Jump to content

వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి

వికీపీడియా నుండి

సుబ్రహ్మణ్య0 ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు. ఇతడు వ్రాసినది మహాభారత తత్త్వ కథనము.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1894వ సంవత్సరం విజయ, మార్గశిర శుద్ధ షష్ఠి నాడు, తూర్పు గోదావరి జిల్లా, కాజులూరు గ్రామంలో తన మాతామహుని ఇంట జన్మించాడు[1]. వారణాసి భావనారాయణ, కామేశ్వరమ్మ ఇతని తల్లిదండ్రులు. స్వస్థలం పిఠాపురం. ఇతడు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు జన్మించడం వల్ల ఇతనికి సుబ్రహ్మణ్యశాస్త్రి అని పేరు పెట్టారు. ఇతడు తన మాతామహుడైన రేగిళ్ల కామశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలను అభ్యసించాడు. పిదప పిఠాపురంలో పేరి పేరయ్యశాస్త్రి వద్ద సిద్ధాంతకౌముది చదువుకున్నాడు. అనంతరం వేదుల సూర్యనారాయణశాస్త్రి వద్ద వ్యాకరణం మహాభాష్యాంతం మంజూషతో సహా చదువుకున్నాడు. అక్కడ ఇతనికి కుప్పా ఆంజనేయశాస్త్రి, దర్భా సర్వేశ్వరశాస్త్రి, వడ్లమాని వేంకటశాస్త్రి సహాధ్యాయులుగా ఉన్నారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యశాస్త్రి శ్రీపాద లక్ష్మీనృసింహశాస్త్రి వద్ద న్యాయశాస్త్రము, దెందుకూరి నరసింహశాస్త్రి వద్ద వేదాంతశాస్త్రము క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. స్వయంకృషితో ఇతర శాస్త్రాలను కూడా అభ్యసించి సర్వతంత్ర స్వతంత్రతను సంపాదించాడు. ఇతడు తాను నేర్చుకున్న విద్యను ఇతర ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులకు భోజనాది సదుపాయాలు కల్పించి గురుకుల పద్ధతిలో బోధించాడు. ఇతని వద్ద శిష్యరికం చేయడం గొప్ప విషయంగా భావించి దూరదేశాలనుండి ఎంతో మంది విద్యార్థులు పిఠాపురం చేరుకొనేవారు. ఇతని శిష్యులలో చాలామంది ప్రాచ్యకళాశాల ప్రిన్సిపాల్స్‌గా,పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా, పురాతత్త్వ శాస్త్ర పరిశోధకులుగా ఉన్నతపదవులు అలంకరించారు.

రచనలు

[మార్చు]

ఇతడు బాల్యం నుండే అనేక వ్యాసాలను వ్రాసి ప్రచురించేవాడు. ఇతడు సుమారు 14 గ్రంథాలను సంస్కృతాంధ్రాలలో రచించి ప్రకటించాడు. వాటిలో కొన్ని:

  1. చేతవనీ ఖండనం
  2. మహాభారత తత్త్వ దీపః
  3. మహాభారత తత్త్వ కథనం
  4. రామాయణ తత్త్వ కథనం
  5. ఆస్తికత్వం మొదలైనవి.

ఇంకా ఇతడు అనేక వ్యాసాలను విశ్వహిందూ పరిషత్తు సావనీరులోను, ఇతర పత్రికలలోను ప్రకటించాడు. తెలుగులోను, సంస్కృత భాషలోను ఆకాశవాణి ద్వారా అనేక ప్రసంగాలు చేశాడు. ఇతర రాష్ట్రాలలో సంస్కృతంలో, ఆంధ్రరాష్ట్రంలో తెలుగులో అనేక మహాసభలలో ఉపన్యాసాలు చేసి మంచి వక్తగా రాణించాడు. అష్టాదశ పురాణాలను తన పురాణపఠనం ద్వారా పిఠాపురవాసులకు వినిపించి వారిని ఆకట్టుకున్నాడు.

బిరుదులు, సన్మానాలు

[మార్చు]

ఇతనికి అనేక బిరుదులు, సన్మాన సత్కారాలు వరించాయి.

ఇతని బిరుదులలో కొన్ని:

  • వ్యాకరణాలంకార
  • బ్రాహ్మీభూషణ
  • వ్యాకరణస్థాపక
  • మహామహోపాధ్యాయ
  • మహాభారత మర్మజ్ఞ
  • బాలవ్యాస
  • తర్క వ్యాకరణ వేదాంత కేసరి

ఇతనికి జరిగిన సన్మానాలలో కొన్ని:

  • విజయవాడలో జరిగిన పండితపరిషత్తులో శృంగేరీ పీఠాధిపతులచే సన్మానం
  • ఆంధ్ర ప్రభుత్వాస్థాన కవి కాశీ కృష్ణాచార్యుల చే సత్కారం
  • త్రిలింగ విద్యాపీఠం వారిచే సన్మానం
  • ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారిచే పురస్కారం
  • పిఠాపురంలో సింహతలాటంతో పౌరసన్మానం

కుటుంబం

[మార్చు]

ఇతడు తన మేనమామ రేగిళ్ల చింతామణి పుత్రిక సుబ్బమ్మను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు భావనారాయణశాస్త్రి, కామశాస్త్రి, చింతామణిశాస్త్రి, రాజేశ్వరశాస్త్రి అనే నలుగురు కుమారులు, కామేశ్వరి, సుబ్బలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు.

మరణం

[మార్చు]

ఇతడు ప్రవచనాలు, ధర్మోపన్యాసాలు, దుర్విమర్శనా ఖండనము తన నిత్యకృత్యంగా పెట్టుకుని జీవిస్తూ తుదకు 1978, మార్చి 3వ తేదీన మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. ఆవ్వారి, వాసుదేవశాస్త్రి (15 July 1979). "బాలవ్యాసాభ్యుదయమూ - నిర్యాణమూ". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 101. Retrieved 27 December 2017.[permanent dead link]