Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 22వ వారం

వికీపీడియా నుండి

చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావిత పరచిన అతి ముఖ్య వ్యక్తుల్లో ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానములను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి. చలం 1894మే 18న మద్రాసు నగరంలో జన్మించాడు. చలం తల్లి వేంకటసుబ్బమ్మ, తండ్రి కొమ్మూరి సాంబశివరావు. అయితే తన తాతగారు గుడిపాటి వేంకటరామయ్య దత్తత తీసుకోవడంతో, ఇంటిపేరు మారి గుడిపాటి వెంకటచలంగా పేరొందాడు.


చలం రచనలలో అతను వ్యక్తపరచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు, అప్పటి సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపాయి. కాని, సమాజం అతన్ని అపార్థం చేసుకున్నది. అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని, అతని కథలలో బూతులు ఉన్నాయని ప్రచారం జరిగింది. చలం పుస్తకాలను బహిరంగంగా చదవటానికి భయపడిన రోజులవి. ఆసక్తి గల పాఠకులు, చలం పుస్తకాలని దాచుకుని చదివేవారట. చలం తన కథలు, నవలలో వ్రాసిన విషయాలు అప్పటి సమాజం తట్టుకోలేక పోయినది. అతను సంఘంలో ఒక "విపరీత వ్యక్తి"గా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.


మైదానం, దైవమిచ్చిన భార్య, ప్రేమ లేఖలు, స్త్రీ, మ్యూజింగ్స్ వంటివి చలం రచనలలో సుప్రసిద్ధమైనవి. చలం తన భావాలను వ్యక్త పరచటానికి అనేక రచనా ప్రక్రియలు వాడాడు. కథలు, నవలలు అందులో ముఖ్యమైనవి. నాటకాలు కూడ ఉన్నాయి కాని, అందులో వ్యంగ నాటికలు ఎక్కువ. చలం, శ్రీ శ్రీ వ్రాసిన మహాప్రస్థానంకు ముందుమాట వ్రాసాడు. మహాప్రస్థానంలొని రచనలకు దీటుగా ఈ ఉపోద్ఘాతం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైంది. ....పూర్తివ్యాసం: పాతవి