వికీపీడియా:వాడుకరులకు సూచనలు/పేజీని మెరుగుపరచే పనులు
Appearance
పేజీని మెరుగుపరచే పనులు ఏమేమున్నాయి?
[మార్చు]ఏదైనా వ్యాసంలో కొత్త సమాచారం చేర్చి, ఉన్న సమాచారాన్ని సవరించి వ్యాసానికి అభివృద్ధి చేస్తూ, మెరుగులు దిద్దుతూంటాం. ఈ పని చేస్తేనే వ్యాసాన్ని మెరుగుపరచినట్లు కాదు. ఇది కాకుండా ఇంకా అనేక విధాలుగా వ్యాసాన్ని మెరుగు పరచవచ్చు. పేజీకి సాధారణంగా ఉండే ఇతర హంగులను చేర్చడం, వాటిని సవరించడం వంటి పనులు చేసి పేజీకి మంచి విలువను చేకూర్చి, దాని నాణ్యతను గణనీయంగా పెంచవచ్చు. అలాంటి కొన్ని పనులు కింద ఉన్నాయి:
- పేజీలో నిర్వహణ మూసలు పెడుతూంటాం (అనాథ వ్యాసం, మొలక వ్యాసం, శుద్ధి చెయ్యండి, తొలగింపు మూస వగైరాల వంటివి). కొన్ని సందర్భాల్లో ఆయా నిర్వహణ పనులు జరిగిన తరువాత కూడా ఈ నోటీసులను తొలగించకపోవడం జరుగుతూంటుంది. (ఉదాహరణకు, 2020 లో నిర్వహించిన మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టు కోసం సన్నాహాలు చేస్తున్నపుడు గమనించిన సంగతి చూడండి.. 600 పైచిలుకు వ్యాసాలు మొలక స్థితి దాటిపోయిన తరువాత కూడా ఆ పేజీల్లో గతంలో పెట్టిన "మొలక" మూసలు అలాగే ఉండిపోయాయి. అప్పుడు ఆ పేజీలన్నిటినుండి ఆ మూసను తీసేసాం) అలాంటివి ఏమైనా ఉన్నాయేమో పరిశీలించి, తీసెయ్యదగిన నోటీసులను తొలగించవచ్చు.
- అనాథ వ్యాసమా?: ఈ పేజీకి వేరే పేజీల నుండి లింకులు (ఇన్‌కమింగు లింకులు) ఏమైనా ఉన్నాయా లేదా? నేవిగేషను పట్టీ లో ఉన్న "ఇక్కడికి లింకున్న పేజీలు" అనే లింకును నొక్కి పేజీ అనాథో కాదో పరిశీలించండి. ఒక వేళ అనాథ అయితే సంబంధిత పేజీల నుండి సముచితమైన లింకులు ఇచ్చి దాన్ని అనాథ పేజీ స్థితి నుండి బయట పడెయ్యవచ్చు. ఈ పని ఎలా చెయ్యాలో తెలుసుకునేందుకు వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం పేజీ చూడండి.
- అగాధ వ్యాసమా?: ఈ పేజీ నుండి ఇతర పేజీలకు కనీసం మూడైనా వికీలింకులు ఉన్నాయో లేదో చూడండి. లేకపోతే చేర్చండి.
- సముచితమైన వర్గాలున్నాయా?: చేర్చాల్సిన వర్గాలేమైనా ఉన్నాయా, ఉన్న వర్గాలు సముచితమైనవేనా అనేది చూసి తగు సవరణలు చెయ్యండి.
- వ్యక్తుల పేజీలకు జనన, మరణ వర్గాలు ప్రత్యేకం. అవి ఉన్నాయా లేదా చూడండి. అలాగే ఆయా సంవత్సరాలు, తేదీల పేజీల్లో వారి జనన, మరణాలు నమోదయ్యాయో లేదో చూసి తగు చర్యలు తీసుకోండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/జనన మరణాల నమోదు ప్రాజెక్టు చూడండి.
- వ్యక్తుల పేజీలను వారి జనం, జీవించిన ప్రాంతాలను బట్టి భౌగోళిక వర్గాలుంటాయి. అకాగే వారి వృత్తి ప్రవృత్తులను బట్టి కూడా వర్గాలుంటాయి. వారి జాతిని బట్టి కూడా వర్గాలుంటాయి. వారి నివాసస్థితిని బట్టి కూడా వర్గాలుంటాయి. ఆయ వర్గాలున్నాయో లేదో చూసి సముచితమైన వర్గాలను చేర్చండి. ఈ విషయమై కొంత సమాచారం కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ ప్రాజెక్టు చూడవచ్చు.
- అంతర్వికీ లింకులున్నాయా?: నేవిగేషను పట్టీలో ఉండే ఇతర భాషల వికీపీడియాల లింకులు ఉన్నాయా? ఒక్క లింకు ఉన్నా ఇక చూడనవసరం లేదు, వదిలెయ్యండి (చాలా సందర్భాల్లో వదిలెయ్యవచ్చు). అసలు ఒక్క లింకు కూడా లేనపుడు మాత్రమే తగు లింకులు ఇవ్వండి. మరిన్ని వివరాలకు అంతర్వికీ లింకులు చూడండి.
- సమాచార పెట్టె ఉందా?: చాలా వికీ పేజీలకు పైన కుడివైపున సమాచారపెట్టె ఉంటుంది. అది ఉండాలన్న రూలేమీ లేదు. కానీ చాలావాటికి ఉంటుంది. అది లేకపోతే సముచితమైన సమాచారపెట్టెను చేర్చండి. అందులో చేర్చాల్సిన సమాచారం వ్యాసం లోనే ఉంటుంది.
- సంబంధిత నేవిగేషను మూసలు ఉన్నాయా?: కొన్ని సందర్భాల్లో ఈ పేజీ విషయానికే చెందిన ఇతర పేజీలన్నిటికీ కలిపి ఒక మూసను తయారు చేస్తారు. ఈ మూసను సాధారణంగా పేజీ అడుగున చేరుస్తారు (కొన్ని సందర్భాల్లో పేజీలో కుడిపక్కన, సమాచారపెట్టెకు దిగువన, కూడా ఉండవచ్చు). ఉదాహరణకు మండలం లోని గ్రామాలు మూస, జిల్లా లోని మండలాల మూస వగైరాలు. వీటిని నేవిగేషను మూసలు అంటారు. అలాంటి మూసలేమీ లేకపోతే సముచితమైన మూస ఉంటే చేర్చండి.
- వికీడేటాలో సవరణలు: నేవిగేషను పట్టీలో "పరికరాల పెట్టె --> వికీడేటా అంశం" అనే లింకును నొక్కండి. అక్కడ అన్నిటికంటే పైన ఉన్న పెట్టెలో లేబులు, వివరణ (డిస్క్రిప్షన్) చేర్చండి.
- వ్యాసంలో సంబంధించిన బొమ్మ ఉందా?: వ్యాసంలో బొమ్మ లేకపోతే, సముచితమైన బొమ్మ కోసం తెవికీ లోను, కామన్స్ లోనూ వెతికి దాన్ని చేర్చండి. లేకపోతే మీరే సముచితమైన బొమ్మను ఎక్కించి, దాన్ని వ్యాసంలో చేర్చండి. ఒకవేళ ఈసరికే వ్యాసంలో బొమ్మ ఉంటే అది బాగానే, సముచితం గానే ఉంటే సరే, లేదంటే మెరుగైన బొమ్మను చేర్చండి.
- చాలా వ్యాసాల చర్చా పేజీల్లో "బొమ్మ చేర్చి ఈ పేజీని మెరుగు పరచండి" అంటూ ఒక నోటీసు పెట్టి ఉంటుంది. బొమ్మను చేర్చారు కాబట్టి ఇక ఆ నోటీసును తీసెయ్యండి. గతంలో బొమ్మను చేర్చాక కూడా ఈ నోటీసును తీసెయ్యని సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అలాంటివి గమనిస్తే చర్చాపేజీలో ఉన్న ఈ నోటీసును తీసెయ్యండి.
- {{Authority control}} ఉందా?: వ్యక్తులు, సంస్థలు, పుస్తకాలు, ప్రదేశాలు వంటి చాలా వ్యాసాల్లో ఈ మూసను చేర్చే ఆస్కారం ఉంది. ఈ మూసను పేజీలో అడుగున చేర్చాలి. ఈ మూసను పేజీలో చేరిస్తే ఎలా కనబడుతుందో తెలుసుకునేందుకు ఉదాహరణగా టి. ఎన్. శేషన్ పేజీలో అడుగున చూడవచ్చు. ఆ వ్యక్తికి అలాంటి ఐడెంటిటీలు లేకపోతే, ఈ మూసను ఆ వ్యక్తి పేజీలో చేర్చినప్పటికీ ఏమీ కనబడదు. ఈసరికే చేర్చారా లేదా అనేది పేజీని దిద్దుబాటు మోడ్‌లో తెరిస్తే కనబడుతుంది. ఈసరికే చేర్చి ఉంటే వదిలెయ్యండి. లేదంటే చేర్చండి. మూస పేరును చేర్చితే చాలు, పరామితులేమీ ఇవ్వనక్కర్లేదు. అయితే నేవిగేషను పట్టీ లోని "వికీడేటా అంశం" లింకు తప్పనిసరిగా ఉండాలి. ఈ లింకు లేని పక్షంలో ఈ మూసకు పరామితులు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవేమీ లేకపోయినా ఉత్తమూసను పేజీలో చేర్చినప్పటికీ నష్టమేమీ లేదు. భవిష్యత్తులో వికీడేటా లింకు ఏర్పడినప్పుడు, అక్కడి పేజీలో ఐడెంటిటీ లక్షణాలను చేర్సితే ఇక్కడ ఈ మూస ఆటోమాటిగ్గా ఆ ఐడెంటిటీ లింకులను చూపిస్తుంది.
- మీకు ఆటోవికీబ్రౌజరు (AWB) వాడుకరి అనుమతి ఉంటే, అది తెరిచి, Pagelist లో ఈ పేజీని చేర్చి, options ట్యాబులో Regex typo fixing అనే అంశాన్ని ఎంచుకుని ఈ పేజీలో దిద్దుబాటు చెయ్యండి. అలా చేస్తే, వికీపీడియా:AutoWikiBrowser/Typos అనే పేజీలో చూపించిన భాషా, శైలి, వ్యాకరణ, తదితర దోషాలు ఈ పేజీలో ఉంటే AWB వాటిని సవరిస్తుంది.
- మూలాల్లో ఏమైనా దోషాలున్నాయేమో పరిశీలించి తగు సవరణలు చెయ్యండి. సాధారణంగా మూలాల్లో దోషాలుంటే మూలాల జాబితాలో కనిపిస్తాయి. వర్గాల జాబితాలో సంబంధిత దోషాల వర్గాలు కూడా కనిపిస్తాయి.
- పేజీ చదవండి, భాషాదోషాలు, శైలీ దోషాలూ ఏమైనా ఉంటే సవరించండి.
- పేజీని చదివాక, మంచి సమాచారం ఉంది, భలే ఉంది ఈ పేజీ అని మీకు అనిపిస్తే, దాని చర్చా పేజికి వెళ్ళండి. ఈ పేజీని గతంలో ఈ వారపు వ్యాసంగా పరిగణించారో లేదో చూడండి. అక్కడ ఆ సమాచారం ఏమీ లేకపోతే, దీన్ని ఈ వారపు వ్యాసంగా పరిగణించవచ్చని సూచిస్తూ {{subst:ఈ వారం వ్యాసంగా పరిగణించవచ్చు}} అని చేర్చండి. ఈ మూసను చర్చాపేజీలో మాత్రమే చేర్చాలి, వ్యాసం పేజీలో కాదు. ఈ సూచన చెయ్యకపోయినా ఈ పేజీ బాగుందని మీరు భావిస్తే ఓ మెచ్చుకోలు మాట రాయండి. ఆ పేజీలో పనిచేసిన వారు మీ వ్యాఖ్య చూస్తే సంతోష పడతారు. లేదు, వేరే ఏమైనా సూచనలుంటే అవి రాయండి.