వాడుకరి:Veera.sj/sandbox/సారిక ఆత్మహత్య
కాంగ్రెస్ ఎం పీ సిరిసిల్ల రాజయ్య, అతని భార్య మాధవి, కుమారుడు అనిల్ 5 నవంబరు 2015 న అరెస్టు చేయబడ్డారు. హన్మకొండలో రెవెన్యూ కాలనీకి చెందిన ఇంటిలో రాజయ్య కుటుంబం నివాసముంటోంది. గ్రౌండ్ ఫ్లోర్ లో అనిల్, మొదటి అంతస్తులో సారిక, తన కుమారులు, రెండవ అంతస్తులో రాజయ్య అతని భార్య నివాసముంటారు. 4 నవంబరు 2015 తెల్లవారుఝామున కాలనీ వాసులు కొందరు ఉదయపు నడకకు వెళుతూ మొదటి అంతస్తులో నుండి దట్టంగా మంటలు/పొగ రావటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు ఏడేళ్ళ అభినవ్, మూడేళ్ళు గల కలవలలు అయోన్, శ్రీయోన్ లు పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ముందు రోజు రాత్రి సారికకు, రాజయ్య కుటుంబీకులకు తీవ్రమైన వాగ్వివాదం జరగటం, ఆ ఇంటిలో రాజయ్య కుటుంబీకులు తప్పితే మరెవరూ లేకపోవటం, 2014 లోనే సారిక రాజయ్య కుటుంబీకులపై 498ఏ సెక్షను క్రింద ఫిర్యాదు చేయటం వంటివి జరగటంతో తెలుగు రాష్ట్రాలలో ఈ వార్త దావానలంలా వ్యాపించినది. వీరి మృతిపై అనుమానాలున్నాయని సారిక తల్లి లలిత, చెల్లి అర్చనలు తెలుపటంతో, మహిళా సంఘాలు రాజయ్యను ఉరితీయాలంటూ నినదించాయి.[1] [2] సారికది అనుమానాస్పాద మృతిగా పరిగణిస్తూ రాజయ్య కుటుంబీకులందరిని 14 రోజుల వరకు అదుపులోకి తీసుకొన్నారు.[3]
పూర్వాపరాలు
[మార్చు]1998
[మార్చు]హుజూరాబాద్ లోని కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సారిక ఇంజినీరింగ్ చేరారు. [4]
ఏప్రిల్ 2002
[మార్చు]ఇంజినీరింగ్ లో పరిచయమైన అనిల్ ను సారిక యాదగిరిగుట్టలో వివాహమాడినది.[5] ఇది కులాంతర ప్రేమ వివాహం. సారికది విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం.
2009
[మార్చు]కుటుంబంలో వివాదాలు పెరిగిపోతున్న దృష్ట్యా భర్త/మామల పై సారిక సుబేదారి పోలీసు స్టేషను లో ఎటువంటి కేసులు పెట్టకుండా కేవలం ఫిర్యాదు మాత్రమే చేసినది.
2010
[మార్చు]అనిల్ వివాహేతర సంబంధాన్ని ధృవీకరించుకొన్న సారిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాప్రయత్నం చేసినది.
27 ఏప్రిల్ 2014
[మార్చు]తమది ప్రేమ వివాహం కావటం వలన, తాను ఎటువంటి కట్నకానుకలు తేనందున భర్త అనిల్ తనను లెక్క చేయట్లేదని, ఇంటి ఎదుట సారిక ప్రదర్శన నిర్వహించినది. [6]. తన భర్త మానసికంగా వేధిస్తూ ఏడాది వయసున్న కవలపిల్లల పోషణను పట్టించుకోవడం లేదని సారిక ఆరోపించారు. రాజయ్య ఇంట్లోనే ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం ప్రస్తావించారు. పెద్దల అంగీకారంతోనే తాము ప్రేమ వివాహం చేసుకొన్నా మొదట్లో సఖ్యతగానే ఉన్న తన భర్త క్రమంగా వేధింపులకు గురి చేశాడని, అయితే తన అత్తమామలు సర్ది చెప్పటంతో అతనితో కలిసి ఉంటున్నానని వివరించారు. ఒకమారు తాను ఆత్మహత్యాప్రయత్నానికి పాల్పడ్డా కూడా వారెవ్వరిలో మార్పు గోచరించలేదని, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసిన సమయంలో తన సంపాదన సర్వస్వం భర్త అనిల్ కే ధారపోశానని, అయినా కూడా అనిల్ తన/తన పిల్లల కనీస అవసరాలకు కూడా తనకి డబ్బులివ్వడనీ, వారికి పాలడబ్బాలు, మందులు కూడా సమకూర్చకపోవటంతో తను చాలా ఇబ్బందులు పడుతున్నదని తెలిపారు. వీరిపై ఎన్ని కేసులు పెట్టినా అధికారులను రాజకీయ పలుకుబడులతో ప్రభావితం చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారని వాపోయారు. తనకు న్యాయం కావాలని, పిల్లల పోషణ, వారి చదువు, వైద్యం, రక్షణ బాధ్యతలకు తగిన హామీ కావాలని కోరారు.[7]
10 మే 2014
[మార్చు]వరకట్న వేధింపు వ్యాజ్యంలో రాజయ్య కుటుంబం ముందస్తు బెయిల్ లకు నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకొన్నారు. నిందితులుగా ఉన్న రాజయ్య దంపతులకు బెయిల్ లభించినది. ప్రధాన నిందితుడిగా ఉన్న అనిల్ కు మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించినది. అయితే వారికి ఇచ్చిన బెయిల్ లను రద్దు చేయాలని కేసులో ఉన్న నిందితులందరినీ అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని సారిక డిమాండ్ చేసినది. [8]
14 జూన్ 2014
[మార్చు]వరంగల్ నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో గృహహింస చట్తం ప్రకారం భర్త అనిల్ నుండి జీవనభృతి ఇప్పించాలంటూ సారిక కేసు (సంఖ్య 6/2014) దాఖలు చేసింది.[9]
13 జనవరి 2015
[మార్చు]జీవనభృతి కింద సారికకు నెలకు రూ.6,000 ఒక్కొక్క పిల్లవాడికి రూ.3,000 చొప్పున ముగ్గురికీ రూ.9,000 వెరసి మొత్తం రూ.15,000 భరణం చెల్లించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసినది. అయితే, దీనిపై తనకు ఆదాయ వనరులు లేవంటూ అనిల్ జిల్లా కోర్టులో అప్పీల్ చేయగా ఆ అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. తండ్రి రాజయ్య మాజీ ఎంపీ, తల్లి మాధవి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నందున రూ.15వేలు చెల్లించడం సాధ్యమేనని కోర్టువారు ఆ తీర్పులో పేర్కొన్నారు.[10]
జూలై 2015
[మార్చు]కోర్టు తీర్పుకు అనుగుణంగా అనిల్ భృతి ఏమాత్రం చెల్లించకపోవటంతో సారిక మరల కోర్టును ఆశ్రయించినది. ఏడు నెలల బకాయి 1.05 లక్షలకుగాను రూ. 45,000 ను అనిల్ చెల్లించారు.
2 నవంబరు 2015
[మార్చు]తనకు జీవనభృతి చెల్లించకుండా వేధిస్తోన్న అనిల్ ను అరెస్టు చేయాలని కోరిన సారిక విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైనది. జీవనభృతికి సంబంధించి కోర్టులో సారిక-అనిల్ ల మధ్య వాదులాట జరిగినది. అర్థరాత్రి దాకా ఆస్తి గొడవలు జరిగినవి.
4 నవంబరు 2015
[మార్చు]తెల్లవారుఝామున జరిగిన అగ్నిప్రమాదంలో సారిక తన ముగ్గురు కుమారులతో సహా అగ్నికి ఆహుతైనది. రెగ్యులేటర్ తెరచి ఉంచబడిన వంట గ్యాస్ సిలిండర్ ఒకటి పడక గదిలో ఉన్నది.[11]
5 నవంబరు 2015
[మార్చు]సారిక తనకు తానే రెండు ఎల్ పీ జీ సిలిండర్లను పడకగదిలోకి తీసుకెళ్ళి వాటిని లీక్ చేసినందుకే పేలుడు సంభవించి ఉండవచ్చునని, పిల్లలలో పెద్దవాడైన అభినవ్ పార్థివ దేహం తలుపు వద్దే పడి ఉండటం, అతడు తప్పించుకు పారిపోయేందుకు యత్నించినట్లు తెలుపుతోందని, కానీ లోపలి వైపు నుండి తాళం వేసి ఉండటంతో బాలుడు తప్పించుకొనలేకపోయాడని పోలీసులు తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఆత్మహత్యగా అగుపిస్తోందని, అయినా తాము అన్ని కోణాలలో విచారణ సాగిస్తామని, ఒకవేళ దీని వెనుక ఏదైనా కుట్ర జరిగి ఉన్నా ఛేదిస్తామని అప్పటి వరంగల్లు పోలీసు కమీషనర్ సుధీర్ బాబు తెలిపారు. [12]
ప్రసార మాధ్యమాలతో సారిక తల్లి లలిత -
"She had been brave through all the harassment she had been experiencing all these years. She fought bravely for justice, we can never imagine her committing suicide.
(ఇన్నేళ్ళుగా వేధింపులను ఎదుర్కొంటున్నా కూడా సారిక ధైర్యంగా ఉండేది. న్యాయం కోసం ధైర్యంగా పోరాటం చేసిన సారిక, ఆత్మహత్యకు పాల్పడటం మేం ఊహించుకోలేం.)"
పలు మహిళా సంఘాలు సారిక హత్యపై ప్రదర్శనలు చేసినవి. సుబేదారీ పోలీసు స్టేషనులో ఐపీసీ సెక్షనులు 498ఏ (వరకట్న వేధింపు/గృహ హింస), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించటం) లతో బాటు CrPc (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) 174 (ఆత్మహత్యపై విచారణ చేపట్టి నివేదికను అందించుట) ప్రకారం రాజయ్య కుటుంబీకులను అదుపులోకి తీస్కొని విచారించారు. ఈ విచారణ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని అప్పటి స్థానిక డిసీపీ యాదయ్య తెలిపారు.[13]
వరంగల్ లో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సారిక అంత్యక్రియలు జరిగాయి. పలు మహిళా సంఘాలు రాజకీయ ప్రముఖులు బాధ్యులైన రాజయ్య కుటుంబీకులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇది ముమ్మాటికీ హత్యేనని సారిక కుటుంబీకులు అభిప్రాయపపడ్డారు. [14]
ఫోరెన్సిక్ నిపుణులు సారిక ప్రక్కటెముకలు, అభినవ్, అయాన్ ల కాళ్ళు విరిగి ఉన్నట్లు తెలిపారు. చనిపోయినవారి అందరి ఊపిరితిత్తులలో పొగ యొక్క అవశేషాలు బయటపడ్డాయని తెలిపారు.[15]
మరొక ప్రక్క సారిక వైపు న్యాయవాది రెహానా తనతో పంచుకొన్న బాధల దృష్ట్యా ఇది ఆత్మహత్య కాదని ఖచ్చితంగా హత్యేనని రూఢీ చేశారు. [16]
సారిక, తన ముగ్గురు కుమారులకు వరంగల్ నగరంలోని పోతన స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులతో బాటు విశ్వబ్రాహ్మణ సంఘంలో పలువురు పెద్దలు, మహిళా సంఘ నాయకురాళ్ళు పాల్గొన్నారు.[17]
6 నవంబరు 2015
[మార్చు]సారిక తన న్యాయవాది రెహానాకు/షాహిన్స్ వుమెన్ ఆర్గనైజేషన్ కు పంపిన మెయిల్ ప్రసారమాధ్యమాల చేతికి చిక్కినది.[18] రాజయ్యను వచ్చే ఎన్నికలో నిలపొద్దంటూ ఇదే మెయిల్ ను సారిక AICC ప్రెసిడెంటు సోనియా గాంధీకి కూడా పంపినది.[19] తన భర్త, అత్త/మామలు పదే పదే తనను ఇల్లు విడిచి వెళ్ళిపొమ్మని ఒత్తిడి చేసేవారని, రాజయ్య పార్లమెంటు సభ్యులు అయిన తర్వాత ఈ వేధింపులు మరింత ఎక్కువైనవని, అనిల్ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఈ మెయిల్ లో పేర్కొన్నది. చిన్న చిన్న విషయాలకు కూడా శారీరకంగా హింసించే వాడని, పిల్లల కనీస అవసరాలు కూడా పట్టించుకోకపోవటంతో తాను మంగళసూత్రాన్ని కూడా తాకట్టు పెట్టవలసిన విషమపరీక్షను ఎదుర్కొనవవలసి వచ్చినదని తెలిపినది. రెండవ పర్యాయం గర్భవతిని అయిన తర్వాత పరిస్థితి మరీ దిగజారినదని, తన అత్త ఇంటి పనిమనుషుల ముందు, తన స్వంత బంధుమిత్రుల ముందు కూడా దుర్భాషలాడేదని తెలిపినది. తనని, తన పిల్లలను పస్తులుంచేవారని, ఇది తమకు అలవాటైపోయినదని తెలిపినది. తమ అత్తమామల కోసం చాలా మంది మహిళలు తమ జీవితాలను త్యాగం చేసుకొంటున్నారని, తానేం చేయగలదని రాజయ్య తనను తరచూ ప్రశ్నించేవారని తెలిపినది. అధికారం తమ చేతులలో ఉన్నది కావున, సారిక చట్టపరంగా తమను ఏమీ చేసుకోలేదని అన్నట్లు తెలిపినది.[20]
అనిల్ను అతని తల్లిదండ్రులు వారించకపోగా అతనికే వత్తాసు పలికేవారని సారిక తన మెయిల్ లో తెలిపినది. తమ ప్రేమను అర్థం చేసుకొంటున్నట్లు నటించిన మాధవిని నమ్మి ఘోరమైన తప్పిదాన్ని చేశానని సారిక వాపోయినది. గర్భిణినని కూడా చూడకుండా వంటింటికి తాళం వేసేవారని, అన్ని గదులకు తాళాలు వేసి తనను పిల్లలతో సహా హాల్ కు మాత్రమే పరిమితం చేసేవారని సారిక తన మెయిల్ లో పేర్కొన్నది. తను ఎవరెవరితో ఫోన్ లో ఎంత సేపు మాట్లాడేదో నిత్యం నిఘా వేసేవాడని పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు అనిల్ కనీసం ఒక్క ఉద్యోగం చేయలేదని తెలిపినది. 2007 నుండి 2010 వరకు తాను కలకత్తా, ముంబై, పూణే, వంటి మహానగరాలలో ఉద్యోగాలు చేసినట్లు తెలిపినది. అటు తర్వాతే అనిల్ యొక్క వివాహేతర సంబంధం గురించి తనకు తెలిసినట్లు సారిక తెలిపినది. తొలుత తన వివాహేతర బంధాన్ని అనిల్ ఒప్పుకోలేదని, తర్వాత దాని గురించి ప్రస్తావిస్తే శారీరక దాడికి పాల్పడ్డాడు అని తెలిపినది. తన పుట్టింటివారు పంపిన చీరను సైతం తనని అత్తయ్య తీసుకోనివ్వలేదని, అనిల్ కూడా ఈ వ్యవహారాన్ని వారించలేదని తెలిపినది. వారు పెట్టే బాధలకు అనే మాటలకు చచ్చిపోవాలని అనిపించేది అని సారిక మెయిల్ లో తెలిపినది. [21]
సారిక నుండి తమకు అందిన మెయిల్ గురించి ప్రస్తావిస్తూ షాహిన్స్ వుమెన్ ఆర్గనైజేషన్ కార్యదర్శి జమీలా నిషాద్ సారిక అనుభవించిన క్షోభను, ఆమె నిస్సహాయతను, ఆమెకు జరిగిన అన్యాయాన్ని తలచుకొని కంటతడి పెట్టారు.[22]
చుట్టుప్రక్కల వారిని సారిక ఆత్మీయంగా పలకరించేదని, వారితో కలివిడిగా మాట్లాడే సారికను అత్తయ్య మాధవి తీవ్రమైన దుర్భాషలాడేదని స్థానికులు తెలిపారు. అభినవ్ పుట్టిన తర్వాత అనిల్ కు రెండవ పెళ్ళి చేసినది అత్తయ్య మాధవియేనని తెలిపారు. గతంలో అభినవ్ చేత వేయించిన నామినేషన్ వల్లనే గెలిచాడని నమ్మే రాజయ్య సెంటిమెంటుతో ఈ మారు కూడా వేయించటానికి అభినవ్ ను ఇంటికి పిలిపించుకొన్నట్లు ప్రసార మాధ్యమాలు వెలువరించాయి. అనిల్ నిర్లక్ష్యానికి గురైన సారిక తన స్నేహితుల సహాయంతో నెట్టుకొచ్చేదని, ప్రసార మాధ్యమాలు తెలిపినవి. సారిక సాధారణ గృహిణిగా ప్రవర్తించేదని అక్కడి కిరాణా కొట్టువారు తెలిపారు. [23]
సారిక సాఫ్టువేర్ ఉద్యోగంలో ఉన్న సమయంలో రాజయ్య కుటుంబ సభ్యులకు 20 లక్షల రూపాయల నగదుతోబాటు 10 తులాల బంగారాన్ని అప్పగించారని మహిళా సంఘాలు ఆరోపించాయి. [24]
8 నవంబరు 2015
[మార్చు]సారికది ఆత్మహత్యగనే భావిస్తున్నామని, అయితే భర్త, అత్త/మామలు, అనిల్ రెండవ భార్య సన వేధింపుల వల్లనే ఆమె ఈ దారుణానికి పాల్పడినదని పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. సారికనే తన బెడ్ రూం లోకి గ్యాస్ సిలిండర్లను తీసుకువెళ్ళి, లోపలి నుండి గడియ బిగించి, గ్యాసు లీక్ చేసి నిప్పంటించుకొన్నదని తెలిపారు. మొత్తం 24 మంది సాక్షులను విచారించి ఈ అభిప్రాయానికి వచ్చారని తెలిపారు. కిరోసిన్ లేదా పెట్రోలు వంటి అవశేషాలేవీ ఆ గదిలో దొరకలేదని, మంటలు వ్యాపించినపుడు అందరూ ప్రాణాలతోనే ఉన్నారని, కావున ఇది హత్య్ అని చెప్పలేమని తెలిపారు.[25]
అనుమానాస్పాద మృతిగా పేర్కొనే సెక్షను 174ను పోలీసులు తొలగించారు. బెయిలు కోసం రాజయ్య దంపతులు పిటిషన్ వేశారు. తాము ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఘటన జరిగిన ఇంట్లో తాము ఉండటం లేదని, వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నందున నవంబరు 3న సాయంత్రం ఆ ఇంటికి వచ్చామని తెలిపారు.[26]
14 నవంబరు 2015
[మార్చు]అనిల్ తో అక్రమ సంబంధం నెరుపుతోన్న సన అదుపులోకి తీసుకొనబడినది. [27]
19 నవంబరు 2015
[మార్చు]వరంగల్ జిల్లా కోర్టు రాజయ్య కుటుంబీకులకు బెయిళ్ళను నిరాకరించినది. [28]
27 నవంబరు 2015
[మార్చు]సారికది హత్య కాదని, తాము ముందు రోజు రాత్రి భుజించిన ఆహారంలో ఎటువంటి విషపదార్థాలు కలుపబడలేదని, పొరబాటున/ప్రమాదవశాత్తు సిలిండర్ లీకేజీ వలన మంటలు చెలరేగటం వలనే అందరూ మృత్యువాత పడ్డారని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసినది. ఊపిరితిత్తుల్లో పొగ తాలూకు ఆనవాళ్ళు, మంటలు చెలరేగిన సమయంలో వీరు ఊపిరి అందుకోవటానికి ఉక్కిరిబిక్కిరి అయ్యారని, ఇది హత్య కాదని స్పష్టం చేస్తున్నాయని తెలిపినది. [29]
మూలాలు
[మార్చు]- ↑ డబ్బు కోసమే సారికను హత్య చేశారన్న సారిక తల్లి లలిత (సాక్షి - 4 నవంబరు 2015)
- ↑ మా అక్క ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదు అని తెలిపిన సారిక సోదరి అర్చన (సాక్షి - 04 నవంబరు 2015)
- ↑ రాజయ్య కుటుంబ సభ్యుల అరెస్టు (గ్రేట్ ఆంధ్రా - 04 నవంబరు 2015)
- ↑ సారిక ఇంజనీరింగ్ చేరారు (సాక్షి - 05 నవంబరు 2015)
- ↑ సారిక-అనిల్ ల ప్రేమవివాహం (ఈనాడు - 05 నవంబరు 2015)
- ↑ ఇంటి ఎదుటే ప్రదర్శనకు దిగిన సారిక (డెక్కన్ క్రానికల్ - 05 నవంబరు 2015)
- ↑ తన సంపాదనంతా భర్త అనిల్ కే ధారపోసినా పిల్లల కనీస అవసరాలను కూడా పట్టించుకోరని ప్రసార మాధ్యమాల ఎదుట మొరపెట్టుకొన్న సారిక (సాక్క్షి - 27 ఏప్రిల్ 2014)
- ↑ నిందితులందరినీ అరెస్టు చేసి నాకు న్యాయం చేయండన్న సారిక (సాక్క్షి - 10 మే 2014)
- ↑ [జీవనభృతి కోరిన సారిక (సాక్షి - 07 నవంబరు 2015)]
- ↑ ఆదాయపు వనరులు లేవని తెలిపిన అనిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు (సాక్షి - 07 నవంబరు 2015)
- ↑ సారిక ఆత్మాహుతి (డెక్కన్ క్రానికల్ - 4 నవంబరు 2015)
- ↑ ప్రాథమిక ఆధారాలను బట్తి సారికది ఆత్మహత్యేనని తేల్చిన పోలీసులు (ఇండియన్ ఎక్స్ప్రెస్ - 5 నవంబరు 2015)
- ↑ అదుపులోకి తీసుకోబడ్డ రాజయ్య కుటుంబీకులు (డెక్కన్ క్రానికల్ - 06 నవంబరు 2015)
- ↑ సారిక అంత్యక్రియలు(డెక్కన్ క్రానికల్ - 5 నవంబరు 2015)
- ↑ ఫోరెన్సిక్ నిపుణుల యొక్క ప్రాథమిక అభిప్రాయాలు (రెడిఫ్ న్యూస్ - 5 నవంబరు 2015)
- ↑ సారికది హత్యేనన్న రెహానా (సాక్షి - 5 నవంబరు 2015)
- ↑ సారిక అంత్యక్రియలు (సాక్షి - 05 నవంబరు 2015)
- ↑ సారిక న్యాయావాదికి పంపిన మెయిల్ (సాక్షి - 6 నవంబరు 2015)
- ↑ తన కష్టాలను ఏకరువు పెడుతూ సోనియా గాంధీకి సైతం మెయిల్ పంపిన సారిక (ద హిందూ - 6 నవంబరు 2015)
- ↑ సారిక తన న్యాయవాది రెహానాకు పంపిన మెయిల్ సారాంశం (డెక్కన్ క్రానికల్ - 6 నవంబరు 2015)
- ↑ చచ్చిపోవాలనిపించేది (సాక్షి - 6 నవంబరు 2015)
- ↑ కంటతడి పెట్టిన మహిళా సంక్షేమ సంస్థ కార్యదర్శి (ఈనాడు - 6 నవంబరు 2015)
- ↑ సారిక అందరితోనూ కలిసిపోయేదని తెలిపిన స్థానికులు (సాక్షి - 6 నవంబరు 2015)
- ↑ రాజయ్య కుటుంబ సభ్యులకు సారిక అప్పజెప్పిన కట్నకానుకలు (సాక్షి - 6 నవంబరు 2015)
- ↑ ఆత్మహత్య వల్లే సారిక/పిల్లలు మరణించారు (డెక్కన్ క్రానికల్ - 08 నవంబరు 2015)
- ↑ సారికది ఆత్మహత్యే, కానీ (సాక్షి - 08 నవంబరు 2015)
- ↑ సన అరెస్టు
- ↑ రాజయ్య కుటుంబీకులకు బెయిళ్ళ నిరాకరణ
- ↑ సారికది హత్య కాదని స్పష్టం చేసిన ఫోరేన్సిక్ నివేదిక