Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 22వ వారం

వికీపీడియా నుండి

యుద్ధకాండ, రామాయణం కావ్యంలో ఆరవ విభాగము. భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది. వీటిలో యుద్ధ కాండ ఆరవ కాండము. ఇందులో 131 సర్గలు ఉన్నాయి.


పేరుకు తగినట్లుగా యుద్ధకాండ సుదీర్ఘమైన కధా విభాగం అధిక భాగం యుద్ధ వర్ణనే ఉంది. సుందర కాండలో హనుమంతుడు సీత జాడ తెలిసికొని రామునికి చెప్పిన ఘట్టం తరువాత యుద్ధకాండ మొదలవుతుంది. ఇందులో ప్రధాన ఘట్టాలు - రాముడు హనుమంతుని ఆలింగనము చేసుకొనుట, వానర భల్లూక సేవలతో రామలక్ష్మణులు యుద్ధానికి సన్నద్ధులగుట, విభీషణ శరణాగతి, సాగరమునకు వారధి నిర్మించుట, రామ లక్ష్మణ సుగ్రీవులకు జయ ఘోషతో యుద్ధము ఆరంభం కావడం, రామలక్ష్మణుల మూర్ఛ, నాగపాశ విమోచన, అనేక రాక్షస వీరుల మరణం, కుంభకర్ణుని మరణం, హనుమ ఓషధి పర్వతాన్ని తెచ్చి వానర సేనను, తరువాత లక్ష్మణుని కాపాడడం, కుంభ, నికుంభ, ఇంద్రజిత్తుల మరణం, ఆదిత్య హృదయం స్తోత్రం, రామరావణ యుద్ధం, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము. అనంతరం రామాయణ కధా ఫలశృతి ఉన్నది.


ఈ కాండములో అనేక భాగాలు - ముఖ్యంగా నాగపాశ విమోచన, హనుమ ఓషధి పర్వతాన్ని తీసుకు రావడం, ఆదిత్య హృదయం, రావణ సంహారం, శ్రీరామ పట్టాభిషేకం వంటి భాగాలు పారాయణ చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఉంది.

....పూర్తివ్యాసం: పాతవి