Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 15వ వారం

వికీపీడియా నుండి

ఉర్దూ ఒక ఇండో-ఆర్యన్ భాష, భారత దేశం లో జన్మించింది. ఖరీబోలి, లష్కరి, రీఖ్తి, హిందూస్తానీ దీనికి ఇతర నామాలు. అరబ్బీ (అరబిక్), బృజ్ భాష (హిందీ), పారశీకం (పర్షియన్), ఆంగ్లం మొదలగు భాషల సమ్మేళనం. ప్రపంచంలో దాదాపు 35 కోట్ల మంది మాట్లాడే భాష. భారతదేశపు 23 అధికారిక భాషల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో 2వ అధికారిక భాష.


13వ శతాబ్దం దక్షిణాసియా లోని ముస్లింల పరిపాలనా రాజుల సభలలో సభా భాష గా ఇండో-ఆర్యన్ (హిందూ-ఆర్యన్) ల మాండలికంగా ప్రారంభమయినది. ఢిల్లీ సుల్తానుల, మొఘల్ సామ్రాజ్యపు అధికార భాషగా విరాజిల్లినది. రీఖ్తి, లష్కరి (సైనిక), భాషగా పేరు పడ్డ ఉర్దూ, షాజహాను కాలంలో ఉర్దూ అనేపేరును పొందింది. ఉర్దూ అనే పదానికి మూలం టర్కిష్ పదము ఉర్ద్ లేదా ఓర్ద్, అనగా సైన్యము, సైన్యపు డేరా, లేదా బజారు. దీనిని లష్కరీ జబాన్ లేదా 'సైనికులభాష' గా పేరొచ్చింది. ఎర్రకోట నిర్మాణసమయంలో దీనిపేరు ఉర్దూ గా స్థిరమయినది. 1947లో భారతదేశం విడగొట్టబడి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు, పాకిస్తాన్ అధికారభాషగా ఆమోదింపబడింది. స్వతంత్రభారతదేశంలో హిందీ-ఉర్దూ చెట్టాపట్టాలేసుకొని హిందవి లేదా హిందూస్తానీ భాషగానూ ప్రజామోదం పొందింది.


ఉర్దూ లిపి నస్తలీఖ్, అరబ్బీ మరియు పర్షియన్ భాషల సాంప్రదాయం. కుడివైపు నుండి ఎడమవైపుకు వ్రాస్తారు. అరబ్బీ భాష లోని శబ్దాలను (అరబ్బీ భాషలో ప,ట,చ,డ మరియు గ శబ్దాలు లేవు) పర్షియన్ భాషనుండి ప,ట,చ,డ మరియు గ శబ్దాలను సంగ్రహించి ఉర్దూ భాషా శబ్దాలను ఏర్పరచారు. ఉర్దూ భాషకు నాలుగు మాండలికాలున్నాయి - దక్కని, పింజారి, రీఖ్తా మరియు ఖరీబోలి. ఢిల్లీ, హైదరాబాదు, కరాచి, లక్నో మరియు లాహోర్ లలో తనముద్రను ప్రగాడంగా వేయగల్గింది. ఉర్దూ మూడు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది. ....పూర్తివ్యాసం: పాతవి