వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 18వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చింపాంజీ, హోమినిడే కుటుంబానికి చెందిన జంతువు. నిటారుగా నిలబడక చేతులను కూడా నడవడానికి ఉపయోగిస్తుంది. "చింపాంజీ" అనే పదాన్ని రెండు వేరువేరు కోతి జాతుల జంతువులకు వాడుతారు. వీటిలో ఒకటి పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా ప్రాంతాలలో నివసించేది. రెండవ జాతి చింపాంజీలు కాంగో పరిసర ప్రాంతాలలో ఉంటాయి. ఆ జాతి సాధారణ నామం బొనొబో. శాస్త్రీయ నామం Pan paniscus. ఆఫ్రికాలో ఈ రెండు జాతుల చింపాజీల నివాస స్థలాలకు కాంగో నది సరిహద్దుగా ఉంటున్నది. చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు, మానవులు - వీరంతా హోమినిడే అనే జీవ కుటుంబానికి చెందిన జంతువులు. వీటిలో పైన చెప్పిన రెండు చింపాజీ జాతులు మానవ జాతికి అతి దగ్గరగా ఉన్న జంతుజాలం. సాధారణ చింపాంజీ, మరియు బోనొబో అనే ఈ రెండు జాతులూ ఈదలేవు. ఆఫ్రికా ఖండంలో 1.5-2 మిలియన్ సంవత్సరాల క్రిందట కాంగో నది ఏర్పడినపుడు అప్పటి ఒకే జాతి అయిన చింపాజీలు నది దక్షిణాన "బొనొబో"లు గాను, నది ఉత్తరాన సాధారణ చింపాంజీలు గాను పరిణామం చెందాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇలా జాతులు రూపు దిద్దుకోవడాన్ని speciation అంటారు


అడవులలో పెరిగే చింపాంజీలు 40 యేండ్ల వరకు జీవిస్తాయి. పెంపకంలో ఇవి 60 యేళ్ళ వరకు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. టార్జాన్ చిత్రంలో నటించిన "చీతా" అనే చింపాంజీ వయసు 2008 నాటికి 76 సంవత్సరాలు. ఇది ఇప్పటికి రికార్డయిన అత్యంత పెద్ద వయసు గల చింపాంజీ. 1960లో జేన్ గూడాల్ అనే శాస్త్రవేత్త టాంజానియా గోంబె నేషనల్ పార్క్ అడవులలో సాగించిన అధ్యయనాలు చింపాంజీల గురించిన విజ్ఞానానికి ముఖ్యమైనవి. జంతువులలో మనుషులు మాత్రమే పనిముట్లు వాడతారనే అభిప్రాయం అంతకుముందు ఉండేది. చింపాంజీలు పనిముట్లను వాడతాయని ఆమె కనుక్కోవడం ఒక ప్రముఖ పరిశీలనగా భావిస్తారు. తరువాత అడవులలోను, పరిశోధనాగారాలలోను చింపాంజీల గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. ...పూర్తివ్యాసం: పాతవి