Jump to content

వికీపీడియా:డిజిటల్ తెలుగు సమావేశం

వికీపీడియా నుండి

ప్రపంచ తెలుగు మహాసభలు 2017 నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ నిర్వహించిన "డిజిటల్ తెలుగు" చర్చావేదికలో తెలుగు వికీపీడియా భాగస్వామ్యం గురించిన పేజీ ఇది.

తేదీ సమయం స్థలం

[మార్చు]
  • 2017 డిసెంబరు 17, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ
  • హైదరాబాదులోని బేగంపేటలో టూరిజం ప్లాజా భవనంలో

నిర్వహణ

[మార్చు]

తెలంగాణ ప్రభుత్వం వారి ఐటీ శాఖ

నివేదిక

[మార్చు]

కార్యక్రమం

[మార్చు]

రేపటి తెలుగు వెలిగేందుకు, నిన్నటి వారసత్వం కొనసాగేందుకు వేలయేళ్ళ భాషని మరో వెయ్యేళ్ళు ముందుకు తీసుకువెళ్ళేందుకు డిజిటల్ మాధ్యమాలపై చాలామంది కృషిచేస్తున్నారు. వారందరిని ఒకచోట చేర్చి డిజిటల్ తెలుగుపై జరుగుతున్న వినూత్నమైన ప్రయత్నాలు, భాషను ప్రభావితం చేస్తున్న సాంకేతిక ఆవిష్కరణలపై ఒక చర్చా వేదికను నిర్వహించదలిచినట్లు నిర్వాహకులు ఆహ్వాన పత్రికలో తమ లక్ష్యాలని వివరించారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంగా సమాచార సాంకేతిక రంగాల్లో తెలుగు వాడుక మరియు అభివృద్ధికై తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ అధ్వర్యంలో "డిజిటల్ తెలుగు" పేరున ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

కార్యక్రమంలో యూనీకోడ్ ఫాంట్ల రూపకర్తలు, తెలుగుకు మెరుగైన యాంత్రికానువాదం, స్పెల్ చెకర్ వంటివి రూపొందిస్తున్న సాంకేతిక ఆవిష్కర్తలు, వారితో పనిచేస్తున్న భాషావేత్తలు, అంతర్జాల పత్రికల వ్యవస్థాపకులు, బ్లాగు రచయితలు, సామాజిక మాధ్యమాల్లో పలు వేదికలు నిర్వహిస్తున్న భాషాభిమానులు వంటివారితో పాటుగా తెలుగు వికీపీడియా ద్వారా తెలుగులో సమాచారం, విజ్ఞానం అభివృద్ధి చేస్తున్న వికీపీడియన్లను కూడా ప్రభుత్వ శాఖ బాధ్యులు ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. తెలుగు వికీపీడియాలోనే కాక ఇ-తెలుగులోనూ పనిచేసి కూడలి, లేఖిని వంటి వెబ్సైట్ల రూపకల్పన, నిర్వహణ చేసిన డిజిటల్ తెలుగు కార్యకర్త వీవెన్ కార్యక్రమ సంధానకర్తగా వ్యవహరించారు. తెలుగు వికీపీడియన్లు విశ్వనాధ్.బి.కె., నాయుడు గారి జయన్న,పవన్ సంతోష్, కశ్యప్, ప్రణయ్ రాజ్, వాడుకరి:Nrgullapalli, స్వరలాసిక, కట్టా శ్రీనివాస రావు, అజయ్, నాగరాణి పాల్గొన్నారు. బృందంలోని వికీపీడియన్లలో కొందరు బ్లాగర్లుగానూ, ఇ-తెలుగు వంటి సంస్థల నిర్వహణలోనూ, సామాజిక మాధ్యమాల్లో వివిధ భాషాభివృద్ధి బృందాల నిర్వాహకులుగానూ కూడా ఉన్నారు.

సమావేశంలో పవన్ సంతోష్ మాట్లాడుతూ 2001 నుంచి ప్రారంభమైన వికీపీడియా చరిత్రతో ప్రారంభించి, ప్రపంచంలోని సమస్త విజ్ఞానాన్ని ఒడిసిపట్టాలంటే సమస్త మానవజాతీ ఆ విజ్ఞానాన్ని వినియోగించుకోవాలంటే ప్రపంచ భాషలన్నిటిలోనూ విజ్ఞాన సృష్టి జరగాలన్న ఆలోచనతో ప్రపంచంలోని భాషల వికీపీడియాలతో పాటు 2004లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా చరిత్రను ప్రారంభించారు. 2006లో గ్రామ వ్యాసాలను బాటు ద్వారా ప్రారంభించి, వాటిని క్రమాంతరాల మీదగా పలువురు వికీపీడియన్లు కృషిచేసి విస్తరించడం, పాలసీలను రూపకల్పన చేస్తూ చర్చలు చేసి తెలుగు వికీపీడియా పునాదులు నిర్మించడం, కార్యశాలలతో తెవికీ విస్తరణకు కృషిచేయడం, ప్రపంచ దేశాలు, నగరాలు, భారతీయ జిల్లాల వ్యాసాలు అనువాదం చేసుకోవడం, తెలుగు రాష్ట్రాల జిల్లాల వ్యాసాలు అభివృద్ధి చేయడం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెవికీ వ్యాసాలు రూపొందించుకోవడం, ముఖాముఖీ సమావేశాలు తెవికీ వ్యాప్తమైన పెద్ద స్థాయి వార్షికోత్సవాలుగా ఎదగడం, తెలుగు వికీపీడియన్లు సమిష్టి కృషితో వ్యాసాలు విస్తరించడం, సాహిత్యం, సంస్కృతి వంటి అంశాలలో వ్యాసాలు రాయడం, వగైరా బహుముఖాల తెలుగు వికీపీడియా ప్రస్థానంలోని పలు మార్గాలు వివరించారు. ఈ సందర్భంగా ప్రతీ అంశంపైనా కృషిచేసిన వికీపీడియన్ల పేర్లు, వివరాలు సందర్భోచితంగా ప్రస్తావించారు. పలు జీవిత మార్గాల నుంచి, పలు సామాజిక వృత్తి ఉద్యోగ రంగాల నుంచి వచ్చిన వికీపీడియన్లు సమిష్టిగా చేస్తున్న కృషిని సమావేశానికి తెలియజేశారు.

ఆపైన పవన్ తెలుగు భాషను మాట్లాడుకునేందుకు ఉపయోగించే వ్యవహార భాష, వినోదానికి మాధ్యమంగా పనికివచ్చే వినోద భాష, సాహిత్యవాహిగా ఉపయోగించే సాహిత్యభాష, బోధనకు మాధ్యమమైన బోధన భాష, పరిపాలన సాగే పాలనా భాష, పరిశోధనలు వెలువరించే పరిశోధన భాష, విజ్ఞానాన్ని పంచుకునే విజ్ఞాన భాష వంటి విభాగాలుగా విడదీసి వివరించారు. తెలుగును బోధన భాషగానూ, పరిశోధన భాషగానూ అభివృద్ధి చేయాలంటే తెలుగులో విజ్ఞానాన్ని అభివృద్ధి చేసి విజ్ఞాన భాషగా అభివృద్ధి చేయాలని, ఆ విధంగా తెలుగులో విజ్ఞానాభివృద్ధి మొత్తం భాషాభివృద్ధికే మూలకందంగా ఉందనీ తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషలో విజ్ఞానాభివృద్ధికి తెలుగు వికీపీడియా చేస్తున్న కృషి మొత్తం భాషను బోధన మాధ్యమంగా, పరిశోధన భాషగా, ఇతరేతర అవసరాలకు ఉపయోగించేందుకు ఉపకరించే అత్యంత కీలకమైన కృషి అని, ఈ కృషి ప్రాధాన్యత అర్థం చేసుకుని ప్రజలు, ఇతర సంస్థలు, భాషాభిమానులు, ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వెనువెంటనే స్పందించిన సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ ఇటువంటి కృషికి తమ సహకారం తప్పనిసరిగా ఉంటుందనీ, సిలికానాంధ్ర ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో తెలుగు వికీపీడియాలో రాయడం నేర్పించేందుకు, తెలుగు వికీపీడియా గురించి జనానికి తెలిసేలా వీడియోలు రూపొందించేందుకు సహకరిస్తామని సూచించారు.

ప్రణయ్ రాజ్ 450 రోజులకు పైబడి రోజుకొక వ్యాసాన్ని రాస్తున్న సంగతిని దిలీప్ కొణతం ప్రస్తావించగా, తెలుగు వికీపీడియాలో సంతోష్, మీనా గాయత్రి 100 వికీడేస్ ప్రారంభించగా, తనకూ చేయాలని అనిపించిందనీ, ఐతే 95వ రోజున 100 రోజులతో ఆపకుండా దానిని 365 రోజుల పాటు కొనసాగించాలని ఆలోచన వచ్చిందనీ తెలిపారు. 365 రోజుల్లో మొదటి వందరోజులు తోచిన అంశంపై రాశానని, రెండవ వందరోజులు 100 తెలంగాణకు సంబంధించిన వ్యాసాలు, 3వ 100 రోజులు 100 మహిళలకు సంబంధించిన వ్యాసాలు సృష్టించి విస్తరించినట్టు వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆయన కృషిని అభినందించారు. గుళ్ళపల్లి నాగేశ్వరరావు తాను నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వికీపీడియాలో గ్రామ వ్యాసాల అభివృద్ధి మీదే స్వచ్ఛందంగా పనిచేస్తూంటానని, తాను చేస్తున్న పనిని వివరించగా సభ్యులు అనుబంధ వివరాలు తెలుసుకున్నారు. అజయ్ మాట్లాడుతూ తాను కొత్తగా వికీపీడియాలోనూ, డిజిటల్ తెలుగు అన్న అంశం మీదా కృషి ప్రారంభించానని, ప్రణయ్ రాజ్ వంటి వికీపీడియన్లు తనను ఉత్సాహపరిచి ప్రోత్సహిస్తున్నారనీ తెలిపారు. యువతకు డిజిటల్ తెలుగు రంగంలో జరుగుతున్న కృషి చేరువయ్యేలా చేయాలని కోరారు. నాగరాణి బేతి తన వివాహం రోజునే తెలుగు వికీపీడియాలో ఖాతా తెరిచి, కృషిచేస్తున్నట్టు తెలియజేశారు. కశ్యప్ మాట్లాడుతూ ఇ-తెలుగు, వికీపీడియాల్లో తన కృషి గురించి వివరించారు. కట్టా శ్రీనివాసరావు తెలుగు వికీపీడియాలోనూ, బ్లాగుల్లోనూ, కవిసంగమం వంటి వేదికల్లోనూ, సామాజిక మాధ్యమాల ద్వారానూ తాను చేస్తున్న కృషిని గురించి, డిజిటల్ తెలుగు అభివృద్ధికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.

డిజిటల్ తెలుగుకు సంబంధించి డిజిటైజేషన్, యూనీకోడ్ ఫాంట్లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, బ్లాగులు, సామాజిక మాధ్యమాల్లో గుంపుల నిర్వహణ, ఉపకరణాల రూపకల్పన, స్థానికీకరణ, యూనీకోడ్ ఫాంట్లలో ప్రచురణ వంటి ఇతరేతర రంగాల్లో కృషిచేసిన పలువురు డిజిటల్ తెలుగు సారధులు తమ తమ రంగాల్లో డిజిటల్ తెలుగు వికాసం గురించి, తాము చేస్తున్న కార్యకలాపాల గురించి, భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడారు. మాట్లాడినవారిలో సురేష్ కొలిచాల, అంబరీష, కత్తి మహేష్, జ్యోతి వలభోజు, నల్లమోతు శ్రీధర్, తదితరులు ఉన్నారు.

ప్రతిపాదనలు

[మార్చు]

చివరగా జరిగిన భవిష్యత్తు సెషన్లో తెలుగు వికీపీడియన్లు సహా ఇతర డిజిటల్ తెలుగు సారధులు కూడా చేసిన ప్రతిపాదనలను ఇక్కడ జాబితా వేస్తున్నాం.

పవన్ సంతోష్
  1. స్కాన్ చేసిన పత్రికల, పుస్తకాలలోని వ్యాససూచిని యూనికోడ్ రూపంలో తయారుచేయాలి
  2. వివిధ ప్రాంతాలలో డిజిటల్ తెలుగు గురించి అవగాహన సదస్సులు నిర్వహించాలి
  3. ప్రపంచ తెలుగు మహాసభలలో విడుదలైన పుస్తకాలను, ఫోటోలను, వీడియోలలను స్వేచ్ఛానకలులో విడుదలచేయాలి
కృపాల్ కశ్యప్
  1. ప్రభుత్వానికి స్వంత ఆర్కైవ్ మీడియం ఉండాలి
  2. వారంలో ఒకరోజు ప్రభుత్వంలో మంత్రులు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాల్లో తెలుగు వినియోగిస్తూ, తెలుగును ప్రచారం చేసేలా చూడాలి.
  3. అవసరమైన కొన్ని టూల్స్ ను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
  4. విద్యార్థుల పరీక్షల దరఖాస్తు ఫారంను తెలుగు భాషలో (కనీసం పేరు) పూర్తిచేసేవిధంగా చూడాలి
విశ్వనాథ్
  1. 6నుండి 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ తెలుగు ప్రాజెక్టులు ఇచ్చి, అవి పూర్తిచేసిన వారికి మార్కులు ఇవ్వాలి
వీవెన్
  1. తెలుగుపై సాంకేతికంగా పరిశోధన జరగాలి.
రంజిత్ రాజ్
  1. అన్ని టూల్స్ ఉండేలా ఒక ప్రభుత్వ వెబ్సైట్ చేయాలి
నల్లమోతు శ్రీధర్
  1. ఆ టూల్స్ ఉన్న వెబ్సైట్ లింక్ ను ఈమెయిల్స్ కింద ఇచ్చి పంపిస్తే ఇతరులకు కూడా తెలుస్తుంది
క్లిస్టోఫర్
  1. అన్ని ప్రభుత్వ వెబ్సైట్ తెలుగులో కూడా ఉండాలి
నరేందర్
  1. తెలుగు టూల్స్ వాడకం గురించి ఒక బుక్ లెట్ ఉండాలి
ఉమామహేశ్వరరావు
  1. ఈ సదస్సుకు వచ్చిన వారు టచ్ లో ఉండేందుకు ఒక మాధ్యమం కావాలి
రవితేజ
  1. ఏదైనా కార్యక్రమానికి (గత, చేయబోయే) సంబంధించిన వివరాలకోసం ఒక వెబ్ పోర్టల్ ఉండాలి