వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 37వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కె.వి.రెడ్డి గా ప్రసిద్ధుడైన కదిరి వెంకటరెడ్డి 1940-1970 మధ్యకాలంలో ఎన్నో ఉత్తమమైన తెలుగు సినిమాలు అందించిన దర్శకుడు, నిర్మాత. ఇతడు దర్శకత్వం వహించిన భక్త పోతన, యోగి వేమన, పాతాళభైరవి, మాయాబజార్ వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలుగా ఈనాటికీ పరిగణింప బడుతున్నాయి. ఇంకా గుణసుందరి కథ, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం, శ్రీకృష్ణసత్యవంటి ఎన్నో సినిమాలు అందించాడు. పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటి లేని మేటి అనిపించుకొన్న కె.వి.రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1 జూలై, 1912 సంవత్సరంలో జన్మించాడు. గృహలక్ష్మి సినిమాకు కేషియర్ గా పని చేశారు. తరువాత వాహినీ సంస్థ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన వందేమాతరం, సుమంగళి, దేవత, స్వర్గసీమ సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశాడు.

కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భక్త పోతన (1942). తరువాత యోగివేమన, గుణసుందరి కథ సినిమాలు తీశాడు. కె.వి.రెడ్డి మరియు విజయా సంస్థల పేర్లను ఆంధ్రదేశంలో ప్రతి ఒక ఇంట్లో మారుమ్రోగేలా చేసిన పాతాళ భైరవి సినిమా 1951 సంవత్సరంలో విడుదలైంది. అయితే కె.వి.రెడ్డి అపూర్వ సృష్టిగా మాయాబజార్‌ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా అతని కళా తృష్ణకూ, సునిశితమైన పనితనానికీ దర్పణం.

నిర్మాణ శాఖనీ, దర్శకత్వ శాఖనీ రెంటినీ ఆకళింపు చేసుకున్న వ్యక్తి కె.వి.రెడ్డి. ఎక్కడా రాజీ పడకుండా వేసుకున్న బడ్జెట్‌లోనే, వ్రాసుకున్న సినిమా నిడివిని దాటకుండా, సుసాధ్యం చేసుకోగలిగిన దర్శకుడు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో కథానాయకులకే కాకుండా ఇతర చిన్న పాత్రలకు సైతం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అతని సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రల విశిష్టతే కాకుండా సంగీతం కూడా ఎంతో బాగుంటుంది. ...పూర్తివ్యాసం : పాతవి