Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 46వ వారం

వికీపీడియా నుండి
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, భారతదేశంలోని న్యూ ఢిల్లీలో ఉన్న నాటకరంగ శిక్షణా సంస్థ. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయంప్రతిపత్త సంస్థ ఇది. 1959లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా స్థాపించబడిన ఈ సంస్థ, 1975లో స్వతంత్ర సంస్థగా మార్చబడింది. 2005లో డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించగా, 2011లో అది రద్దు చేయబడింది. ప్రస్తుతం, నటుడు పరేష్ రావల్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇది కేవలం ఒక శిక్షణా సంస్థగానే కాకుండా 1964 నుంచి అనుబంధ విభాగం ద్వారా వివిధ దేశాల్లోనూ, దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఎంపిక చేసిన నాటకాలను కూడా ప్రదర్శిస్తూ వస్తోంది. 1989 నుంచి పాఠశాల స్థాయి నుంచి పిల్లల్లో నాటకరంగం గురించి అవగాహన కల్పించడం కోసం సంస్కార్ రంగ్ టోలీ అనే పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇది 8 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు నటనలో శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థ ప్రాంగణంలో కూడా మూడు ప్రదర్శన శాలలు ఉన్నాయి. తన కార్యకలాపాలను విస్తరించేందుకు గాను ఇది 1994 లో బెంగళూరులో ఒక ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించింది. తర్వాత వారణాసి, సిక్కిం, త్రిపుర లో కూడా ఒక ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ తరపున దేశంలో పలు ప్రాంతాల్లో నాటకాలకు సంబంధించిన వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఉంటుంది. 1999 నుంచి ప్రతి యేటా ఢిల్లీలో భారత రంగ్ మహోత్సవ్ పేరుతో నాటక వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. ఇది కేవలం నాటక రంగానికి సంబంధించి ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఉత్సవంగా పేరు గాంచింది. 2008 లో ఈ సంస్థకు బీజం పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంది. ఓం పురి, నసీరుద్దీన్ షా, రోహిణి హట్టంగడి, అనుపమ్ ఖేర్, సీమా బిశ్వాస్, అతుల్ కులకర్ణి లాంటి నటులు ఈ సంస్థ విద్యార్థులు.
(ఇంకా…)