

వికీపీడియాలో వ్యాసాలను ఎవరైనా రాయవచ్చు, ఐతే విషయ ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని తటస్థ దృక్కోణంలో నిష్పాక్షికంగా స్వంత అభిప్రాయాలు కాక అంశాన్ని వివరిస్తూ రాయాలి. తోటి సభ్యులతో విభేదిస్తూన్నా గౌరవంగా వ్యవహరించాలి. ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా విషయ ప్రాధాన్యత ఉన్న ఏ విషయం గురించి అయినా వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వ వ్యాసాలు రాయవచ్చు.

  • విషయ ప్రాధాన్యత: వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి ఆ విషయం యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక విషయం గురించి విశ్వసనీయమైన ప్రచురణలలో (ఆ సబ్జెక్టుకు సంబంధించిన ప్రత్యేక ప్రచురణలలో కాదు) గణనీయంగా వ్రాయబడితే అది ప్రముఖమైన విషయం అనవచ్చును.
  • తటస్థ దృక్కోణం: వికీపీడియాలోని వ్యాసాలన్నీ తటస్థ దృక్కోణంతో రాయాలనేది వికీపీడియా విధానం. అన్ని ప్రముఖ దృక్కోణాలు, ప్రధానమైన చిన్న, చిన్న దృక్కోణాలను వ్యాసాలు నిష్పాక్షికంగా ప్రతిబింబించాలి. వ్యాసాలు చర్చలను నిష్పాక్షికంగా వివరించాలి గానీ, చర్చలో ఏదో ఒక పక్షం గురించి బోధించ కూడదు. ప్రజలు సాధారణంగా అంతర్గతంగా పక్షపాతం కలిగి ఉంటారు గనుక, ఇది కష్టమైన విషయమే. కనుకనే వ్యాసాలలో ప్రధాన దృక్పధాలకు అన్నింటికీ సముచితమైన స్థానం కల్పించమని కోరుతున్నాం. ఈ దృక్కోణం సరైనది, మరొకటి సరి కానిది, ఇంకొకటి హానికరమైనది - వంటి వ్రాతలు కాని, సూచనలు కాని వ్యాసాలలో అసలు తగవు.
  • మౌలిక పరిశోధనలు, స్వంత అభిప్రాయాలు వద్దు: వికీపీడియాలో రాసేప్పుడు మరి ఎక్కడైనా విశ్వసనీయమైన చోట ప్రచురించిన విషయాలే తప్ప మౌలిక పరిశోధనలు, స్వంత అభిప్రాయాలు నేరుగా ప్రచురించకూడదు.
  • వికీపీడియా మనదే. దీని నిర్వహణలోనూ, రూపకల్పనలోనూ, చర్చల్లోనూ అంతటా మనలా ఆసక్తి ఉండి, సమయాన్ని వెచ్చించి కృషిచేసే వికీపీడియన్లే ఉంటారు. ఇది మనం రూపకల్పన చేసుకుంటున్న విజ్ఞాన సర్వస్వం.

ఉదాహరణ వ్యాసాలు

[మార్చు]

మీరు సినిమా పాటలపై ఆసక్తి, పట్టు ఉన్నాయని తెలిపారు కనుక ఈ సినిమా పాటను ఉదాహరణగా ఇస్తున్నాను:

  • తెల్లవారవచ్చె తెలియక నా సామి (పాట) : వ్యాసాన్ని స్వంత అభిప్రాయాలు వెల్లడిస్తూ రాయలేదు. వ్యాసం తెలుగు వెలుగులో ఈ పాట గురించి రాసిన వ్యాసాన్ని అనుసరించి రాశారు. మీకు కావాలంటే మూలాలు నేను వెతికిపెడతాను, లేకుంటా నా వద్ద ఉన్న హాసం వంటి పత్రికల వ్యాసాలు మీతో పంచుకుంటాను. మీరు రాసేందుకు శాయశక్తులా సాయంచేస్తాను. వికీపీడియాలో రాసే వ్యాసాలు ఎవరైనా పంచుకోదగ్గ లైసెన్సులో ఉంటాయి. ఐతే పాటలకు కాపీహక్కులు ఉంటాయి కాబట్టి, పాట గురించి రాశారు తప్ప పాట రాయలేదు. ఈ శీర్షికలు ఉంటే బావుంటుంది:
నేపథ్యం

సినిమాలో పాట ఏ నేపథ్యంలో వస్తుందో వివరిస్తూ రాయొచ్చు.

పాట పల్లవి

పల్లవి వరకూ రాసి ఊరుకోవాల్సి ఉంటుంది.

రచన విశేషాలు/సాహిత్య విశేషాలు

పాటను రాయించుకోవడం దగ్గర నుంచి పలు విశేషాలు ప్రస్తావించవచ్చు. అలానే సాహిత్య విశేషాలు కూడా ఇక్కడే రావచ్చు. ఐతే స్వంత అభిప్రాయాలు రాయకుండా, ఏదైనా వ్యాసంలో వచ్చిన మూలాలను తీసుకుని రాయండి. మనం ఎంతటి ఎక్స్ పర్ట్ అయినా అయివుండొచ్చు కానీ ఇది మూడో స్థాయి మూలం కాబట్టి. ఉదాహరణకు నేను కలికి చిలకల కొలికి పాట గురించి నా అభిప్రాయాలు, పరిశీలనలు, పరిశోధనలు తెలుగు వెలుగు పత్రికలో వచ్చిన వ్యాసంలో రాసుకున్నాను, దానిని ఆధారం చేసుకుని కలికి చిలకల కొలికి వ్యాసం తెవికీలో రూపకల్పన చేశారు ఒక వికీపీడియన్. అంతేకానీ నేరుగా నా అభిప్రాయాలు ఇక్కడ రాయలేదు, రాయరాదు.

స్వరకల్పన/సంగీతం

సంగీతం రూపొందించడం, గాయకులను ఎంపికచేసుకని పాడించడం, ఏ రాగం వగైరా విశేషాలు ఎన్ని ఈ పాట గురించి ప్రచురితమై ఉన్నా, వాటన్నిటినీ ఇక్కడ రాయొచ్చు.

ప్రాచుర్యం

కొన్ని పాటలు చాలా ప్రాచుర్యం చెందుతాయి. అవార్డులు గెలుచుకుంటాయి. అలాంటి వివరాలు ఆధార సహితంగా ఇక్కడ రాయొచ్చు. మళ్ళీ స్వంత అభిప్రాయాల విషయంలో జాగ్రత్త వహించాల్సిన ప్రదేశం ఇది.

మూలాలు

మీరు ఏయే వ్యాసాల నుంచి, పుస్తకాల నుంచి రాశారో ఆ మూలాలు (లింక్ ఉంటే లింక్, లేకుంటే లేకుండా) ఇక్కడ ఇవ్వాలి. ఇప్పటికే వ్యాసాలు రాసివున్నా వాటిలో ఏవైనా మిస్సై ఉంటే మీరు అభివృద్ధి చేయొచ్చు. ఒక పాట గురించి వ్యాసం ఉందో లేదో తెలుసుకోవాలంటే - పాట పేరుతో పైన కుడివైపు ఉన్న వెతుకు పెట్టెలో వెతికి చూడండి. రెండు మూడు రకాలుగా వెతికినా దొరక్కపోతే అప్పుడు వచ్చే ఎర్రలింకు మీద క్లిక్ చేస్తే కొత్త వ్యాసం సృష్టించవచ్చు. ఆపైన మరే సందేహాలు ఉన్నా నేను కానీ, ఇతర వికీపీడియన్లు కానీ తీరుస్తాం.

కొత్త వ్యాసాలు ఎలా సృష్టించాలన్నది ఈ వీడియోలో చూడొచ్చు