Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 39వ వారం

వికీపీడియా నుండి

అన్ని జీవుల జీవక్రియలను కాంతి ప్రభావితం చేస్తుంది. కాంతికి ముఖ్యమైన ఉత్పత్తి స్థానం సూర్యుడు. జీవులన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూర్యుని నుంచి శక్తిని పొందుతాయి. సూర్యుడు వికిరణ శక్తిని విద్యుదయస్కాంత తరంగాలుగా విడుదల చేస్తాడు. వీటిలో దేనినైతే మానవుడి కన్ను గ్రహించ గలుగుతుందో దాన్ని దృగ్గోచర కాంతి లేదా దృగ్గోచ వర్ణపటలం అంటారు. దీని తరంగదైర్ఘ్యం 380 nm నుంచి 760 nm వరకు ఉంటుంది. సౌరశక్తిలో చాలా తక్కువ భాగం మాత్రమే వాతావరణం పైపొర వరకు చేరుతుంది. ఇందులో 45 శాతం మాత్రమే భూతలానికి చేరుతుంది. జీవులకు లభించే మొత్తం కాంతి ఆవాసం, ఋతువులను బట్టి మారుతుంది.

కాంతికి కణ స్వభావమూ, తరంగ స్వభావమూ సంయుక్తంగా అవిభాజ్యంగా ఉంటాయి. ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్నీ, కణ స్వభావాన్నీ ఏక కాలంలో పరిశీలించలేము. ఇది వక్రీభవనం, వివర్తనం, వ్యతికరణం,ధృవణం అనే ధర్మాలను కలిగి ఉంటుంది. కాంతికున్న తరంగ స్వభావానికి ఈ దృగ్విషయాలు కారణము. కాంతి విద్యుత్పలితము, కాంప్టన్ ఫలితము, కాంతి రసాయనిక చర్యలు, కృష్ణ వస్తు వికిరణం, ఉద్గార వర్ణపటాలు వంటి ప్రయోగ ఫలితాలు, పరిశీలనలు కాంతికున్న కణ స్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకంగా రెండు లక్షణాలు ఏక సమయంలో ఉండటం వలన కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం ఉందంటారు.

కాంతి పర్యావరణంలో ఒక ముఖ్య కారకం. జీవరాసులపై దీని ప్రభావం నిర్ధిష్టంగాను, దిశవంతంగాను ఉంటుంది. జీవుల పెరుగుదల, శరీరవర్ణం, చలనం, దృష్టి, ప్రవర్తన, కాంతి ఆవర్తిత్వం, సర్కేడియన్ రిథమ్స్ వంటి జీవక్రియలను కాంతి ప్రభావితం చేస్తుంది. మొక్కలలో పత్రహరితం అభివృద్ధికి, కిరణజన్య సంయోగక్రియకు, మొక్కలకు, జంతువుల పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా కాంతి అవసరం. జంతువులలో వర్ణత ను కాంతి ప్రేరేపిస్తుంది. భూమధ్య ప్రాంతంలో నివసించే మానవులు అధిక కాంతి తీవ్రతకు గురవుతారు. కాబట్టి వారి చర్మం ముదురు వర్ణం కలిగి ఉంటుంది. సమశీతోష్ణ ప్రాంతంలో నివసించే మానవులు తక్కువగా కాంతి తీవ్రతకు గురవుతారు. కాబట్టి వారి చర్మం తక్కువ వర్ణం కలిగి ఉంటుంది.

సాధారణంగా జంతువుల పృష్ఠభాగం గాఢమైన రంగులోను, ఉదరభాగం లేతరంగులోను ఉంటుంది. పృష్ఠబాగంపై ఎక్కువ కాంతి పడటం వల్ల అక్కడ వర్ణత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ దృగ్విషయాన్ని కాంతి రక్షక అనుకూలనాలు అంటారు. దీనివల్ల జంతువులు తమ శత్రువుల బారినుంచి రక్షించుకొంటాయి.

పూర్తి వ్యాసము, పాతవి