వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 37వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉన్నవ లక్ష్మీనారాయణ గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా , తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం.

ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో 1877 డిసెంబరు 4వ తేదీన శ్రీరాములు , శేషమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది.1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివాడు. 1906లో రాజమండ్రి ఉపాధ్యాయ శిక్షాణా కళాశాలలో శిక్షణ పొందాడు. 1916లో బర్లాండ్, డబ్లిన్ ‍లలో బారిష్టర్ చదువు సాధించాడు. 1892లోనే లక్ష్మీబాయమ్మతో వివాహం జరిగింది.

లక్ష్మీనారాయణ 1900లో గుంటూరు లో ఉపాధ్యాయ వృత్తి నిర్వహించాడు. 1903లో అక్కడే న్యాయవాద వృత్తిని చేపట్టాడు. 1908లో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. 1917 లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. 1923 లో కాంగ్రెసు స్వరాజ్య పార్టీలో చేరాడు. అలాగే ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శులు ఇద్దరులో ఒకడుగా ఎన్నికయ్యాడు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1931లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరినందుకు, 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో చేరినందుకు జైలు శిక్ష అనుభవించాడు.

ఉన్నవ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించాడు. 1900లో గుంటూరు లో యంగ్‍మెన్స్ లిటరరీ అసోసియేషన్‍ను స్థాపించాడు. 1902 లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించాడు . వీరేశలింగం పంతులు అధ్యక్షతలో తొలి వితంతు వివాహం జరిపించాడు. వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయాన్ని 1906లో ను, పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని, 1912 లోను సందర్శించాడు. 1913 లో జొన్నవిత్తుల గురునాథంతో కలసి విశాలాంధ్ర పటం తయారుచేశాడు. రాయవేలూరు జైలు నుంచి విడుదల అయిన తర్వాత 1922 లో గుంటూరులో శారదానికేతన్‍ను స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించాడు.

పూర్తి వ్యాసము, పాతవి