Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 29వ వారం

వికీపీడియా నుండి
నిండు పూతతో ఉన్న మామిడి చెట్టు.
అందంగా కోయబడ్డ మామిడి పండు (ఎడమ). మామిడి నిలువుకోత (కుడి).

మామిడి (Mango) : అనకార్డియేసి కుటుంబానికి చెందిన మామిడికి, 25-30 మిలియన్ సంవత్సరాల పూర్వీకం, నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. దీని జన్మస్థలం దక్షిణాసియా దేశాలైన భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు బర్మా. ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. గరిష్ట ఎత్తు 120 అడుగులు, ముప్పై(30)అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. పుష్పించడం పూర్తి ఐన తరవాత కాయలు రూపు దిద్దుకొని మూడు(3)నుండి ఆరు(6)మాసాలలో పక్వానికి వస్తాయి. ప్రపంచం మొత్తం 38.7 లక్ష హెక్టేర్లలో సాగుబడి వుండగా అందులో భారత్ 16 లక్షల హెక్టార్లలో సాగుబడి చేస్తోంది.

ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితులలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరీబియన్(Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కువగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%)చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(A,B,C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా కొన్నిజాతుల పండు కొంచంపుల్లగా ఉంటుంది. కొన్ని పండ్లు పీచు, ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకర లాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు(ఊరగాయలు), చట్నీ, ఆమ్‌చూర్, మామిడి తాండ్ర లు తయారు చేస్తారు. మామిడి రసాన్ని బాటిల్స్, ప్యాక్ ల రూపంలో వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్, లస్సీ, ఐస్‌క్రీం, ఫ్రూట్‌సలాడ్ ఇంకా అనేక నోరూరించే రకాలు.

భారతీయ సంప్రదాయంలో మామిడి ఆకులు తోరణం ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి పండుగ లేక శుభకార్యం కాని మామిడి తోరణంతోటే ప్రారంభం ఔతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి. మామిడి రకాలు బంగినపల్లి, నీలం, రుమానియా, మల్గోవా, చిలక ముక్కు, షోలాపూరి, అల్ఫాన్సా, కలెక్టరు, ఇమాంపసంద్, ఇంకా . . . . . ....పూర్తివ్యాసం: పాతవి